22, డిసెంబర్ 2008, సోమవారం

కదలడూ - వదలరూ ...!!!


నిలువుటడ్డం ముందు నిల్చున్న కేశవమూర్తికి ఒళ్ళు కుతకుతలాడింది. ఏమాత్రం ఫేసూ-ఫీలింగ్సూ లేనివాళ్ళు..ఆ టీ.వి లో..ఈటీ.వి లో పిచ్చిపిచ్చి వేషాలు వేస్తూ, తామేదో పెద్ద స్టార్స్ ల ఫీలవుతూ ఫోజులు కొడుతుంటే, సూపర్ స్టార్ కావడానికి అన్ని అర్హతలు వున్న తను, ఇంకా ప్రేక్షకుడిలా ప్రజల మధ్యనే వుండిపోవడం భరించలేని బాధనే కాదు..పిచ్చి కోపాన్నీ తెప్పించింది. లాభంలేదు..! ఇక బయలుదేరక పోతే, తన ముందున్న ఉజ్వలమైన భవిష్యత్తు ఖాయం..! సందేహం లేదు..!! ఓ..భయంకరమైన నిర్ణయానికొచ్చేశాడు ' పిండం కేశవ మూర్తి '

మొన్నటి కమల్ హాసన్ లా, నిన్నటి అరవింద స్వామిలా, నేడు కేశవమూర్తి..! సినీ వినీలాకాశంలో మరో వెన్నెల రేడు..! తెలుగు తెరకు మరో కొత్త అందగాడు..!' అంటూ పరిశ్రమ, పత్రికలూ తనని మోసెయ్యడం తథ్యం..! అనుకున్నాడు ఎంతో గర్వంగా - తన సొట్ట బుగ్గలను చూసుకుంటూ -

నిజానికి కేశవ మూర్తి తను ఫీలయ్యేంతటి అందగాడేమీ కాదు. తమతో పోల్చుకున్నందుకు, కమల్ హాసన్, అరవింద స్వాములే ఫీలవుతారు. ఎందుకంటే, కేశవ మూర్తి చిన్నప్పటి 'సొట్ట బుగ్గలు ' అతని వయసుతో పాటే పెరిగి పెద్ద పెద్ద 'లొట్టలయ్యాయి '... అవి తమకు లేనందుకు -

* * * * *
చలనచిత్ర సీమలో గొప్ప నటుడవ్వాలని, ఇంటి నుంచి ఒక్క అడుగు ముందుకేసిన కేశవ మూర్తి , అనుకోకుండా నటుడిగా, సహ నిర్మాతగా రెండు కాళ్ళు బలంగా మోపాడు సినీరంగం మీద. అదీ నిర్మాత 'గాలి వాలేశ్వరరావు ' అందించిన ఉత్సాహ,ప్రోత్సాహాల వలన - వాలేశ్వరరావు తీయబోయే అద్భుత చిత్రానికి సహ నిర్మాత అయిపోయాడు కేశవమూర్తి.
వాలేశ్వరావు జి మూవీస్ కాస్తా, జి.పి మూవీస్ గా మారిపోయింది పిండం కేశవమూర్తి పార్టనరై పోయేసరికి. మొదటి విడత మొత్తంగా ఓ పాతిక లక్షలు క్యాషుతో పాటు, కొత్తగా రంగేసిన పాతకారూ పట్టుకొచ్చాడు.ఆ డబ్బుల్తోనే ఆఫీసు , ఫర్నీచరూ గట్రా చకచకా ఏర్పాటు చేసేశాడు వాలేశ్వరరావు . వెరైటీగా వుంటుందని నార్త్ ఇండియా నుంచి హీరోయిన్ని కాకుండా , డైరక్టర్ని బుక్ చేయడానికి ముంబై వెళ్ళాడు వాలేశ్వర రావు ఒంటరిగా -
* * * * *
"మూర్తి గారు..! వీరు 'మటాండ్కోర్ ' గారని ముంబైలో మన దోస్త్ ..మన సినిమాకు డైరక్టర్..! ఈయన కేశవమూర్తి గారని..కో-ప్రొడ్యూసర్.. మాంఛి నటులు కూడా. మన సిన్మాలో ముఖ్యపాత్ర చేయించాలి మీరు..! " అంటూ వారిద్దరిని ఒకర్నొకరికి పరిచయం చేశాడు వాలేశ్వర రావు.
" నమస్కారం " ఎంతో వినయం గా రెండు చేతులు జోడించి నమస్కరించాడు కేశవమూర్తి.
నోట్లో కసాపిసా నముల్తున్న పాన్ పరాగ్ పేస్ట్ ని ' థూ ' అంటూ పిచికారీ చేసి, " నమష్కార్.." అన్నాడు మటాండ్కోర్ గార పట్టిన పళ్ళతో యికిలిస్తూ -
" పూర్వం బొమ్మేటైనా తీసినారా ..? " అడిగాడు కేశవమూర్తి ఉత్సాహంగా.
కేశవమూర్తి అడిగిందేమిటో అర్ధంకాలేదు మటాండ్కోర్ కి, విస్తుబోయి చూశాడు వాలేశ్వరరావు వంక. " లేదు..లేదు..సుభాష్ ఘాయ్ .. ఖల్ నాయక్..సినిమాతో .. డైరక్షన్ డిపార్ట్ మెంట్లోకి దిగాడు. ఆ తరువాత మనోడి వర్క్ చూసి, సుబాష్ ఘాయ్ గోవింద నిహలానీతో చెబితే, ఆయన ఇల్లాంటోడు నా 'ద్రోహకాల్ ' కి కావాలంటే, అటు వెళ్ళాడు.. " వివరంగా చెప్పాడు వాలేశ్వరరావు డైరక్టర్ ప్రొఫైల్ని.
" ఇస్కా బాద్..నిహలానీ..రామూకొ బోలా...! " చెప్పాడు మటాండ్కోర్ పిసరంత గర్వంతో.
" రామూ ఎవరు..? " అమాయకంగా అడిగాడు కేశవమూర్తి.
" అదే..మన రాం గోపాల్ వర్మ..! అని కేశవమూర్తికి చెప్పి, వెంటనే మటాండ్కోర్ వైపు తిరిగి..
" ఏ సిన్మాకి వర్క్ చేశావ్..? " అని అడిగాడు వాలేశ్వరరావు -
నోట్లోని పేష్ట్ ఎక్కడ మీద పడుతుందోనని టెంక్షన్ పడుతూ, ఆకాశం వైపు తలెత్తి, అడ్డంగా ఆడిస్తూ...
" నై..నై..కాం నై కరా.." అని చెప్పాడు మటాండ్కోర్.
" వర్మతో ప్రోబ్లం ఏటీ..? " ఎంతో కుతూహంగా అడిగాడు కేశవమూర్తి.
" నై..నై.. ఉనో బహుత్ అచ్చా ఆద్మీ హై..వెరిగుడ్ జంటిల్ మాన్.. ఆ..టైంలా..మేరికో హాలివుడ్ ఫిల్మ్ కేలియే,
కాల్ ఆయా.." చెప్పాడు మటాండ్కోర్ మరోసారి పిచికారీ చేసి.
కేశవమూర్తి మరలా ఏదో అడగబోయేంతలోనే, చెప్పాడు వాలేశ్వరరావు
." ఫస్ట్ టైం మన పిక్చర్ ద్వారానే డైరక్టర్ గా పరిచయం కాబోతున్నారు....అదే మన లక్.." ఏంతో ఆనందంగా చెప్పాడు వాలేశ్వర రావు.
' కలిసొచ్చే కాలమొస్తే..అన్నీ ఇలాగే కుదురుతాయి ' అనుకున్నాడు కేశవమూర్తి ఆనందంగా.
అంతలో అక్కడికి కో-డైరక్టర్ బి.యస్.మయ్యా తో కలిసి, చెదిరిన క్రాఫ్ ని దువ్వుకుంటూ, చెదరని చిరునవ్వుతో ఒక వ్యక్తి వచ్చాడు.
" సార్..నేను చెప్పలా..? డైలాగ్స్ అదరగొట్టే రైటరని..ఈయనే..చీకుల...." పరిచయం చేస్తున్న బి.యస్.మయ్య మాటలను ఓవర్ లాప్ చేస్తూ
"..చీకుల కావ్య చరణ్.." తనని తాను పరిచయం చేసుకున్నాడు రచయిత చీకుల కొమరయ్య ఉరఫ్ కావ్య చరణ్, ఎంతో కంగారుగా -
" కధేటైనా రడి చేసినారా...? " అడిగాడు కేశవమూర్తి డైరక్టర్ని.
" స్టోరీ..టైటిల్..సబ్ రడీ హువా.." చెప్పాడు మటాండ్కోర్ చిరునవ్వుతో.
" టైటిలేటి..? " హుషారుగా అడిగాడు కేశవమూర్తి.
" కదల్డూ-వదల్రూ..ఏ హైనా..? " కేశవమూర్తికి సమాధానం చెబుతూ, వాలేశ్వరరావుతో కంఫర్మ్ చేసుకున్నాడు మటాండ్కోర్. అదేనన్నట్టు తలాడించాడు వాలేశ్వరరావు.
" ఓల్డ్ టైటిల్ లాగుంది...? " కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టి చెప్పాడు కేశవమూర్తి, సహ నిర్మాత హోదాలో.
" స్టోరీ నయా హై..! ఆప్ కదల్డూ...నా కేరక్టర్ కి మంచి లైఫ్ యిష్టార్.." యాసగా చెప్పడు మటాండ్కోర్ తెలుగు బాషలో.
" మరి వదల్రూ..అంటే హీరోనేటీ..? " ఉత్సాహం గా అడిగాడు కేశవమూర్తి..
"నై..నై..హీరో అవుర్ విలన్స్...అండ్రూ వష్టార్...ఆ..టైటిల్ల.." పొంగిపోయాడు కేశవమూర్తి.
' అదృష్టం ఎక్కడికో యీడ్చికెళ్ళిపోతుంది ' మురిసిపోయాడు మనసులోనే..!
పొంగిన కేశవమూర్తి మొహం చూస్తూ చెప్పాడు మటాండ్కోర్.
" సీ..కేషవ్ మూర్టీ సాబ్..! నా క్రియేషన్ల మీ కారెక్టర్ హాలివుడ్ని టచ్ చేష్టుంది..ఇస్ ఫిల్మ్ రిలీజ్ హోనేకాబాద్ ..మటాండ్కోర్ ..బోలేతో.. బి.వో.సి.డి..అంటార్ ..అంద్రూ.."చెప్పాడు మటాండ్కోర్ ఎంతో గర్వంగా అందరి వంకా చూస్తూ -
'బి.వో.సి.డి అంటే..?? ' అనే ఎక్స్ ప్రెషన్ వచ్చేసింది అందరిమొహాల్లోకి చాలా కాజువల్ గా -
కాని అది ఎక్స్ ప్రెషన్ లా కాకుండా, యక్షప్రశ్నలా వచ్చింది కేశవమూర్తి నోటి వెంట.
" బి.వో.సి.డి అంటే ఏటీ..? "
"బాక్సాఫీస్ క్రియేటివ్ డైరక్టర్..! " చెప్పాడు మటాండ్కోర్ కూల్ గా, అంత కంటే ఎంతో కాంఫిడెంట్ గా-
ఈసారి 'నో..డౌట్ !' అనే ఎక్స్ ప్రెషన్ వచ్చేసింది అందరి మొహాల్లోకి చాలా నేచురల్ గా.
" అబ్బా..! రియల్లీ అదిరిపోయింది సార్..! " ఉబ్బిపోతూ చెప్పాడు కో-డైరక్టర్ బి.యస్.మయ్యా.
"వండర్ ఫుల్ డైరక్టర్ సాబ్..! సిన్సియర్ గా చెబుతున్నా..! అసలు మీకు నేనే పెడదామనుకున్నా.." ఎమోషన్ లో వాక్యాన్ని పూర్తి చేయలేదు రచయిత చీకుల.
తెల్లబోయి చూసారందరూ అతని వైపు. ' రచయిత చీకుల డైరక్టరుకు పెడదామనుకున్నదేమిటో అర్ధంగాక.' -
"ఇంతకీ స్టోరీ ఏటీ ..? " పెద్ద స్టార్ డం వున్న హీరోలా అడిగాడు కేశవమూర్తి.
కోపం తన్నుకువచ్చింది బి.వో.సి.డి గా ఫీలయ్యే మటాండ్కోర్ కి. కానీ తమాయించుకుని చెప్పాడు సమాధానం..
" ఇది చెప్పే స్టోరీ కాదు..తీషి చూపించాలా..టోటల్ హైటెక్ ఫిల్మ్..ఆల్ మిక్సింగ్..సోషల్..హిష్టారికల్..మైథాలజీ..మిక్సిడ్ విత్ ఫాంటసీ..." చెప్పాడు కూల్ గా, అతన అద్భుతమైన స్టొరీ పాయింట్ ని-
అది విన్న వెంటనే భయంతో వణికిపోయాడు కేశవమూర్తి.
"ఏటి పులుసులా అనీ కలిపేసి తీత్తే ..సూత్తారంటారా జనం..? " ప్రశ్నించాడు వెంటనే,
తన టాలెంట్ నే శంకించేసరికి పిచ్చికోపం వచ్చేసింది మటాండ్కోర్ కి -
" సీ..కేషవమూర్టీ సాబ్..! ఆప్ కో.. డైరక్టర్ మటాండ్కోర్ కా టాలెంట్ నహీ మాలూం..! హం కో మిఠాసఖే యిస్ జమానా కో థం నహీ..జమానా చల్తీ హై హం సే..! హం జమానా సే నహీ..!!" ఆవేశంతో వూగిపోతూ, కవిత్వం చెప్పినట్టు చెప్పాడు మటాండ్కోర్.
ఆవేశం వచ్చినప్పుడు కవిత్వం అట్లా వూపేస్తుంది అతడ్ని.
"ఆహా...! ఏం చెప్పార్ సార్..! మాకు నేర్పించే దమ్ము ఈ కాలానికి లేదు..కాలం నడుస్తుంది మాతోటే.. మేము కాలంతో పాటు కాదు...ఆహా..అద్భుతం సార్..! ఎవరు చెప్పారో గానీ, మీగురించీ, మీ టాలెంటు గురించీ చెప్పినట్లుంది..," తెలుగు తర్జుమాతో ఫీలవుతూ, భజనమోత మోగించాడు రచయిత చీకుల.
లక్షలు పెట్టుబడి పెడుతున్న నిర్మాత తను. తనకే డౌట్ గా వుంటే, రేపు సిన్మా ఎలా హిట్ అవుతుంది..?
అందుకే కోపం వచ్చింది కేశవమూర్తికి.
"నానేటి అంతన్నను.. మీకేటి అంత సీరియస్సు...? " కోపంగా అడిగాడు కేశవమూర్తి.
కోపం వచ్చేసరికి గాలి వాలేశ్వరరావుకి పనిబడింది.
' వీడి మొహం మండా..! వీడికి అప్పుడే కోపం వచ్చేస్తే ఎలా..? కొంపలంటుకుపోవూ..? " అనుకున్నడు వాలేశ్వరావు మనసులో. వెంటనే కలుగజేసుకుని ...
"జగదేక వీరుడు - అతిలోక సుందరీ .. మన రాఘవేంద్ర రావు గారు తీస్తే, ఎగపడి చూడలేదాండీ జనం..? " చెప్పాడు సమాధానం కేశవమూర్తి భయాన్ని కొట్టిపారేస్తూ -
"నిజమే కదా ? నాబుర్రకెందుకు తట్టనేదూ..? " మనసులో అనుకోవాల్సిన మాటలను అమితాశ్చర్యంతో ఒళ్ళు మరిచి.. పైకే అనేసాడు కేశవమూర్తి -
" మీ రాఘవేండ్ర రావ్...అవుర్.. డాషరి నారయణ్ రావ్.. డైరక్షన్ అంటే ఏమిటో నేర్చుకుంటార్...మన ఫిల్మ్ చూషి.." చెప్పాడు మటాండ్కోర్ శూన్యం లోకి చూస్తూ-
ఉబ్బిన మటాండ్కోర్ మొహం చూసి, 'బహుశా వాళ్ళు నేర్చుకుంటున్న సీన్ కనిపిస్తుంది కాబోలు ' అనుకున్నారు మిగతా వాళ్ళు...
" సౌత్ లో మణిరత్నం ఒకడండి..గ్రేట్ డైరక్టర్..." తర్వాత ఏం చెప్పిచావాలో తోచక ఆగిపోయాడు రచయిత చీకుల.

చీకుల అసలు ఏం చెప్పదలుచుకున్నాడో, మణిరత్నం పేరు అసలు ఎందుకు చెప్పాడో, ఎవరికీ అర్ధంగాలేదు. విన్నవారికి మాత్రం ' పాపం మణిరత్నాన్ని మాత్రం వదిలిపెట్టండి..' అన్న్న అర్ధం స్ఫురించింది.

"ఓ..హో.. ఉనో బహుత్ అచ్చా కిలాడీ..! హమారా ఫిల్మ్ ఉన్ కో భీ సిఖానా..స్క్రీన్ ప్లే బోలేతో క్యా హై.." కసిగా చెప్పాడు మటాండ్కోర్, మణిరత్నం మీద పగబట్టినట్టు -
బి.వో.సి.డి. భయంకరమైన కసికి మురిసిపోతున్నాడు నిర్మాత గాలి వాలేశ్వరరావు , తన సిన్మా సూపర్ హిట్ ని తలుచుకుని-
ఉద్రేకంతో వూగిపోతున్నాడు రచయిత చీకుల, తన అద్భుతమైన డైలాగ్స్ తో ప్రేక్షకుల మైండ్స్ అదరగొట్టాలని -ఉత్సాహంతో కొట్టుకుంటున్నాడు కో-డైరక్టర్ బి.యస్.మయ్యా -తన సహకారంతోనే బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రద్దలవుతాయని -
భయంకరంగా వణికిపోతున్నాడు సహ నిర్మాత కేశవమూర్తి, లాక్స్ లో పెట్టిన పెట్టుబడి కాకుండా, ఓన్లీ బాక్సులే తిరిగొస్తాయేమోనని -

* * * * *
కేశవమూర్తి గదిలోకి వచ్చేసరికి మిగతా నలుగురూ, ఏదో ధీర్ఘాలోచనలో వున్నట్టు కనిపించారు. విషయం తెలియక కేశవమూర్తిలో టెంక్షన్ ప్రారంభమైంది.
"కధ బాగా వచ్చింది..ఎంతో ఎక్సైటింగ్ గా వుంది. ఎంత బడ్జెట్ అయినా ఫర్వాలేదు..చిరంజీవి గార్నే ప్రయత్నిద్దాం..ఏమంటారు మూర్తిగారు..? అడిగాడు వాలేశ్వరరావు ఒక నిశ్చయానికి వచ్చినవాడిలా -
" ఇప్పుడాయన పోలిటిక్స్ లోకి వచ్చారు కదా ఒప్పేసుకుంటారా అని..? " ఎంతో ఉద్రేకంగా అడిగాడు కేశవమూర్తి.
" ఏమండీ..! యన్.టి.ఆర్. సి.యం. అయిన తరువాతనే కదా..శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర తీసింది..? " టక్కున ప్రశ్నించాడు వాలేశ్వరరావు. తెల్లమొహం వేసాడు కేశవమూర్తి. ఆ తెల్ల మొహం లోకి తొంగిచూస్తూ చెప్పాడు వాలేశ్వరరావు...
" చూడండి మూర్తిగారు..! చిరంజీవి గారు పోలిటిక్స్ లోకి వచ్చేముందు ఎలాగైనా ఒక సినిమా చెయ్యాలని ప్లాన్ చెయ్యలా..? స్టోరి కుదరక ప్రొజెక్ట్ డ్రాప్ చెసారు గానీ..లేకుంటే ఒక పక్క యాక్షన్ని...మరో పక్క ఎలక్షన్ని ఒక పట్టు పట్టేవారు..అంతేకదా..?
"అయినా మనం కొత్త వాళ్ళం గదా..? ఎంత స్టోరీ బాగున్నా మనకి ఓ.కే. అంటారా అని..? "
"మూర్తిగారు ! ఫీల్డు మీకు కొత్త గానీ, నాకూ, చిరంజీవి గారికీ కొత్త కాదు కదా..? అయినా, ఠాగూర్, శంకర్ దాదా సిన్మాలు తీసినోళ్ళు, అంతకు ముందు ఆయనతో ఏ సినిమాలు తీసారో చెప్పండి..? సూపర్ డూపర్ అయ్యే స్టోరీలు కాబట్టే కదా..ఆయన డేట్లిచ్చింది..? రేపు మన కధ విన్న తరువాత, ఆయన ఏ పరిస్థితిలో వున్నా ఓ.కే అనాల్సిందే..నో..డౌట్.." తన ఇరవై ఏళ్ళ అనుభవాన్ని రంగరించి పరిశ్రమ తత్వాన్ని, చిరంజీవి మనస్తత్వాన్ని వివరించాడు వాలేశ్వరరావు.
కేశవమూర్తి శంకలన్నీ పటాపంచలైపోయాయి..
" ఆయనకు నచ్చితే,తెలుగుతో పాటే ,హింథీలోనూ తీద్దామనొచ్చు..! " తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు చీకుల.
" ఆయన ఎక్కడ తీద్దామన్న..ముందు మనం ప్రిపేర్ అయివుండాలి..అడ్వాన్స్ మనీతో..." కేశవమూర్తినే చూస్తూ చెప్పాడు వాలేశ్వర రావు.
'ఒకవేళ చిరంజీవి గారు డేట్స్ గానీ యిస్తే..ఎవరితో క్లాప్ కొట్టిచ్చాలి..ఎవరితో కెమెరా నొక్కిచాలి.. ఎంత గ్రాండ్ గా ఓపినింగ్ చెయ్యాలి..' అన్న ఆలోచనలో అప్పటికే డీప్ గా మునిగిపోయి వున్నాదు కేశవమూర్తి -
*****
కాలంతో పాటే కధాచర్చలు జరుగుతున్నాయి. యథాప్రకారం రూపాయిలు ఖర్చవుతున్నాయి తన సినిమా ఏమిటో ? తన పాత్ర ఏమిటో ? అసలేమీ తెలియటం లేదు కేశవమూర్తికి. అందరూ కలిసి గదిలోకి దూరి నవ్వుకుంటారు. తను వెళ్ళేసరికి నవ్వటం ఆపేస్తారు. మొత్తానికి ఎదో గూడుపుఠాణి జరుగుతుంది. తీవ్రంగా ఆలోచిస్తున్నాడు కేశవమూర్తి, ఏలా తేల్చుకోవాలో తెలియక -
"పి.కే గారు అర్జంటుగా.. ఓ .. ఐదు లక్షలు క్యాష్ కావాలండీ..! " సీరియస్ అడిగాడు ప్రొడక్షన్ మేనేజర్ నూకరాజు. అతని వెనుక నుంచుని వున్నాడు క్యాషియర్ భిక్షపతి, చేతిలో కాళీ బ్రీఫ్ కేస్ తో -నూకరాజు అందరిని ఇంగ్లీష్ పొడి అక్షరాలతో పిలుస్తుంటాడు. 'పి.కే ' అన్నందుకు కోపం తన్నుకువచ్చింది పిండం కేశవమూర్తికి. సీరియస్ గా చూసాడు నూకరాజు వంక.
'ఎందుకేటి అంత సొమ్ము..? ' అన్న అర్ధాన్ని తీసుకున్నాడు నూకరాజు ఆ చూపుల్లోంచి.
"బ్రహ్మానందం, భరణి,కోట గార్లకు అడ్వాన్స్ యివ్వడానికి...ఏమంటారు పి.కే గారు ..అవతల లైన్లో గుండు గారున్నారు.." తొందర పెడుతూ చెప్పాడు నూకరాజు.
"ఉంటే ఉండానీయస్సా...! ఏటివాయ్..మంచి-మర్యాదా లేదా..? పి.కే ఏటి..? ఏటి పీకియ్యాలా ? సిరంజీవన్నారు...నాగార్జునన్నారు..సివరికి మరి ఉత్తదో నిజమో ? ఎంకటేసు సంతకం ఎట్టిన కాయితం సూయించి, మరో పదిలక్షలు తెప్పించేసినారు. ఇంకెక్కడి పైకం..? మావోల్లందరూ వోపినింగెప్పుడా ? సూటింగెప్పుడా అని ఎదురు సూత్తావున్నారు...ఇక్కడేమో సుయ్యీ-సయ్యీ నేదు.." బాగా మురికిపట్టిన గుడ్డని బండకేసి బాదినట్లు వుతికిపారేశాడు కేశవమూర్తి నూకరాజుని. బిక్క చచ్చిపోయాడు నూకరాజు.
"హీరోయిన్ని తేవటానికి జీ.వి.గారు బొంబాయి ఎళ్ళారు కదండీ..? లేకుంటే ఆయన్నే అడుగుదును.." వూపిరి తీసుకుంటూ మరలప్రయత్నం మొదలెట్టాడు నూకరాజు.
అతను చెప్పింది నిజమన్నట్టు గట్టిగా తలూపుతున్నాడు భిక్షపతి కాళీ బ్రీఫ్ కేస్ ను వదిలిపెట్టకుండా -
" ఏటివాయ్.. ..తెత్తారు బొంబాయి నుంచి ? అలవా ? " ఈసడింపుగా అడిగాడు.
'అలవా ' అంటే ఏమిటీ అన్నట్టు చూశాడు నూకరాజు భిక్షపతి వంక.'
హల్వా...హల్వా ' అంటూ లిప్ మూమెంట్ యిచ్చాడు భిక్షపతి నీరసంగా వెనక్కి తిరుగుతూ -
* * * * *
" సిన్మా హిట్ కి కదలడు పాత్రే ఆయువుపట్టు. .." నవ్వుతూ చెప్పాడు చీకుల.
" ఆ పాత్రే అటువంటిది. ఆడియన్స్ నీ యిట్టేపట్టు.. " నవ్వాపుకోలేక ఇబ్బంది పడుతూ చెప్పాడు కో-డైరక్టర్ బి.యస్.మయ్యా.
" టెరిబుల్ సీన్స్..అండ్ ..డెడ్లీ కామెడీ..." పగలబడి నవ్వుతున్నాడు మటాండ్కోర్.
"మనోడేమో పిండం...పాత్రేమో బ్రహ్మాండం..." తుళ్ళుతూ చెప్పాడు వాలేశ్వరరావు.
' ఓ..హో..." ఘొల్లుమన్నారందరూ ఒక్కసారిగా -
అప్పుడే లోపలికి వస్తున్న్న కేశవమూర్తి చెవిలో పడ్డాయామాటలు. నిర్ఘాంతపోయాడు. సహనం చచ్చిపోయింది సహనిర్మాతకి. ఈ రోజు తనేమిటో ? తనకిచ్చిన పాత్రేమిటో ? తేల్చుకోవాలి. ఎంతో ప్రశాంతంగా వాళ్ళున్న గదిలోకి అడుగుపెట్టాడు కేశవమూర్తి.
"డైరక్టర్ గారు మీరు సెప్పే గొప్ప కదలడు పాతరేమిటండీ ..? " చాలా కూల్ గా అడిగినప్పటికీ, కేశవమూర్తి మాటల్లోని తీవ్రతకు అదిరిపడ్డారందరూ. చెప్పనా ? వద్దా ? అన్నట్లు చూసాడు మటాండ్కోర్ వాలేశ్వరరావు వంక. చెప్పమన్నట్టు కళ్ళతో సైగ చేశాడు వాలేశ్వరరావు. బిగుసుకుపోయి కూర్చున్నారు మిగతావారందరూ.
'కదలడు పాత్ర, సినిమాలో దాని నిడివి, హీరో, విలన్స్ మిగతా అన్ని పాత్రలు దాని చుట్టూ తిరగడం, దాని వల్ల పుట్టుకొచ్చే చచ్చేటంతటి కామెడీ... మొత్తం వివరించాడు మటాండ్కోర్ ధైర్యంగా- తన అద్భుతమైన హాలివుడ్ పాత్రని - ఓపికగా విన్న కేశవమూర్తి ఉగ్రరూపం దాల్చాడు ఒక్కసారిగా -
" ఛస్..ఊర్కోయస్సా..! ఏటిరా ? ఏటది గొప్ప పాతరా ? కద ఇంటావుంటేనే రోత పుడతా వుంది...డబ్బులెట్టి ఎవడు చూత్తాడురా దీన్నీ..? ఇలాంటి సెత్త కద నట్టుకుని ఇంతర్ నేసనల్ బొమ్మ తీసేత్తన్నానని కలలుగంతన్నావా ? నువ్వు తీసి సూపిత్తే ఆలివుడ్ ని టచ్ చేత్తదా ? మరి చెయ్యదేటి..? కళాకండం కదా ? థూ..నీ యమ్మా..! ఇలాటి సెత్త సినిమా తీసి సూపిత్తే..జనం తీసినోల్లని..చేసినోల్లని..కండలు..కండలుగా నరికి పోగులేట్టేత్తారు..నీ పాతరా వొద్దూ, పాడి వొద్దూ..నీ కాడే వుంచీసుకో.. " ఖాండ్రించి వూసినంత పనిచేసాడు కేశవమూర్తి. ఉగ్ర నరసింహుడిలా వున్నాడు ఊగిపోతూ -
బిక్క చచ్చిపోయాడు పాపం ..! 'బాక్సాఫీస్ క్రియేటివ్ డైరక్టర్ మటాండ్కోర్.... '
" అది కాదు సార్.. మీది మాంఛి..." ఇంకా ఏదో చెప్పబోయాడు రచయిత చీకుల.
" ఆ..మాంఛి జీవకలున్న పాతరంతావా ? మరి కాదేటి ? నోర్మూయస్సా..సిడతలు కొట్టే నాయాలా.." ఉరిమాడు పులిలా. ఒంట్లో రక్తం ఇంకి పోయింది చీకుల కొమరయ్యకి.
"కదలడు అంటే టైటిల్ రోల్ కదా సార్..! బాగా వెరైటీగా కూడా వుంటుంది.." తన వంతు ప్రయత్నం చేసాడు పాపం బి.యస్.మయ్య.
" మరి మా గొప్ప ఎరైటీ..కాదేటి మరీ..? ఏటివాయ్..నీ పేరు బి.యస్.మయ్య అంటే ఎరైటీ అనుకుంతన్నావా...? ఎవులికి తెలీదు..నీ పేరు బొచ్చుల సోమయ్యని..." గాలి తీసేసాడు బి.యస్.మయ్య గా గొప్పపేరు సంపాదించుకోవాలని కలలు కంటున్న బొచ్చుల సోమయ్యది.
"మూర్తిగారు..ఏమన్నా తేడా జరిగితే క్షమించండి..." అభర్ధిస్తూ చెప్పాడు వాలేశ్వరరావు. ఇంతలా రియాక్ట్ అవుతాడని వూహించలేదు వాలేశ్వరరావు ఎప్పుడూ కూడా-
"ఏటివాయ్..తేడా ఏటి..? అంత సొమ్మిచ్చింది ఇసుంటి దిక్కుమాలిన పాతరకేటీ..? ఆ పాతరా వొద్దూ...ఈ జాతరా వొద్దూ..నా పైకం నాకిప్పించు..నానూరెల్లిపోతాను..ఛి..ఛీ.." చీదరించేశాడు వాలేశ్వరరావును, హీనంగా చూస్తూ -
సరిగ్గ అప్పుడే గదిలోకి రాబోతున్న నూకరాజు, భిక్షపతి లోపలి వాతావరణాన్ని గ్రహించి, బయటే నిలబడిపోయి వినసాగారు చెవులురిక్కించి....
" అది కాదు మూర్తి గారు ! సిన్మా మధ్యలో మీరిలా...." అనునయంగా చెప్పబోయాడు వాలేశ్వరరావు. "మజ్జలో ఏటి..? ఆదినుంచి సూత్తానే వున్నా మీ సిన్నెలన్నీ.పదెకరాల రేగడి పొలం..పోరంబోకు ఎదవలకి ఖర్చెట్టేసినాను.. మోజుపడి వొచ్చినందుకు తీర్చేసినారు బులబాటం..నేర్పించేసినారు గునపాటం...." ఆపై మాటలు పెగలక, పొంగుకొచ్చే దు:ఖాన్ని దిగమింగుకుంటూ వడివడిగా వెళ్ళిపోయాడు కేశవమూర్తి.
మాటలను విన్న భిక్షపతికి గానీ, నూకరాజుకి గానీ, కేశవమూర్తిని అంత బాధించిన ఆ 'కదలడు 'పాత్రేమిటో అర్ధంకాలేదు.అరగంట తరువాత బయటకొచ్చిన రచయిత చీకులని అడిగాడు నూకరాజు.
" సి.కే.సి. గారు ఇంతకీ కదలడు పాత్ర అంటే ఏంటండీ..?
" వాడి పేరులోని తలా-తోకా తీసెయ్యండి..మిగిలిన మొండెమే వాడి పాత్ర.. " కసిగా చెప్పాడు రచయిత చీకుల కోపంగా వెళ్ళిపోతూ.
ఒక్కక్షణంలో అర్ధమైంది యిద్దరికీ కదలడు అంటే ఏమిటో..?
" ఓరి దొంగముండా కొడుక్కుల్లారా ! కదలడూ అంటే శవమనా అర్ధం ?
అవునులే..! పాపం నోరులేని కేశవమూర్తికి.. మీరిచ్చింది నోరుమెదపని శవం పాత్ర.
ఆయన దగ్గర సొమ్ములు అయిపోయేంత వరకూ దెయ్యంలా పట్టుకున్న మీరు వదలరూ...
అసలు 'కదలడూ-వదలరూ ' అన్న టైటిల్.. సినిమాకి కంటే, మీ బతుకులకే బాగా సరిపోతుంది .."
మనసులో అనుకున్న మాటలను, తట్టుకోలేక పైకే అనేసాడు బిక్షపతి, కాళి బ్రీఫ్ కేస్ని ఒక మూలకి విసిరేస్తూ - కొయ్యబారిపోయాడు ప్రొడక్షన్ మేనేజర్ నూకరాజు శవం లా...గొప్ప షాకుతో...!!!
* * * * *

కామెంట్‌లు లేవు: