17, మార్చి 2010, బుధవారం

గీతార్ధసారం !!

మానవుడు ఎంత దుర్భలుడు ? సర్వావయవములు సమన్వయంగా పనిచేస్తుంటే, తాను సర్వేశ్వరుడననే గర్వం ! ఇక వాటిలో ఏ ఒక్క అవయవమైనా, తన విధిని విడనాడితే తాను సర్వం కోల్పోయాననే దైన్యం !!

అర్ధమవసాగింది శ్రీపతిరావుకి జీవితం యొక్క పరమార్ధం. ఆలోచిస్తున్నాడు హాస్పటల బెడ్ మీద పరుండి - శరీరంలోని అవయవల్లానే... కుటుంబంలోని వ్యక్తులు, వారితో సంబందాలు, వారి విధులూ, సంఘంలోనివ్యక్తులూ - వారి వృత్తులూ. ఎవరి సహకారం లోపించినా, గమనం గతి తప్పుతుంది.

తాము కష్టపడి పనిచేసి పరిశ్రమకు లాభాలను ఆర్జించి పెట్టామని కార్మికులు, బోనస్ పెంచమైని కోరితే, తన పెట్టుబడితోనూ, పలుకుబడితోనూ, లాభాలను పొందాననే అహంతో వారి కోరికను మన్నించలేదు శ్రీపతిరావు. అది చిలికి చిలికి గాలివాన అయినట్లుగా, కార్మికుల కోరిక స్ట్రెంగ్త్ పెరిగి స్ట్రైక్ గా మారింది. ఇప్పుడు లాకౌట్ ప్రకటించాల్సిన పరిస్థితులలో వుంది. అయినప్పటికీ శ్రీపతిరావు అహం ఆనందించిందే గానీ, మనసు ఆలోచించలేదు. ఆరోగ్యం మాత్రం చెడింది.

హార్ట్ ఎటాక్ వచ్చి హాస్పటల్లో జాయిన్ అయినా అమెరికా, కెనడా దేశాలనుంచి వచ్చి చూసేందుకు తన ఇద్దరి కొడుకులకు తీరికలేదు. అతి కష్టం మీద ఎలాగొలా తీరిక చేసుకోవాంటే నష్టం తప్ప లాభం లేదు. సూపర్ స్పెషాలిటీ హాస్పటల్లో వి.వి.ఐ.పి. ట్రీట్మెంట్ పొందుతున్న శ్రీపతిరావు, ధనంతో అనారోగ్యాన్ని నివారించగలిగాడే కానీ, అనుబంధాన్ని మాత్రం పొందలేకపోయాడు.

*****

ఆ రోజే శ్రీపతిరావు హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్నాడు. బాల్య స్నేహితుడు సీతా రామారావు దగ్గరే వుండి ప్రత్యేకమైన శ్రద్దతో, అన్ని విషయాలు చూస్తున్నాడు. హాస్పటల్ గుమ్మందాటి ఆవరణలోకి వచ్చిన శ్రీపతిరావు కళ్ళముందు కనిపిస్తున్న నిజాన్ని చూసి నమ్మలేకపోయాడు. తనతో వాదించి, విభేదించి... తనని హాస్పటల్ పాలుచేసిన కార్మికులు... తన శక్తితో ఎవరినైతే అణచివేయాలని తపిస్తున్నాడో ఆ కార్మికులు... తన కళ్ళెదుట ? విషాద వదనాలతో, కన్నీళ్ళ ప్రవాహంతో, మండుటెండను సైతం సహిస్తూ, పసిబిడ్డలతో సహా, తనని చూసేందుకు వేచివున్నారు.

"బాబుగారూ..." ఘొల్లుమన్నారందరూ ఒక్కసారిగా శ్రీపతిరావుని చూసి.

ఎంతో దర్పంగా, ఆడంబరంగా వుండే శ్రీపతిరావునే చూశారు ఇంతకాలం. ఇలా దైన్యంతో చూసే సరికి వారి హృదయాల్లో తెలియనంత బాధ సుళ్ళు తిరిగిపోయింది. వారి దు:ఖాన్ని చూసిన శ్రీపతిరావు హృదయం కూడా చలించింది.

" మమ్మల్ని క్షమించండి... మా వల్లనే మీకిన్ని కష్టాలొచ్చాయి " ఘొల్లుమని విలపించాడు కార్మిక నాయకుడు రాఘవ.
" మీ ఉప్పు తిని మీ మీదే కత్తి కట్టినాం... మేము దుర్మార్గులం బాబు...దుర్మార్గులం..." భోరుమని విలపించాడు యాదయ్య. అతను శ్రీపతిరావు వద్ద ఎంతో కాలంగా పనిచేస్తున్నాడు. ఇలాంటి స్థితిలో ఎన్నడూ చూడలేదు యజమానిని.

" ఊర్కో... రాఘవా ! యాదయ్యా ! ఊర్కోండి ! మీ అందరి దయవల్ల నేను బాగానే వున్నానుగా ? కూల్ డౌన్..కూల్ డౌన్.." మమత నిండిన గుండెతో ఓదారుస్తున్నాడు శ్రీపతిరావు కన్నతండ్రిలా.

అక్కడ గుమిగూడివున్న కార్మికుల బాధ మరింత పెరిగింది యజమాని ప్రేమార్తికి.

" ఇంతమంది హృదయాల్లో కొలువై వున్న మీ సారుకి ఏం కాదు. పదండి... భగవంతుడు కూడా మిమ్మల్నుంచి ఆయన్ని వేరుచెయ్యలేడు..." కారు వద్దకు దారి తీసూ చెప్పాడు సీతారామారావు.

రెండు చేతులతో వారందరికీ నమస్కరిస్తూ మెల్లగా కారు ఎక్కాడు శ్రీపతిరావు. అశ్రునయనాలతో, చెమర్చిన హృదయాలతో వీడ్కోలు పలికారు కార్మికులంతా. కారు కదిలింది మెల్లగా.

" సీతా ! ఏమిటిరా ఇదంతా ? నమ్మలేకుండా వున్నాను..." ఆశ్చర్యం నిండింది శ్రీపతిరావు స్వరంలో.

" దిసీజ్ క్వైట్ నేచురల్ శ్రీపతి ! సుఖాలు మనుషుల్ని దూరం చేస్తాయి. కష్టాలు దరికి చేరుస్తాయి. నువ్వు మామూలు మనిషిగా వున్నంతవరకూ, వాళ్ళు తమ డిమాండుని సాధించుకునేందుకు నీతో పోరాడే యోధులయ్యారు. నువ్వు హాస్పటలైజ్ అయ్యావని తెలిసిన మరుక్షణం సర్వం కోల్పోయిన అనాధలయ్యారు ..." వివరించాడు సీతారామారావు కార్మికుల మానసికస్థితిని.
" మరి ఫ్యాక్టరీ, స్ట్రైక్, లాకౌట్...? " సందేహంతో ఆగిపోయాడు శ్రీపతిరావు.
"ఎప్పుడైతే నువ్వు హాస్పటల్లో చావు బతుకుల మద్య ఊగిసలాడుతున్నావని తెలుసుకున్నారో, అప్పుడే వారిలో మథనం ప్రారంభమైంది. వాళ్ళ వల్లనే నీకు ఇంతటి కష్టం వచ్చిందని, ఆ పాపం వారిదేనని విలపించి, తమ కోరికను త్యాగం చేసి యథాప్రకారంగా మరలా పనుల్లోకి వచ్చారు..." వివరంగా చెప్పాడు సీతారామారావు.

వింటున్న శ్రీపతిరావుకి తన మనసుని ఎవరో మెలిపెడుతున్నట్టుగా అనిపించింది. రక్త్తం పంచుకుని పుట్టిన కొడుకులు ఇలాంటి సమయంలోనే రాలేకపోతే మరి ఎప్పుడొస్తారు ? తన భార్య చనిపోయినప్పుడు కూడా పెద్దకొడుకు రాలేదు. తల్లికి తలకొరివి పెట్టే బాధ్యత చిన్నకొడుక్కి వుంది కాబట్టి వాడైనా వచ్చివుంటాడు. డాలర్స్ కి తప్పా మమ్మీ,డాడీలకు విలువలేని దేశంలో జీవనం గడుపుతున్నవారు, అంతకుమించి ఎలా స్పందిస్తారు ?

న్యాయమైన కోర్కెను సైతం త్యజించి, తమ ఆశల్నీ, ఆనందాలనీ త్యాగంచేసి , మరలా పనిలోకి వచ్చి చేరారంటే...ఎవరు వీళ్ళు ? వీరికీ, తనకు మద్యగల సంబంధమేమిటీ ? తన సంపద తన మిత్రునికి ఏనాడూ సహాయపడకున్నా, బాద్యతగల ప్రభుత్వోద్యోగంలో వుండీ, తన సేవలో నిమగ్నమయ్యాడంటే...ఈ సీతారామారావుకీ, తనకూ మద్యగల అనుబంధమేమిటీ ? స్నేహబంధం కాకుండా -' ఆలోచిస్తూనే వెనక్కివాలాడు శ్రీపతిరావు.

*****

సీతా ! నీలాగ సంతోషంగా వుండాలంటే ఏం చెయ్యాలిరా ? " ప్రశ్నించాడు శ్రీపతిరావు దీక్షగా తన ముక్కల్ని చూస్తున్న సీతారామారావుని.
" త్యాగం చెయ్యాలి...ఇదిగో ఇలాంటివాటిని... " ఆఠీన్ రాణిని విసిరేస్తూ చెప్పాడు సీతారామారావు.
"త్యాగం చెయ్యాల్సింది డబ్బుల్నా ?" మరలా ప్రశ్నించాడు శ్రీపతి శాంతంగా.
"దాంతో పాటు చాలా వాటిల్ని... అనుబంధాల్ని... ఆప్యాయతల్నీ... మొహాల్నీ... మోసాల్ని... ఆశల్నీ... ఇటువంటి ఆసుల్నీ..." ఇస్పేట్ ఆసుని డిస్ కార్డ్ చేస్తూ చిన్నగా నవ్వుతూ చెప్పాడు.
"వీటినన్నింటిని నువ్వు వదిలేశావా ?" అదే ముక్కని తీసుకుంటూ అడిగాడు శ్రీపతిరావు.
"వదిలి పెట్టాల్సిన భాధేలేకుండా అసలు పెంచుకోలేదు వేటినీ కూడా... పెంచుకుంటే పెరిగేది కౌంటే... అది పి.సి గానీ, బి.పి గానీ...నాది షో ..." అన్నాడు సీతారామారావు ముక్కని మూస్తూ.

"నీలాగా ఒక సీక్వెన్సూ..రెండు జోకర్ల ఆట కాదురా నాది... ఏ.సి.. డి.సి..." చెప్పాడు శ్రీపతిరావు సీతా రామారావు జీవితంతో తన పేకముక్కల్ని పోలుస్తూ.
" అందుకే కదరా నీకు కౌంటో... ఎమౌంటో తగుల్తావుంటాయి " చెప్పాడు సరసంగా.
" ఇది నిజమే " మనస్పూర్తిగా ఒప్పుకున్నాడు శ్రీపతిరావు గొల్లుమని నవ్వుతూ -
ఎంతో హాయిగా వుంది శ్రీపతిరావుకి ఆ సంభాషణ. ఓర్వలేని మనసు శ్రీపతిరావుకి కొడుకుల సంగతిని గుర్తుచేసింది ఆసమయంలో.
" సీతా ! వీళ్ళు నిజంగా కొడుకులే నంటావా ? " ప్రశ్నించాడు ధీర్ఘంగా ఆలోచిస్తూ. పంచిన పేకముక్కల్ని ఎత్తుకోలేదు శ్రీపతిరావు . అతని మూడ్ అర్ధమైంది సీతారామారావుకి.
" శ్రీపతి డోంట్ ఫీల్..జనరేషన్ పూర్తిగా మారిపోయింది. దానికి తగ్గట్టుగా మనమూ మారాలి..."
"వాట్స్ ద బ్లడీ జనరేషన్ ? జనరేషన్ మారిందని ఆడవాళ్ళు నవమాసాలు మోయటం మానివేశారా ? తల్లితండ్రులు పిల్లల బాగోగులు చూడటం మానివేశారా ? వాళ్ళలాగే మనం కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తించివుంటే, ఇవాళ ఇటువంటి పరిస్థితులు వుండేవా ? " ఆవేశం కట్టలు తెంచుకునే ప్రయత్నం చేస్తుంది శ్రీపతిరావు గుండెలో -
" నిదానంగా ఆలోచించు శ్రీపతి ! తాము కన్నవాళ్ళు తమని వృద్ధాప్యంలో చూస్తారో ? లేదో ? అన్న సంశయం కనుక కలిగితే, ఏ తల్లితండ్రులైనా ప్రాణమిచ్చి ప్రేమగా పెంచగలరా పిల్లల్నీ ?" ప్రశ్నించాడు సీతారామారావు ప్రశాంతంగా.
" ఈ ప్రశంకు సమాధానం చెప్పాల్సింది నువ్వు చెప్పే జనరేషన్ " విసుగ్గా చెప్పాడు శ్రీపతిరావు.
" నిజమే శ్రీపతి! నేను చెప్పేదేమిటంటే ఇవాళ ప్రతిఫలాపేక్షలేని జీవే...చిరంజీవి. మనం పంచి ఇచ్చే దేనినుంచైనా, ప్రతిఫలం ఆశించకపోవటం ఉత్తమ లక్షణం " చెప్పాడు సీతారామారావు కూలుగా.
" ఏమిటిరా ఆశించకూడనిది ? చావుబతుకుల్లో ఉన్నప్పుడు కన్నకొడుకుల్ని చూడాలనుకోవడం, వారి సమక్షంలో గడపాలనుకోవడం...ఆపేక్ష అవుతుంది గానీ, ప్రతిఫలాపేక్ష ఎలా అవుతుందిరా ? వారి పిల్లలు ఇటువంటి స్థితిలో వుంటే పరుగులు పెట్టిరారూ ? ఈ వయసూలోనూ మనం పరుగులుపెట్టి పోమూ " చెప్పాడు శ్రీపతిరావు శూన్యంలోకి చూస్తూ.

" అదేరా నేనూ చెప్పేది. తండ్రి బాధ్యతే అలా పరుగులు పెట్టిస్తుంది..." అన్నాడు సీతారామారావు.
" వృద్ధాప్యం కూడా బాల్యం లాంటిదే కదరా ? మరో మనిషి ఆసరా అవసరం కాదా ? వారికోసం తపించి వారి మంచిస్థితిని అందించి వారు సంపాదనలో ఉన్నతమైన స్థితిలో వుండేలా చేయగలిగానే కానీ, సంస్కారంలో ఉన్నతుల్ని చేయలేకపోయాను " తీవ్రమైన నైరాశ్యం శ్రీపతిరావు మాటల్లో ధవినించి కన్నుల్లో తడిలా కనిపించింది. గుండెల్లో బాధ కవ్వంలా చిలుకుతుంటే వెన్నలా వస్తుందా విలాసం ?
శ్రీపతిరావు మానసిక ఆందోళన అర్ధంకానిదేమెకాదు సీతారామారావుకి.
"శ్రీపతీ! ఋణానుబంధంతో సంతానం ప్రాణానుబంధంతో సంతోషసంతాపాలు పుడతాయి. ఏదీ మనం ఊహించైంది కాబోదు. జరిగిన దాన్ని స్వీకరించడం, జరుగబోయేదాన్ని స్వాగతించడం మన విధి..." ఉపశమనంగా చెప్పాడు.
సీతారామారావు మటులు కొంత ప్ రశాంతతను అందించాయి శ్రీపతిరావుకి.
అది గమనించి మరలా చెప్పాడు సీతారామావు " ఇప్పుడు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా వుండు " చెబుతూఒ శ్రీపతిరావు చెయ్యి నొక్కాడు అనునయంగా స్పృశిస్తూ-
"ఎక్కడుందిరా ప్రశాంతత ? డబ్బులతో కొనగలమా దాన్ని?" ప్రశ్నించాడు వెంటనే.
" ప్రశాంతతకు అడ్రస్సు మన మనసేరా ! దానికున్న మహత్తు ఏమిటో తెలుసా ? దేన్ని మనం గాఢంగా కోరుకుంటామో దాన్నే పొందమని ప్రోత్సహిస్తుంది, దాన్నే అందిస్తుంది. నువ్వు ఒక మనిషిపై ప్రేమను పెంచుకుంటే ప్రేమించమంటుంది. ద్వేషాన్ని పెంచుకుంటే వార్ని దహించమంటుంది... వైదికుడు కోరే యోగమైన వైశికుడు కోరే భోగమైనా అందించే సరస్సు ఈ మనసు. అందుకే దాన్ని మానస సరోవరం అంటారు. ఇప్పుడు నీ మానస సరోవరంలో ఎటువంటి కలతల కెరటాలు ఎగసిపడకుండా, కల్లోల అలలు చెలరేగకుండా నిన్ను ప్రశాంతంగా వుంచే శక్తి కావాలి ! ఆ శక్తి నీ బాధకు ఉపశమనాన్ని అందించి. నీకు సేద తీర్చాలి. అలాంటి శక్తి ఆ గీతకే వుంది. ఎస్...ఇప్పుడు నీకు ఆ గీతే కావాలి..." తర్కించుకుంటూ చెప్పాడు చివరి వాక్యాన్ని సీతారామారావు.
" గీతా ? గీత ఎవరూ ? " ఆశ్చయంగా అడిగాడు శ్రీపతిరావు. కుతూహలమూ వుంది అందులో-
" ఎవరో ? ఏమిటో ? తొందరెందుకూ ? వీలైతే రేపే పరిచయం చేస్తా ! ఇక నాతోడు కూడా వద్దంటావు..." నర్మగర్భంగా చెప్పాడు సీతారామారావు చివరిమాటని.
సిగ్గుతో చిరునవ్వులు చిందిస్తున్న శ్రీపతిరావుకి కరచాలనం చేసి కదిలాడు సీతారామారావు.
" ఎవరీ గీత ?? " అన్న తీవ్రమైన అలోచనలో నిమగ్నమైపోయాడు శ్రీపతిరావు.

******

28, ఫిబ్రవరి 2010, ఆదివారం

దృష్టి ...!

'సిడాడే-డి-గోవా ' అది ముప్ఫై అయిదు ఎకరాల్లో కట్టిన స్టార్ హోటల్. అందులో పోర్చుగీస్ కాలాన్ని తలపింపచేసే లగ్జరీ సూట్ 'వాస్కోడిగామా '- ఆ విశాలమైన గదికి ఓ ప్రక్కగా కనిపిస్తుంది బ్లూలాగూన్ లాంటి నీలిసముద్రం. ఆ సముద్రాన్ని చూస్తూ పెయింటింగ్ వేసుకోవడానికి వీలుగా ఏర్పాటుచేయబడ్డ 'ఈసిల్ ' దానికి ఆ గదిలో స్థానాన్ని కల్పించిన కళాకారుడు " యశస్ "- అందుకే ఆ గది అతనికి హాట్ ఫేవరేట్. అతనికి సరిజోడైన యువతి " స్వప్నిక" ఆతని 'హార్ట్ మేట్ '!

*****

ఆకాశానికి నీలిరంగునద్ది అక్కడి నీటితో కుంచెలను శుభ్రంగా కడిగినట్లున్నాడు ఎవరో చిత్రకారుడు. అది నిజమన్నట్లు తలలూపుతున్నాయి పోకచెట్లు. గోవా బీచ్ లన్నింటిలోకి అందమైన బీచ్ 'కొలావా ' దీనికి సమానమైనది ఇండియాలోనే లేదు.

గాలి తీవ్రతకు బీతిల్లి యశస్ మొముని హత్తుకుంది స్వప్నిక చీరచెంగు. ఆ చెంగుమాటున వూరిస్తూ కవ్విస్తున్న ఆమె ఎదపొంగును చూస్తున్నాడు. అతని చిలిపి చూపుల తాకిడిని గమనించి వడివడిగా చేరింది ఆమె గుండెలోతుల్లోని సవ్వడి ఎదపైకి. విసురుగా లాగివేసింది అతని మొహంపై నుంచి తన చీరచెంగును స్వప్నిక.
" ఏమిటీ చోరబుద్దీ?" ప్రశ్నించింది కసరుతూ.
" అది చోరబుద్ధికాదు...వాటిదరి చేరబుద్ది" అన్నాడు.
" కళాకారుడికి కవిత్వం పొంగుకొస్తుదే ?" అడిగింది ఎగిరే ముంగురులని సవరించుకుంటూ.
" రంగుల్నీ, పొంగుల్నీ, హంగుల్నీ చూస్తే నాకు తెలియకుండానే కవిత్వం పొంగుకొస్తుంది. అది నా ఇన్ హెరంట్ క్వాలిటీ.."
చెప్పాడు గర్వంగా.
" ఆహా అయ్యవారి క్వాలిటీ కంట్రోలులో వుండటం మంచిదేమో " చెప్పింది స్వప్నిక తన చీరచెంగు ఎగిరిపోకుండా బిడ్డువద్ద దోపుకుంటూ.
" సెల్ఫ్ ప్రిజర్వేషన్ ఈజ్ నేచర్స్ ఫష్ట్ లా అన్నారు..తప్పు నీది కాదు.." అన్నాడు ఆమె చర్యని ఎత్తిపొడుస్తూ
" ఎంతో రసికుడు దేవుడు..సుకుమారమైన పూలనీ ఆహ్లాదాన్నిచ్చే ప్రకృతినీ, ఆనందాన్నిపంచే స్రీకి బదులుగా ఇచ్చాడు మాకు..." అన్నాడు మరల.

సరసమైన ఛలోక్తులతో కూడిన ఆ సంభాషణ ఎంతో పరవశానికి గురిచేసింది స్వప్నికను . ఒక ప్రక్క ప్రకృతి ఒడి, మరో ప్రక్క మనసు మెచ్చిన జోడి. " అటుచూడు..." అరిచి చెప్పాడు దూరంగా బీచ్ వైపు చూపిస్తూ, తలతిప్పి చూసింది స్వప్నిక.

గోల్డెన్ కలర్ లా మెరుస్తున్న శాండ్ పైన చాపలాంటిది పరిచివుంది. దానిపై శాటిన్ కలర్ టర్కీ టవల్, బ్రా, ప్యాంటీ మాత్రమే వేసుకుని బోర్లాగా పడుకుని వుంది ఓ ఇరవై యేళ్ళ యువతి. ఆమె ముందు మోకాళ్ళను ఇసుకలో ఆనించి, మొలకు లుంగీలాంటిది బిగించి, చాతీమీద ఏ ఆచ్ఛదనా లేని కుర్రాడు. కసరత్తుతో మెలికలు తిరిగిన కండలతో-

" ఏంటీ నువ్వు చూడమన్నదీ ?" అడిగింది అమాయకంగా.
" సుకుమారమైన ఆ ఇంతి క్లాంతితో తన మేనును కౌమారం దాటిన ఆ కుర్రాడికి కౌలు కిచ్చినట్లుంది. అరచేతులనే హలాలుగా మార్చి, చూడు ! నేర్పుగా చేస్తున్నాడు మసాజ్ సాగు " చెప్పాడు అలానే చూస్తూ.

తలతిప్పి చూసింది స్వప్నిక వారివైపు. బాడీ ఆయిల్ ని ఆమె వీపు మీదపోసి, మెడ నుంచి కాళ్ళ వరకు రుద్దసాగాడు అతను. మర్ధనలో సమర్ధవంతమైన ఆతని పనితనం ఆ యువతి శరీరానికి కాంతిని, మనసుకి తీరని అశాంతిని అందించింది.

ఇప్పుడు వెల్లకిలా పడుకుని వుంది ఆ అమ్మాయి. సూర్యరశ్మి తన కళ్ళను తాకకుండా వుండేందుకో, లేక తన కళ్ళల్లోని కాంక్షారశ్మి అతని శరీరానికి తాకి అతడిని ' భస్మీపటలం ' కావించకుండా వుండేందుకో తెలియదుగానీ, ఆమె కళ్ళకు ఛష్మా ధరించివుంది. కళ్ళముందు పరిచివున్న శృంగారగనిని కన్నులారా పరవశంతో చూస్తున్నాడు ఆ కుర్రాడు. వసి నింపుకుంటున్న అమె తొడల సొగసుని చూసి ఆతని శరీరంలోనూ 'అంతర్మథనం' ప్రారంభమైంది. ఆమె తాగింది 'ఫెన్నీ మద్యం '- చేను లాంటి ఆమె మేనుపై అతను చేస్తున్నాడు 'ఫన్నీ సేద్యం'- చూస్తున్న స్వప్నికకు చిరాకువేసింది.

" ఈ బ్లడీ సీన్ చూడమనా పిలిచింది " ? కసిరింది.
" అది బ్లడీ సీన్ కాదు మేడం...అందమైన అమ్మాయి బాడీ సీన్ " కొంటెగా బదులుచ్చాడు యశస్.
" ఒళ్ళు బలిసినోళ్ళకది " విసుక్కుంక్ది.
" కాదు ఒళ్ళు అలసినోళ్ళకది " సరిదిద్దాడు.
" తమరువెళ్ళీ చేయించుకోవచ్చుగా... ఏపిల్లతోనో ? " విసురుగా ముందుకు కదిలింది స్వప్నిక.

' క్వీన్ ఆఫ్ గోవా బీచెస్ ' అని పిలవబడే ఈ 'కొల్వా బీచ్' లోని ఈ సీన్ చూసే లావాలా పొంగింది కోపం. మరి జనాల మోజుని తీర్చే ' అంజునా బీచ్ 'ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ? మనసులోనే నవ్వుకున్నాడు యశస్.

*****

ఏడు నదులు, నలభైకి పైగా సముద్రతీరాలు గోవా నగర కన్యక మెడలోని హారాలు. వీర విహారానికి, తీరని విరహానికి తగిన వరాలు. హింధూ, క్రిష్టియన్, ముస్లీం, మతాల సామరస్య మమైకం, విభిన్న సంస్కృతుల సమైక్య లోకం, స్నేహం, సమానత్వం, సాహచర్యం వీటన్నింటి మిశ్రమాల ఫలితమే ప్రశాంత ' గోవా ' -

మూడవ శతాబ్ధం నాటి మౌర్యుల కాలంలో గుర్తింపు పొందిన ఓ చిన్న ప్రాంతం. తదనంతరం చాళుక్యుల, ముస్లీముల, విజయనగరరాజుల, బహమనీ సుల్తానుల, పోర్చుగీసుల, బ్రిటిషర్ల ఏలుబడిలో తన పలుకుబడిని పెంచుకుంటూ, నేడు భారతదేశంలోనే అత్యధిక ప్రాధాన్యత కలిగిన విహారస్థలంగా పేరుగాంచి, జనం తరించేలా అవతరించింది 'గోవా '- మానవుల మనోవికాసానికి ప్రకృతి ఇచ్చిన వరం... బహుమతి... ఈ ...గోవా !

*****

ప్రపంచంలోని అన్నిరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులందరూ అక్కడే వున్నారా ? అన్నట్లుంది ఆక్కడ చేరిన వారిని చూస్తుంటే ! ఆనందానికి, దాని మూలానికి అదే సరైన వేదికేమో అన్నట్లుంది 'అంజునా బీఛ్- గోవాలో అత్యంత ప్రజాదరణ పొందిన బీచ్ అది.

వయోబేధం, లింగబేధం లేకుండా ఆనందం పొందుతున్నారు అక్కడివారు. ఒక ప్రక్క మసాజులతో సేద, మరోప్రక్క మత్తు పానీయాలతో రొద. ఎక్కడా చూసినా ఆనందపు హేల. అందరి కళ్ళల్లోనూ కాంక్షల జ్వాల. అక్కడి ప్రకృతిని, మనుషుల శరీరాకృతిని, విభిన్న వ్యక్తుల భిన్న సంస్కృతిని, విపరీత జనాల విచిత్ర వికృతిని గమనిస్తూ తీరం వెంట నడుస్తున్నారిద్దరూ. ఆ వాతావరణం మెల్లగా...మత్తుగా...వారినీ కమ్మేస్తోంది !

" ఏలావుందీ అంజునా ?" అడిగాడు యశస్ ఆమె నడుముపై చెయ్యివేసి మెత్తగా నిమురుతూ.
" రంజుగా " అంది చిలిపిగా ఆతని కళ్ళల్లోకి చూస్తూ.
" రంజుగా వుంది ఈ బీచ్చా ? నా టచ్చా ?" ప్రశ్నించాడు ఆమెను కౌగిలిలో బంధిస్తూ.
" రెండూ కాదు . అబ్బాయి గారి పిచ్చి " చెప్పింది ఆతని సంకెలను విడిపించుకుని పరిగెడుతూ.
" ఏయ్ ఆగు..ఆగు.." అంటూ ఆమె వెనుకనే తనుకూడా పరుగు అందుకున్నాడు యశస్.

హరిణిలా పరిగెడుతుంది ఆ తరుణి ఆతని చేతికి చిక్కకుండా. అలా పరిగెడుతున్న స్వప్నిక ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి స్థాణువైపోయింది.

ఎదురుగా ఆడా-మగా జంటలు జంటలుగా, ఏమాత్రం సిగ్గూ-ఎగ్గూ లేకుండా, ఎవరినీ గమనించే స్థితిలో లేరు ఎవ్వరునూ, తమకంతో తమలోకంలో వున్నారందరూ 'జలయఙ్ఞం ' చేస్తూ పూర్తి ' నగ్నంగా'-

" కమాన్..సిట్ డౌన్.." అంటూ ఇసుకపై ఒరిగిపోయాడు యశస్ వెల్లకిలా.
" ఇదేం చోటయ్యా బాబూ ? " ప్రశ్నించింది స్వప్నిక ఇసుకలో తనూ కూలబడుతూ.
ఆమె మొహలోకి చూశాడు యశస్. సిగ్గూనవ్వు లవ్వాడుకుంటున్నాయి ఆమె మోముపై.
" ఇది భోగపరాయణులైన దేవతల స్వర్గ సంబంధమైన ఆటస్థలం. ది సెలస్టియల్ ప్లే గౌండ్ ఆఫ్ వొలాప్టుయస్ గాడ్స్ " అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ.

అతను చెప్పిన తీరు ముచ్చటగా వుంది ఆమెకి. నిజమే కదా ! ఇటువంటి విలాసం కోసమే కదా ఎంతో ప్రయాసపడి వచ్చేది ఇంతదూరం ? తన ఆలోచనలలో వస్తున్న మార్పును గమనించింది స్వప్నిక.

గోవా ! నువ్వు తక్కువ దానివేం కాదు ! అనుకుంది మనసులో - నీటితో సయ్యాటలాడుతున్న ఆ అనిమిషులవైపు చూసింది ఓ నిముషం పాటు. విచిత్రం ఇందాక వారిని చూసినప్పుడు కలిగిన 'అసహ్యం ' స్థానే ఇప్పుడు 'ఈప్సితం ' చోటుచేసుకుంది. స్వేచ్ఛ ఉన్నప్పుడే కదా ! ఇచ్ఛ కలిగేది ? అంకురమౌతున్న కొత్త ఆలోచనలను అవలోకిస్తోంది స్వప్నిక.

*****
" నిన్నూ ఇన్ స్పైర్ చేసిన చిత్రకారులెవరు యశస్ ?" ప్రశ్నించింది వైన్ సిప్ చేస్తూ. కొత్తరుచులు అనుభవిస్తోంది స్వప్నిక. ఆమెకు అదే మొదటిసారి మత్తుపానీయం సేవించటం. అతి బలవంతం మీద మరలా ఎప్పుడూ అడగననే 'హామీ ' మీద తాగేందుకు ఒప్పుకుంది.

" చాలా మందే వున్నారు..సర్. గాడ్ ఫ్రే నెల్లర్ అని బ్రిటీష్ ఆర్టిష్ట్..షేక్స్ ఫియర్ ఇన్ పొయిట్రీ నెల్లర్ ఇన్ పెయింటింగ్ అంటారు. ఆయనతో పాటు సర్ థామస్ లారెన్స్, వాన్ డిక్, ది ఫాదర్ ఆఫ్ మోడరన్ ఆర్ట్... పికాసో, ద లాస్ట్ సప్పర్ పెయింట్ చేసిన లియోనార్డ్ డావెన్సీ...ఈయన గీసిన మరో అద్భుతమే ' మోనాలిసా '...

ఓహ్..గ్రేట్ మిష్టర్ లియోనార్డ్..చీర్స్..హేట్సాఫ్ " అంది గ్లాస్ పైకెత్తి. మత్తు మర్యాదను చిత్తుచేస్తోంది.
" మన రాజా రవివర్మ..ఏ పెయింటింగ్ ఆన్ సెల్యూలాయిడ్..గజగామిని..ఎం.ఎఫ్.హుస్సేన్, మన తెలుగు కళాకారులు... దామెర్ల రామారావు.. వడ్డాదిపాపయ్య.. మన బాపు ..ఇలా ఎందరో మహానుభావులు నా జీవితాన్ని ప్రభావితం చేశారు...వారందరికీ వందనాలు...చెప్పటం ఆపి తలవంచాడు ఒక్కక్షణం. వెంటనే విస్కీ గ్లాసు చేతిలోకి తీసుకున్నాడు మరల.

" ఈ వర్షాన్ని చూస్తుంటే ఏదైనా అద్భుతాన్ని సృష్టించాలని వుంది నాకు. అంత అద్భుతమైనది ఏమిటన్నదే అర్ధం కావడంలేదు..." అన్నాడు సిగరెట్ ముట్టిస్తూ.
" నేను చెప్పనా ?" అడిగింది గోముగా. చెప్పమన్నట్లు చూశాడు పొగవదులుతూ.
" మోనాలిసాను సృష్టించిన డావెన్సీలా... నువ్వు నీ ఫియాన్సీని సృష్టించు.." అంది గర్వంగా.

పిచ్చినవ్వు మెరిసింది ఆతని మోముపై. ఆతని చేతిలోని సిగరెట్ లానే భగ్గుమని ఆమె హృదయం ఆ నవ్వును చూసి.
" ఏంటా పిచ్చి నవ్వు ? నేను అందగత్తెను కానా ? " కోపంగా ప్రశ్నించింది ఆ రోషనారి.
" నో డౌట్. నువ్వు అద్భుతమైన అందగత్తెవే ! అంత అందాన్ని నేను చిత్రించగలనా ? లేదా ? అనేది ప్రశ్న..." చెప్పాడు యశస్ కూల్ గా సిప్ చేస్తూ.

పౌరుషం బుసలుకొట్టింది ఆమెలో తనకు తెలుసు అది పొగడ్త కాదు. తన అందం అతడిని ఇన్ స్పైర్ చేసే స్థాయిలో లేదా? లేకుంటే తనని అతను ప్రేమించటం ఎలా సాద్యం ? ఇంతకీ తనని ప్రేమిస్తున్నాడా ? లేదా ? ఇది తేల్చుకోవాలి ముందు. స్థిర నిర్ణయం తీసుకుంది స్వప్నిక. మైల్డ్ గా వుంది మెదడు... వైల్డ్ గా మారింది మనసు.

" మైడియర్ స్వప్నిక ! ఆర్ట్ ఈజ్ ఇమ్మోర్టల్ బట్ నాట్ ద బ్యూటీ ! శాశ్వతంగా నిలిచిపోయే చిత్రరాజం కావాలి అంటే అది అద్భుతమైన క్రియేషన్కావాలి గానీ అందం కాకూడదు..." అన్నాడతను.

ఆతని మాటలకు బదులివ్వలేదు స్వప్నిక. మౌనంగా అతడినే చూస్తుంది తీక్షణంగా.

" అటువంటి అద్భుతాన్ని నేను సృష్టించగలను. బట్...నువ్వే తెగించలేవు..." అన్నాడు కవ్వింపుగా.
అమెను అందలం ఎక్కిస్తూ, ఆమె కోరికను అందకుండా చెస్తూ-

" నువ్వేసే గొప్ప బొమ్మకి నేనెలా తెగించాలంటావ్ ?" ప్రశ్నించింది వెటకారంగా.
" వద్దు స్వప్నికా ! పట్టుదలకు పోవద్దు. నీ వల్లకాదు. కొన్ని కోరికలు తీరకుండా వుంటేనే తీపి గుర్తుగా మారతాయి.
అదే అనుభవమైతే చేదుగానూ మారవచ్చు..."
"యూడోంట్... యూ కాంట్... అనే పదాలకి కాలం చెల్లిపోయింది యశస్ ! నీకెలా కావాలి ?"
" రూముకెళ్ళిన తరువాత మాట్లాడుకుందాం..." కాస్తంత ఇబ్బంది పడుతున్నట్లుగా చెప్పాడు .
" నథింగ్ డూయింగ్. ఇప్పుడే...ఇక్కడే..." బల్లమీద గట్టిగా చరుస్తూ అరిచి చెప్పింది.

గ్లాసులోని విస్కీని గొంతులోకి వంపుకుంటూ చెప్పాడు మెల్లగా " నగ్నంగా "

లాగోవా అజుల్ డెక్ బార్ 'లో... 'ది లింబో ' పైర్ డాన్స్ మొదలయ్యింది అప్పుడే!!

*****
" డీడ్స్ ఆర్ మేల్-వర్డ్స్ ఆర్ ఫిమేల్.. అన్నారు. వాగినంతసేపు పట్టలేదు నోరు మూతబడటానికి " భాస్వరాన్ని మండిస్తున్నాడు గదిలోకి అండుగిడినంతలోనే.
" ఓ.కే...మిష్టర్ యశస్... ఐయాం రెడీ. యు గెట్ రడీ ఫర్ ద జాబ్... బట్ రిమెంబర్ ఒన్ థింగ్. ఈవిల్ పర్ స్యూట్స్... బ్రింగ్ ఈవిల్ రెప్యుటేషన్ " కటువుగా చెప్పింది స్వప్నిక చివరి వాక్యాన్ని.

ఆమె మెంటల్ టెంపర్మెంట్ ఆతనికి తెలియంది కాదు. ఎం.బి.ఏ చదువు. మల్టీ నేషనల్ కంపెనీలో పెద్ద హోదా. దానికి తోడు అందానికి వీనస్ దేవతననే గర్వం. వెరశి అమె అహానికి ఆభరణాలు. ఇప్పుడు వాటినన్నింటినీ విడిచేయడానికి, ఆతనికి విడిదికియ్యడానికి సిద్దమవుతున్నది ఆ ' స్నిగ్ధ సౌందర్యవతి '-

*****

ఈజిల్ పై కాన్వాసు క్లాతును బిగిస్తున్నాడు యశస్. స్వప్నిక ఒంటిపై దుస్తులు నేలకు వాలుతున్నాయి. ఆమె రూప,లావణ్యాలను గమనిస్తున్న యశస్ ని చూసి ఆమె చెంపలు కెంపులయ్యాయి. మేను కనక పుష్యరాగ వర్ణమైంది. మనసు వజ్ర తుల్యమైంది.

" ఈ కళాకారుడు భయపడేలా ఆ కోపరూపమేమిటి అపరకాళీ ? నిక్షేపాల గనివి..ఏ ఎమ్రాల్డ్సునో , డైమండ్స్ నో చూపించి... మెరిపించక !" అన్నాడు యశస్ ముడిబిగించిన ఆమె సిగపాయలను వదులుచేస్తూ.

" ముందు లైట్స్ ఆఫ్ చెయ్ " అంది స్వప్నిక లోతొడుగులతో అర్ధనగ్నంగా నిలుచుని.

" ఓ హో...రేపు ప్రపంచం వెలుగు చూసే ఓ అద్భుతం... నేడు ఈ చీకట్లోనే ప్రారంభమౌతుందన్నమాట..." అంటూ ఆ రూములోని లైట్స్ ఆఫ్ చేశాడు యశస్.

మైఖెలాంజిలో మలచిన పాలరాతి శిల్పంలా మెరిసిపోతుంది స్వప్నిక నగ్నంగా. వెన్నెల జడివానలో తడిసి, అలసి సేద తీర్చుకుంటున్న ' గ్రీకుదేవత ' లా వుంది. పరిశీలిస్తున్నాడు యశస్ ప్రశాంతంగా ఆమె సౌందర్యాన్ని -

నల్ల త్రాచు కురులు...వక్షోజాలు గిరులు... మేను పసిడి సిరులు... ఆమె తనువునా అణువణువనా ఉప్పొంగుతున్న సోయగాల నయాగరా - అవయవ సౌష్టవంతో కళాకారులకు స్పూర్తినిచ్చే రూపలావణ్యాల వైభవమూర్తి. నగ్నంగా, ఉద్విగ్నంగా వున్న ఆమె... సురులు కనలేని అందాల యేరు...సౌందర్యాల తేరు !

కళ్ళు మూసుకుని వుంది ఆమె. " స్వప్నికా " పిల్చాడు మృధువుగా. మధువుని గ్రోలి మాధుర్యాన్ని ఒలికిస్తూ. కళ్ళు తెరిచి చూసింది ఆతని వంక ' ఏమిటన్నట్లు '

" నీ చిత్తరువుని చిత్రించే ముందు చిన్న కండీషన్ " అన్నాడు యశస్ మెల్లగా.
"మరలా ఏమిటీ? " విసుగా అడిగింది.
" ఆహా...ఏమీలేదు...నేను చూపంచేంత వరకూ దీన్ని నువ్వు చూడకూడదు..." చెప్పాడు స్పష్టంగా.
"బుల్షిట్..మరి ముందెందుకు చెప్పలేదు " అరిచింది.

ఆమె ఆవేశానికి తగినట్లుగా కదలాడుతున్నాయి ఆమె వక్షోజాలు. వాటివంకే కన్నార్పకుండా సూటిగా చూస్తూ చెప్పాడు సంజాయిషీ ఇస్తున్నట్లుగా-

" నువ్వు ఒప్పుకోవని..."
" మరి ఇప్పుడెందుకు చెబుతున్నావ్ ? " అరిచింది స్వప్నిక మరింత గట్టిగా.
" నీకు నచ్చకపోతే డ్రాప్ అయిపోవచ్చనీ ! "
" యూ..స్టుపిడ్..డ్రాప్ అవడానికా అన్నింటిని వదిలేసింది ?" ఆవేశం ఆమె శరీరం మీద తాండవం చేస్తోంది. కన్నులు మూసుకుంది గట్టిగా.
" ఇంతకీ తమరు ఆమోదిస్తున్నట్టా ? లేదా ? " అడిగాడు సీరియస్ గా, తన్నుకొచ్చే నవ్వును అదిమి పెట్టుకుంటూ.
" అయ్యా ! మహానుభావా! మీ చిత్తం.. మాభాగ్యం.. మీ దయే.. మా అదృష్టం.. కానివ్వు " అని రెండు చేతులెత్తి దణ్ణంపెట్టి, మరలా కోపంగా కళ్ళు మూసుకుంది స్వప్నిక.
" అవును మీ చిత్రమే...మా భాగ్యం ! మీద..యే... మాదృష్టం ! " అన్నాడు యశస్ నవ్వుతూ అక్షరాలని మారుస్తూ... ద్వంద్వార్ధాలకు చేరుస్తూ -

ఉలిక్కిపడింది స్వప్నిక. మీ 'దయే ' అన్నపదంలోని మొదటి రెండక్షరాలని కలిపి, ఈ సందర్భంలో అతను పలికిన తీరుకీ, ఆ పదంలోని 'శ్లేషకి ' ఆశ్చర్యపోయి కళ్ళు తెరిచింది. నయనాలు పగడాల పువ్వులయ్యాయి.

కొంచెం ఒక పక్కగా ఒరిగిపడుకుని వుంది స్వప్నిక. ముంగురులని ఆమె తల వెనుకగా పరిచాడు. ఆమె ఎద పొంగులు రెండూ కలిసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అతి రసమ్ములు సుకియాలమృత కలశమ్ములు... కూనిరాగం తీస్తున్నాడు యశస్ కాన్వాసుపై రంగులద్దుతూ.

" మొహానికి కవిత్వమొకటీ " గొణికింది స్వప్నిక.
" చెప్పాగా ! రంగులని చూసినా...పొంగులని చూసినా..."
" చాలు..చాలు.. విన్నాం ఒకసారి..ముదు పనిచెయ్యి " అరిచింది స్వప్నిక విసుగ్గా.
" ఛీ...ఛీ..కోపంలో నువ్వేం బూతులు మాట్లాడుతున్నావో...నీకే తెలియటం లేదు.." అన్నాడు యశస్ చిలిపిగా చూస్తూ, కొంటెగా నవ్వుతూ.
" నువ్వు ఈడీయట్ వే అనుకున్నా... స్టుపిడ్ వి కూడా.." అంది కోపంగా కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ.

ఆవేశపడితే సుఖమేముంది ? కొరివితో తల గోక్కుంటే మంటకాక మరేమిటీ ? చటుక్కున మౌనం వహించిది స్వప్నిక కన్నులుమూసుకుంటూ
*****

బద్దకంగా కళ్ళు తెరిచింది స్వప్నిక. ఉదయం 11 గంటలు దాటుతుంది. తన వంటిపై బెడ్ షీట్ కప్పి వుంది. కుర్చీలో తల ఒక పక్కకు వాల్చి నిదురబోతున్నాడు యశస్. తన పోట్రెయిట్ చూడాలన్న కోరిక కలిగింది.

ఆతను లేచే లోపేచూడాలి. కొన్ని విషయాలలో ఎంతో జనరస్ గా వున్నా, కొన్ని విషయాలలో పరమ మూర్ఖుడు ! మెల్లగా లేచింది బెడ్ పై నుంచి. పెయింటింగ్ బోర్డ్ పైన క్లాత్ వేసివుంది.

" ఆహా...నేను చూడకుండా ఎంత జాగ్రత్త తీసుకున్నావ్ నాయనా ! " అనుకుంది మనసులో.

బోర్డుపై వున్న క్లాత్ ని తొలగిస్తుండగా " స్వప్నికా ! డొంట్ సీ ! మన కండీషన్ మర్చిపోకూ ! " హెచ్చరింపుగా వుంది యశస్ వాయస్.
" అది అప్పటిమాట...తెలివి నీ ఒక్కడి సొత్తే కాదు ! కీప్ క్వైట్ " అంటూ తొలగించి, చూసిన స్వప్నిక షాకైపోయింది.

ఎదురుగా కనిపిస్తున్న పెయింటింగుని చూసి గిర్రున నీళ్ళు తిరిగాయి ఆమె కళ్ళల్లో. " ఏమిటిదీ ? " అరిచింది పిచ్చి కోపంగా. పగలబడి నవ్వుతున్నాడు యశస్. కాన్వాస్ క్లాత్ మీద చిత్రించబడివుంది... చాలా అసహ్యంగా... పళ్ళు ఇకిలిస్తూ... ' ఓ ముసలి కోతి ' -
*****
గోవా నుంచి తిరిగివచ్చి పది పదిహేను రోజులవుతున్నా, తనని కలిసే అవకాశం యివ్వలేదు స్వప్నిక యశస్ కి. ఆ రోజు అతని బర్త్ డే అవడం వలన అతని ఆహ్వానాన్ని మన్నించింది. డిన్నర్ కి వస్తానని మాట ఇచ్చింది. అందుకే పంక్చువల్ గా టైముకు వచ్చింది.

' గ్రాండ్ కాకతీయ హోటల్ ' ఎంట్రన్స్ వద్దనున్న గ్లాసుడోర్ నుంచి కనిపిస్తోంది, ఎదురుగా గోడకు తగిలించిన పెయింటింగ్- చూపరులను దిమ్మెరపరచే అద్బుతమైన పెయింటింగ్- పున్నమి వెన్నెల కాంతులలో తనువు ఆరబోసుకుంటున్న స్త్రీ ! అదీ నగ్నంగా !!


చూస్తున్న స్వప్నిక గుండెలయ తప్పింది. ఆ కలర్ కాంపోజిషన్ అంతా యశస్ మెయింటైన్ చేసేదే. భయంతో మొద్దుబారిపోయింది స్వప్నిక మెదడు. కొంపదీసి ముఖ కవళికలను స్పగోవా నుంచి తిరిగివచ్చి పది పదిహేను రోజులవుతున్నా, తనని కలిసే అవకాశం యివ్వలేదు స్వప్నిక యశస్ కి. ఆ రోజు అతని బర్త్ డే అవడం వలన అతని ఆహ్వానాన్ని మన్నించింది. డిన్నర్ కి వస్తానని మాట ఇచ్చింది. అందుకే పంక్చువల్ గా టైముకు వచ్చింది.

' గ్రాండ్ కాకతీయ హోటల్ ' ఎంట్రన్స్ వద్దనున్న గ్లాసుడోర్ నుంచి కనిపిస్తోంది, ఎదురుగా గోడకు తగిలించిన పెయింటింగ్- చూపరులను దిమ్మెరపరచే అద్బుతమైన పెయింటింగ్- పున్నమి వెన్నెల కాంతులలో తనువు ఆరబోసుకుంటున్న స్త్రీ . అదీ నగ్నంగా ! చూస్తున్న స్వప్నిక గుండెలయ తప్పింది. ఆ కలర్ కాంపోజిషన్ అంతా యశస్ మెయింటైన్ చేసేదే. భయంతో మొద్దుబారిపోయింది స్వప్నిక మెదడు. కొంపదీసి ముఖ కవళికలను స్పష్టంగా చిత్రించాడా ? అదిరే గుండెతో వడివడిగా వెళ్ళింది ఆ చిత్రం వైపు -

ఆ వర్షం కురిసిన రాత్రి- గోవాలో- వాస్కోడిగామాలో - తనని నగ్నంగా చేసి, యశస్ వేసిన పెయింటింగే అది. ఆశ్చర్యం ! దూరాన్నుంచి చూస్తే నగ్నంగా కనిపించిన ' స్త్రీ మూర్తి ' దగ్గరకు వచ్చి చూస్తే ' ఎడారి సోయగం ' లా మారిపోయింది.

తన తల వెనుకన పరిచిన జుట్టు సూర్యరశ్మితో దాగుడుమూతలాడుతున్న మేఘాల నీలినీడలుగా మారిపోయింది. అమృతకలశాలంటూ తీర్చిదిద్దిన తన ' ఎద భాగం ' రాశిగా పోసిన ' ఇసుకదిబ్బలుగా ' రూపాంతరం చెందింది. వాటిపై మేనువాల్చి శిరస్సునెత్తి చూస్తున్న ' ఉష్ట్రపక్షులు రెండూ... ' కుచ శిఖరాగ్రాలుగా ' కనిపిస్తున్నాయి - అనుదిన సాధనతో నాజూకైన తన ' నడుము ' ఈదురుగాలికి ఖచించబడిన ' ఇసుకతిన్నెలా ' తరిగి, వంపు తిరిగి వుంది. తన పసిడివన్నె ' మేను ' సూర్యకిరణాలలో మెరుసున్న ' సైకతపానుపుగా ' మారింది.

దీక్షగా, పరీక్షగా చూస్తున్న స్వప్నిక సిగ్గుల వూబిలో కూరుకుపోయింది ఒక్క క్షణం. ' భగవంతుడు తనలానే సృష్టించేందుకు స్త్రీలకే ఇచ్చిన గొప్ప వరం ....' మాన సరోవరం ' - ఖర్జూలాలను పండించే ' ఒయాసిస్సులా ' ఒదిగిపోయింది.

అందమైన ఓ స్త్రీ శరీరాకృతిని ప్రకృతితో అన్వయించి, యశస్ తన ' మనోదృష్టిచే ' సృషించబడిన అద్భుత చిత్రరాజమది. వర్ణాలతో ప్రాణాలు పోసుకున్న సజీవమైన సుందర దృశ్య రూపమది.

ఆనందభాష్పాలు నయన పుష్పాలవుతున్న వేళ అస్పష్టంగా కనిపించాడు యశస్ ఆమె కళ్ళకి. ఎప్పుడు వచ్చి ఆమె దగ్గర నిల్చున్నాడో తెలియలేదామెకు. " వెళ్దాం పదా " అంటూ ఆమె చేతిని పట్టుకుని ముందుకు కదిలాడు రెస్టారెంట్ వైపుకి.

ఉవ్వెత్తున లేచిన ఖేధ తరంగం తీరాన్ని తాకి మోదమైంది. అంతవరకూ కలతతో వర్షించిన ఆమె మనసు, హర్షంతో వెలసిన సప్తవర్ణాల ఇంధ్రధనస్సైంది.

" దీన్ని ఏ పద వర్ణాలతో వర్ణిస్తావో... ఏ వర్ణాలతో చిత్రిస్తావో చెప్పు యశస్ ? " అడిగింది స్వప్నిక తన దిగంబరమైన రూపం యొక్క ప్రతిరూపాన్ని అంబరమంటిన సంబరంతో తదేకంగా చూస్తూ -
" అణోరణియాన్...మహతో సుహియాన్ " అన్నాడు ప్రేమగా, ఆమె చేతిని వత్తుతూ.
" అంటే ?? "
" అణువు కన్నా చిన్నది...మహత్తు కన్నా గొప్పది " చెప్పాడు ప్రేమార్తి నిండిన స్వరంతో.
" ఏమిటది ?" అడిగింది ఆతని ప్రేమ కడలిలో నిలువెల్లా మునిగిపోతా.
" నా మనసు " చెప్పాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ.

బలమైన ఆతని ప్రేమ పవనాలకి పారవశ్యంతో తేలిపోతున్న ఆ భామ అతను చేస్తున్న చర్యను గమనించలేదు.

" ఏమిటిదీ యశస్ ? " అడిగింది ఆశ్చరంగా తన వేలుకి తొడిగిన అంగుళీయకాన్ని చూస్తూ.
" వీ వంటిదే... వజ్రం ! " చెప్పాడు ఆమె చేతిని స్పృశిస్తూ.

' నీవంటిదే ' అన్న పదం లోని శ్లేష. వజ్రంతో పోలికా, ఆమెను అనిర్వచనీయమైన ఆనందాంబుధిలో ముంచివేసింది.

యశస్ భావ రేతస్సుకు హిమికమై కరిగిపోతున్నది స్వప్నిక. ఆతని ప్రేమాతీంద్రియ శక్తికి సమ్మోహితురాలై ' యతీంద్రుడైన ' యశస్ ఎదపై వాలిపోయింది ' స్నిగ్ధ సౌందర్య లతిక ' స్వప్నిక అతని వశమయ్యేందుకు !!!

శుభం !


స్వాతి వార పత్రిక 20-9-2002.