21, డిసెంబర్ 2008, ఆదివారం

ప్రేమ తురాయి....!!!


ఆ ఇన్విటేషన్ కార్డ్ చూడటం తోనే, నా మనసు గతంలోకి జారిపోయింది. ఆ గతం నిన్నా-మొన్నటిది కాదు. పరుల వశమై నా మనసు పారవశ్యాన్ని తొలినాళ్ళది. కన్నుల్లో పున్నమి కాంతుల్ని నింపుకుని తొలిసారిగా క్లాసురూములోకి అడుగుపెట్టిన ' వైదేహి ' పదహారేళ్ళ ప్రాయానిది.
సరిగ్గా మా కాలేజీ ని స్థాపించి పాతికేళ్ళు పూర్తయిన సందర్భంగా , సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ని నిర్వహిస్తూ, కాలేజీ యాజమాన్యం పంపిన ఆహ్వాన పత్రికది .
అతివల నుదురుపై కుదురైన పెద్ద బొట్టుని చూసినా, విశాల నేత్రాలలో వెలుగుని చూసినా, అందంతో కూడిన అమాయకత్వాన్ని చూసినా.. నిజం చెప్పొద్దూ... నాకు వైదేహే గుర్తుకు వస్తుంది. కళ్ళముందు నుంచి నడిచి వెళుతున్న ఆమెను చూసిన క్షణంలోనే తెలిసింది .. నా మనసు ఎంతో గాఢంగా ఆమెనే కోరుకుంటోందని .. ఆమెలోనూ అదే కోరిక తీవ్రమవుతున్నదనీ -
* * * * *
మా కాలేజీకి అల్లంత దూరాన ప్రవహిస్తూ వుంటుంది ఏలూరు కాలువ. ఆ కాలువ గట్టున మరో ఇద్దరమ్మాయిలతో నడుచుకుంటూ వచ్చేది వైదేహి. నేను లంచ్ కి ఇంటికొచ్చి ఐదు నిముషాల్లో అయ్యిందనిపించి, వెంటనే పరుగు పరుగున వెళ్ళేవాడిని మరలా కాలేజీకి. ఆలుచిప్పలాంటి కళ్ళతో నాకై ఎదురుచూస్తూ వుండేది వైదేహి. నన్ను చూడటంతోనే ఆమె కన్నుల్లో చెమక్కుమంటూ మెరిసే మెరుపుని, ఆకాశంలో సైతం చూడలేదింతవరకూ నేను -

మనసు పోరు తట్టుకోలేక మాటకలపడం మొదలెట్టాన్నేను. అర్ధశాస్త్ర నిర్వచనాన్ని, ట్రయల్ బ్యాలెన్స్ టోటల్స్ ని ఎన్నోసార్లు ఆమెనే అడిగి తెలుసుకున్నాన్నేను. ఒకసారి అలానే...
"పౌరుని ప్రాధమిక హక్కుల్లో మొదటి పాయింట్ ఏమిటి వైదేహి ..? అని అడిగాను.
" ప్రేమించడం " బదులిచ్చింది నాకే వినిపించేలా. గుండె ఝల్లుమంది ఆమె సమాధానం విని.
"అవును అరవింద్..అదే ఫష్ట్ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఏ సిటిజన్.." ఈసారి గట్టిగా నలుగురికీ వినిపించేలా చెప్పింది. మొదటిసారిగా ఆమె మనసు మాట్లాడటం మొదలెట్టింది నోరు తెరిచి. అలా ఆరంభమైన మా మాటలు ...
' ఐ..లవ్..యూ..' అనడానికి ఎంత ఆరాటపడ్డాయో మా కంటే మా మనసులకే బాగా తెలుసు. తనువులు చేరువై మాటలు సుదూర తీరాలకి పరుగులిడుతున్నాయి..
"అరవింద్..మన ప్రేమ ఎప్పటికీ ఇలానే వుంటుందా...?" నా అరచేతిలో ఆమె మోముని వాల్చుతూ అడిగింది వైదేహి..
"ప్రేమకు మరణం లేదు వైదేహి..అది ఎప్పటికీ బతికే వుంటుంది..మనం చనిపోయినా.." చెప్పాన్నేను..
నా మాటలకు చెమర్చిన కళ్ళతో నా భుజం పై తల వాల్చేసింది. గతం తాలూకూ అనుభూతులన్నీ,
నన్నో.. ఆనందపు టూయలలో ఊపుతుండగా వినిపించింది సెల్ ఫోన్ లో రింగ్ టోన్ ...
' ఫీల్ మై లవ్ ' అంటూ...
* * * * *
నేనూ, జోసఫ్ బయలుదేరాం కారులో - హైదరాబాదు నుంచి హనుమాన్ జంక్షన్ కు. కాలేజీ ఫంక్షన్ కు -పాతికేళ్ళనాటి విషయాలు మా ముచ్చట్లలో దొర్లాయి.
" యశస్వీ..చాలా బాగుందిరా నీ పెన్ నేం.. మొన్న మొన్నటివరకూ తెలియదు. నువ్వే యశస్వీవనీ. మనసే వెన్నెల సీరియల్ అదిరి పోతుందిరా పాపులర్ పత్రికలో .." ఎక్సైటింగ్ గా వుంది జోసఫ్ వాయస్.
వాడివంక చూశాను చిరునవ్వుతో -
" ఇప్పుడు నీ విషయం తెలిసి..నీ వైదేహి.. ఎంత గొప్పగా ఫీలవుతుందిరా ? " అడిగాడు జోసఫ్. నా సమాధానానికై ఎదురుచూస్తూ...నేను ఆలోచనలో పడ్డాను.
" అవునురా అరవింద్.. వైదేహి డిగ్రీ పూర్తి చేయకుండానే పెళ్ళి చేసుకున్నట్లుంది కదూ..? "
" చేసుకోలా..బలవంతంగా చేసారు.." సరిదిద్దాన్నేను.
" ఆ..అది నిజమే.. అయినా తొందరపడి ఎందుకు చేశారంటావ్..? " కుతూహలంగా అడిగాడు జోసఫ్.
"మేము ప్రేమించుకుంటున్నామని మాకు తెలియక ముందే.. అందరూ చెప్పుకోవడం మొదలెట్టారు. ఏలానో చేరిందా వార్త వైదేహి ఇంట్లో. మనం ఇంటర్ పూర్తిచేసి డిగ్రీలోకి వచ్చాం.. ఆమె జీవితంలోకి ప్రవేశించింది. " గతం కళ్ళ ముందు నిలిచింది. తొంగిచూసింది గుండెల్లోని బాధ గొంతులోకి.
"నీకు తెలియదనుకుంటా..? " ప్రశ్నించాడు జోసఫ్.
కలుక్కుమంది నా గుండెలో బాధ. నాకు తెలిస్తే జరగనిస్తానా మరొకడితో వైదేహి పెళ్ళిని..?
సుళ్ళు తిరగసాగింది నాలో దు:ఖం. మాట్లడకుండా ఎం.పి.త్రి. సిడీ ఆన్ చేశాను పెద్ద సౌండ్ తో.
* * * * *

ఎందరో విద్యార్ధులకి భవిష్యత్తును ప్రసాదించిన మా కాలేజ్ పెద్దగా అభివృద్ది చెందలేదనే అనిపించింది. నా ఉన్నతికి పునాది వేసిన మా కాలేజ్ కి ఓ లక్ష రూపాయిలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాన్నేను వెంటనే. అదీ..చనిపోయిన మా తల్లితండ్రుల పేరుమీద.

ఆనాడు మాతోపాటు చదివిన అమ్మాయిల్లో రాని, ఐదుగురిలో వైదేహి ఒకతి. ఇప్పుడెలా వుండి వుంటుంది వైదేహి..? మెదడునిండా నిండిపోయిందాలోచన. నా నిరీక్షణ కొండంత ఆశతో కొనసాగుతుండగా, ఓ ఆటోవచ్చి ఆగింది గేటువద్ద. ఆటోలోంచి దిగిన మనిషిని చూడటంతోనే నా హృదయ స్పందన వేగవంతమైంది. ఆశ్చర్యంతో నిశ్చేష్టుడనయ్యాను. ఆమె అచ్చు వైదేహి లానే వుంది కానీ- వైదేహి కాదు.

ఇరవై ఏళ్ళకు పైబడిన వయస్సు, అందంతో వెలుగుతున్న ముఖవర్చస్సు, చకచకా నడుచుకుంటూ రాసాగింది. ఆమెనే పరికించసాగాయి నా కళ్ళు. ఏదో అడుగుతున్నట్లుంది ఎవరినో, తెలియదన్నట్టు తలూపుతున్నారు అవతలి వాళ్ళు. మెల్లగా ఆమె చెంతకు వెళుతుండగా, ఠక్కున వెనక్కి తిరిగింది . ఉలిక్కిపడ్డాన్నేను. సందేహం లేదు. ఆమె ముమ్మాటికీ వైదేహీ కూతురే..!

నా ముందు నుంచే వెళుతుందామ్మాయి. నా మనసులోని మాటని జోసఫ్ కి వివరించి, ఆమెను అనుసరించమని చెప్పాను. ఆ అమ్మాయి వెళ్ళి హిష్టరీ మేడం ని కలవడం, వారి చెంతకు వెళ్ళిన జోసఫ్ కి మేడం ఆ అమ్మాయిని అప్పగించడం, ఆమెను తీసుకుని జోసెఫ్ తిరిగి రావడం అంతా గమనించసాగాను.

" ఒరేయ్..యశస్వి..ఈ అమ్మాయి మన అరవిందకుమార్ ని కలవడానికి వచ్చిందట. నువ్వు కంపెనీ ఇవ్వు..వాడ్ని వెదికి పట్టుకొస్తా.." కన్నుగీటి చెప్పాడు జోసఫ్.

" మీరు పస్ట్ బ్యాచ్ స్టూడెంటా..? " ప్రశ్నించిందామ్మాయి ఎంతో ఉత్సాహంగా

" పేర్లతో మొదలు పెడదామా ? మన పరిచయాల్నీ , పద ప్రయాణాల్నీ.." అడిగాను కుర్చీలో కూర్చుంటూ.

" నా పేరు అరవింద..! " చెప్పింది నా పక్కనే కూర్చుంటూ.

ఆమె చెప్పిన పేరు వినగానే ఆశ్చర్యపోవడం నా వంతైంది - మా ఇద్దరి పేర్లూ ఒకటే కావడం యాదృచ్చికం కాదు ..అది వైదేహి ఐచ్చికం అనిపించింది. ఎంత ప్రేమగా నా పేరుని తన కూతురికి పెట్టుకుంది వైదేహి ? ఆ ఆలోచన ఎంతో గర్వాన్నిచ్చింది నాకు, సంతోషంతో కలిసి - అంతలోనే నా చెంపను ఛెళ్ళుమనిపించినట్టుగా ప్రశ్నించింది నా మనసు నన్నే..

' మరి నీ కూతురికి ఏం పేరు పెట్టావ్ రచయిత మహాశయా ?' అంటూ -

ఏ రచయితా రాయని పేరుని, నిఘంటువులో వెదికి మరీ పెట్టాన్నేను..నా కూతురికి ' హసిత మాల్యా ' అని - సింధువు లాంటి వైదేహి ప్రేమ ముందు బింధువైంది నా ప్రేమ యిప్పుడు.

" నా పేరు యశస్వి.." నా మనసు నోరు మూసేస్తూ చెప్పాను అరవిందతో. ఆమె ఎందుకు నన్ను కలవాలని వచ్చిందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో.

" విచిత్రంగా వుందే..నీ పేరు..మావాడి పేరు ఒకటే..అతనిని కలవాలనే నువ్వొచ్చావు..ఎనీ రిలేషన్ విత్ హిం.? " విషయ సేకరణా నిమిత్త్తం అడిగాను..

" ఎస్..వుంది..అతను ఆత్మ బంధువు.."

" ఎవరికి ఆత్మబంధువు ? "

" మా అమ్మగారికి.." మెడలోని బంగారం గొలుసుని పంటికింద నుంచి లాగుతూ చెప్పింది అరవింద సమాధానం.

ఆమె చేస్తున్న తీరు చూస్తుంటే.. నాకు వైదేహే గుర్తుకు వచ్చింది వెంటనే. వైదేహి అంతే.. ఏవో ఆలోచనలల్లో మునిగి వున్నప్పుడల్లా మెడలోని ముత్యాల గొలుసుని పెదవుల మధ్య వుంచుకునేది.

సభ ప్రారంభమైనట్ట్లుంది. మినిస్టర్ గారు ఉపన్యాసం దంచేస్తున్నారు. కరస్పాండెంట్ శ్రీనివాసరావు గారు, ప్రిన్సిపాల్ వెంకట రమణారావు గారు వేదిక మీదున్న తదితర పెద్దలు చాలా శ్రద్దగా వారి మాటలను ఆలకిస్తున్నారు.

అంతలో 'అరవింద్ ' అన్న పిలుపు వినగానే నేను ఎంతలా ఉలిక్కిపడ్డానో, అంతలా ఉలిక్కిపడింది అరవింద కూడ. ఎదురుగా జోసెఫ్ నవ్వు మొహంతో -

" అరవింద్ గాడు కనిపించ లేదురా.మరలా వెళ్ళి వెదుకుతాను గానీ, నిన్ను వేదిక ముందుకు వచ్చి కూర్చోమని మన సివిక్స్ లెక్చరర్ ప్రభాకర్ గారు చెప్పారు.." నన్ను గుచ్చిగుచ్చి చూస్తూ వినయంగా చెప్పాడు.

" నేను వెళతా గానీ..నువ్వెళ్ళి అరవింద్ ని వెతకరా.." కసిరాను వాడిని.

అరవిందకుమార్ కనిపించలేదన్న వార్తకు ఆమె మొహలో నిరాశ తొంగిచూసింది. అంతలో స్టేజీ మీద ప్రభాకర్ గారు, తమ విధ్యార్ధులు సాధించిన గౌరవాన్నీ, గుర్తింపుని తెలియజేస్తున్నారు. నేను చెప్పకుండానే నేనెవరో ఆమెకు తెలిసి పోతుందేమోనని కుర్చీలోనుంచి లేచే ప్రయత్నం చేశాను.
* * * * *


"అరవింద్ కుమార్ గారిని కలవమని ఆ అమ్మ గారు చెప్పారు.. " మెల్లగా చెప్పింది అరవింద.

బహుశా నేను కూడా వెళ్ళిపోతే, అరవిందకుమార్ గురించి మరే సమాచారం తెలుసుకోలేనని దిగులు కాబోలు..పాపం పిచ్చిపిల్లకి..నవ్వుకున్నాను

మనసులో." ఎవరు మీ అమ్మా ..? ఎందుకు కలవమంది..? " అడిగాను నా మనసు నర్తనను గమనిస్తూ..

వై..దే..హి.." చెప్పింది అరవింద.

" అవునవును..వైదేహీ..నిన్నుచూసి ..ఎక్కడో చూశాననుకుంటున్నా..గుర్తుకువచ్చింది..అవునూ..మరి ఆమె రాలేదే..? ప్రశ్నించాను సునామీలా చెలరేగుతున్న ఆనందాన్ని అదుపులో వుంచుకుంతూ..

అంతలో సివిక్స్ లెక్చరర్ ప్రభాకర్ గారు నా రచనల గురించి వివరిస్తున్నారు మైక్ లో.లేచి నిలబడ్డాను. ఇక వెళ్ళేందుకు ఉధ్యుక్తుడనవుతూ..

" ఆమె రాలేదు.." బదులిచ్చింది అరవింద. గొలుసుని మరలా పంటికింద జరుపుతూ.

" అదే..ఎందుకని..." ఆనందాన్ని అదిమిపెడుతూ, టక్ సరిచేసుకున్నట్లు నటించాను. "ఆమె....రాలేదు....ఆమె....చని..పోయింది.... " మూగగా కుమిలిపోతూ అస్పష్టంగా పలికింది అరవింద.

ఒక్కసారిగా నా కాళ్ళు చచ్చుబడిపోయినట్లు కుప్పకూలిపోయాను కుర్చీలో. మెదడు మొద్దుబారిపోతుంది.

అంత ఘోరమైన వార్త వింటానని ఆ క్షణం వరకూ తెలియదు. ఎన్నో ఆశలనూ, ఊసులనూ మోసుకుంటూ ఇంత దూరం వచ్చిన 'నా మనసు ' ఇంత భయంకరంగా ఓ క్షణంలోనే తునాతునకలై పోతుందని తెలియదు.. సజీవమైన నా పాతికేళ్ళ స్మృతులన్నీ చితిలో కాలిపోయి.. ఇలా శూన్యంగా మారాయని అస్సలు తెలియదు. శక్తిని కూడదీసుకుంటూ చూశాను అరవింద వైపు. పంటిమధ్య గొలుసుని పట్టి వుంచి పొంగుకొచ్చే దు:ఖానికి ఆనకట్ట వేసే ప్రయత్నం చేస్తుంది.

" ఏలా... చని....పోయింది....? " అడిగాను నా దు:ఖాన్ని బయటపడనీకుండా.

" ఆమె చావుకి..ఆమె భర్తే కారణం..." బదులిచ్చింది.

' భగవంతుడా..! ఏ పాపం చేసిందని ఆమెకిలాంటి బతుకునిచ్చావ్..? ప్రేమ నిండిన మనిషి పట్ల నీ కెందుకింత అసూయ..? మౌనంగా రోదిస్తుంది నా మనసు.

" ఆమె భర్త అంటున్నావ్..మరి నీ తండ్రి కాడా..? "

" అలా బతకవలసి రావడం..నాకో శాపం.." పొంగుకొస్తున్న దు:ఖాన్ని దిగమింగుకుంటూ చెప్పింది. నా గుండెను చీల్చుకుంటూ వెళ్ళిందామె జవాబు.

'వైదేహి..నేనెంత దురదృష్టవంతుడిని..? నీకు పెళ్ళైపోయిందని తెలిసి..మరలా కలవడానికే ప్రయత్నించనందుకు ఇంత శిక్ష విధించావా..? కుమిలిపోతుంది నా హృదయం. అరవింద వైపు చూశాను. ' అమ్మా..! " అంటూ ఆమెను అక్కున చేర్చుకుని ఓదార్చలేక .. మనసు శూన్యమై .. మాట్లడలేని మూగవాడినయ్యాను.

" ఇప్పుడే వస్తా అరవింద.. నేను తిరిగొచ్చే వరకూ వెయిట్ చెయ్యి..అరవిందకుమార్ ని నువ్వు కలుసుకుంటవ్.. నీ ఆత్మ బంధువుని ..నువు కలుసుకుంటావ్.." చెప్పాను భారంగా కుర్చీలోంచి లేస్తూ.

నా మాటలు ఆమెకెంతో శక్తినిస్తాయని తెలుసు. నేను ఉండగా ఇక భవిష్యత్తులో అరవిందను ఏ కష్టం దరిచేరదు. నా ' ప్రేమపై ' వైదేహీ పెట్టుకున్న ' నమ్మకం ' ఎప్పటికీ తరిగిపోదు .

* * * * *

అప్పటివరకూ తనతో మాట్లాడిన వ్యక్తి గురించే ఆలోచిస్తుంది అరవింద. ' యశస్వి..' ఎంత మంచి పేరు..? పేరుకు తగ్గట్టు మంచి మనస్వి కూడా - తన క్లాస్ మేట్ చనిపోయిందని తెలిసి..ఎంతలా చలించిపోయారు..? ఓదార్పు కోసమే అయినా ' నీ ఆత్మ బంధువుని ' కలుసుకుంటావని ఎంత మంచిమాట చెప్పారు..?

ఏ పరిస్థితులలో తన తల్లి పాతికేళ్ళనాడు తన మనసులో పదిలపరుచుకున్న ప్రేమను తనకు తెలియచేసింది..? 'ధర్మేచ..అర్ధేచ..కామేచ..నాతిచరామి...' అంటూ ..పెళ్ళినాడు ప్రమాణం చేసిన వ్యక్తిపై లేని నమ్మకాన్ని, పాతికేళ్ళనాడు పరిచయమై, 'రెండేళ్ళ 'పాటు ఆమె మనసుకు దగ్గరగా చరించిన వ్యక్తిపై, తన కూతురి భవిష్యత్తు గురించి నమ్మకాన్ని వుంచుకుంది..? తనువు చాలిస్తున్న క్షణాలలోనూ అతని కోసం ఆమె హృదయం ఎంతలా తహతహలాడింది..? ఎప్పటికైనా, వైదేహీ కూతురుగా, అరవింద కుమార్ గారిని తను కలవాలని, ఎంత దృఢంగా తన నుంచి మాట తీసుకుంది ? తన కళ్ళతో ఆమె మనసులోని మనిషిని చూడగలనని ఎంత గాడంగా విశ్వసించింది ?

యశస్వి గారు ఎంత మంచి మనిషైనా..తమకేమీ కాని మనిషికి ఎలా చెప్పగలదు తను యివన్నీ..? ఆలోచనల్లోంచి బయటపడింది అరవింద, మైక్ లోనుంచి వినిపిస్తున్న మాటలు విని -

" ప్రముఖ వార పత్రికలో మనసే వెన్నెల సీరియల్ ద్వారా పాఠకుల హృదయాలను దోచుకుంటున్న మన రచయిత..మన కాలేజ్ పూర్వ విధ్యార్ధి అయిన అరవింద కుమార్ ని వేదికమీదకు రావలసిందిగా కోరుతున్నాను..." ఆహ్వానించారు సివిక్స్ లెక్చరర్ ప్రభాకర్ గారు.

ఉలిక్కిపడింది అరవింద మైక్ లో వినిపించిన పేరుని గుర్తించి. ఉత్తుంగ తరంగమై లేచింది కుర్చీలోంచి. మెల్లగా వేదిక మీదకు వచ్చి అందరికీ అభివాదం చేస్తున్న మనిషిని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. ఇంతవరకూ నేను మాట్లాడింది 'అమ్మ మనసు ' తోనా ? 'అమ్మ ప్రేమ 'తోనా ? కళ్ళల్లో అనందభాష్పాలు పొంగుకొస్తుండగా, తలెత్తి ఆకాశంలోకి చూసింది..

' అమ్మా..! నీ కోరిక నెరవేర్చానమ్మా..!' తపిస్తుంది ఆమె మనసు తల్లితో ఆ మాట చెప్పాలని....

* * * * *

" అరవింద కుమార్ ని మాట్లడవలసిందిగా కోరుతున్నాను.. " మైక్ వద్దకు ఆహ్వానించారు నన్ను ప్రభాకర్ గారు -

మౌనంగా చేతులు జోడించి అందరివైపూ చూసాను. అందరిలోనూ వైదేహి రూపమే కనిపిస్తుంది నాకు. సుళ్ళు తిరుగుతుంది నా హృదయం లో బాధ. అరవింద వైపు సారించాను నా దృష్టిని. కళ్ళల్లో కోటి కాంతులను నింపుకుని నన్నే చూస్తుంది అరవింద ఎంతో సంబరంగా. అందరికీ అభివాదం చేస్తూ, గొంతు సవరించుకున్నాను మనసు లోని మాటలను తెలియచేసేటందుకు.

" అందరికీ వందనం ..! నా పేరు అరవిందకుమార్... రచయితగా అవతరించిన పేరు యశస్వి..ఈ ఊరివాడిని.. ఈ కళాశాల మొదటితరం విధ్యార్ధిని.. అమ్మ బ్రతుకిస్తుంది..! కళాశాల బ్రతికేందుకు బాటనిస్తుంది..!!

' అనుభవం క్షణం..అనుభూతి అనుక్షణం..'

గతించిన కాలం తిరిగి వస్తే ఎంత బాగుంటుందీ అనిపిస్తుంది యిప్పుడు. ఎన్నో మధురమైన అనుభూతులు మమేకమై వున్నాయి నాలో..ఈ కళాశాలలో పొందినవి..! ఈ కళాశాలను స్థాపించి ఎందరికో విద్యను ప్రసాదించి వారి జీవితాల్లో వెలుగు నింపిన శ్రీ శ్రీనివాసరావు గారు దైవస్వరూపులు. ఈ కళాశాలే లేకుంటే నాకీ ఉన్నతే లేదు. బ్రతుకిచ్చిన తల్లితండ్రులు బ్రతికున్నా, లేకున్నా, బ్రతికేందుకు బాటనిచ్చిన కళాశాల బ్రతికుండాలీ కలకాలం.. అలా బ్రతికించుకోవాల్సిన భాధ్యత పూర్వ విధ్యార్ధులందరిపైనా వుంది..!!

ఈ భావనతొనే కన్నతల్లిలాంటి మన కళాశాలకు ..ఓ లక్ష రూపాయిలు విరాళంగా ఇవ్వదలిచాను. ఆ మొత్తాన్ని ఇదే కళాశాలలో మాతోపాటు విద్యనబ్యసించి, మా అందరికంటే మిన్నగా మార్కులు సాధించి...ఇవాళ ఈ ఫంక్షన్ లోనే కాదు.. ఈ... లోకంలోనే ... లేని... నా....


పొంగుకొస్తోంది నా గుండెల్లోంచి దు:ఖం. అందరిమొహాల్లోనూ విషాదం తొంగి చూస్తుంది. అలానే కొనసాగించాను వైదేహినే తలచుకుంటూ -

" నా సహచర విద్యార్ధినీ 'శ్రీమతి వైదేహి ' పేరుమీద ..ఆ లక్ష రూపాయిల మొత్తాన్ని ఇవ్వదలిచాను. యజమాన్యం సహృదయంతో స్వీకరించి, ఆమె పేరు మీద గ్రంథాలయ భవనాన్ని నిర్మించాల్సిందిగా కోరుతున్నాను. స్నేహ సౌహార్ధాలను పంచిన నా సహచర విద్యార్ధినీ,విద్యార్ధులకు , అభిమానాన్ని పంచుతున్న మా తరువాత తరాల విద్యార్ధినీ, విద్యార్ధులకు ... అభివందనాలు..అభినందనాలు..సెలవ్...." ముగించాను ప్రసంగాన్ని.

మిన్నుముట్టాయి కరతాళధ్వనులు..వెన్నుతట్టాయి ప్రశంసాపూర్వక కనులు. ఈ కళాశాల ద్వారానే పరిచయమైంది వైదేహి. ఓ శాశ్వతమైన అనుభూతిగా మారింది. మనసు మురుస్తుండగానే మంచులా కరిగిపోయింది.ఇప్పుడీ భవన నిర్మాణం ద్వారా వైదేహి ఓ స్మృతిలా మారుతుంది అందరికీ.

తన గుండెలో చోటిచ్చి నాకు ప్రేమామృతాన్ని పంచిన మనిషి, రేపు భవిష్యత్తులో తన గూడు నిచ్చి అందరికీ ఙ్ఞానామృతాన్ని పంచుతుంది. సంతృప్తితో నిండింది నా మనసు.

మినిష్టర్ గారి చేతుల మీద నన్ను పుష్పమాలాంకృతుడిని చేసి, శాలువాకప్పి, మా కళాశాల ఙ్ఞాపికను అందచేశారు శ్రీనివాసరావు గారు. నా ధాతృత్వాన్ని, సహచర విద్యార్ధిని పట్ల నా స్నేహ సౌజన్యాన్ని, ఎంతో గొప్పగా అభివర్ణిస్తున్నారు ప్రిన్స్ పాల్ గారు. నింగినంటాయి అభినందన పూర్వక ద్వనులు.

ఆనందభాష్పాలతో,బరువెక్కిన హృదయంతో వేదిక మీద నుంచి దిగాను.అందరి చప్పట్లూ ఏకమై, అందరి ఆనందమూ మమేకమై, ఆమె సొంతమైనట్లుగా 'చంద్ర ఛాఫం ' పై కూర్చుని చిరునవ్వుని చిందిస్తుంది వైదేహి నన్నే చూస్తూ.

ఏలా నడిచి వచ్చానో తెలియదు. ఆనందంతో వెలిగిపోతున్న అరవిందను చేరుకున్నాను. ఎంతో ఆర్తిగా నన్నే చూస్తుంది. నా మనసు లోని శాంతి కన్నుల్లో కాంతిగా మారుతున్న వేళ ...నా చేతిలోని ఙ్ఞాపికను ఆమె చేతిలో వుంచి, తియ్యని అనుభూతిగా నా శరీరాన్ని అంటివున్న శాలువాను తీసి.. నిండుగా ఆమెకు కప్పాను.

అంతే... అప్పటి వరకూ నిలిపివుంచిన దు:ఖం కట్టలు తెంచుకుంది ఆమెలో. అమాతం వచ్చి నా గుండెపై తలవాల్చి, గాడంగా హత్తుకుపోయి దు:ఖిస్తుంది అరవింద...

అలానే పొదవి పట్టుకున్నాన్నేను ఆ పసి పాపాయిని.. 'మా ప్రేమ తురాయిని ' - ఓ...కన్నతండ్రిలా..!!!

*****

( స్వాతి సపరి వార పత్రిక ... 17-11-2006 )

కామెంట్‌లు లేవు: