15, డిసెంబర్ 2008, సోమవారం

యోగం...!

" షీ యీజే పంప్కిన్.."చెప్పాడు శశాంక్.
" అంటే..? " అర్ధంకాక అడిగింది అతని తల్లి అంజనాదేవి.
" అంటే నువ్వు వడియాలు పడాతావు చూడు..గుమ్మడికాయ..అదీ దానర్ధం.." చెప్పాడు శశాంక చేతులతో సహా వైశాల్యం చూపిస్తూ.

" చాల్లే వూర్కో..అది గానీ బాధపడుతుంది ..కాస్త లావుంటే మాత్రం నీకు పెళ్ళాం కాకుండా పోతుందా ఏమిటీ..? " మందలింపుగా అంది అంజనా దేవి.

"ఖచ్చితంగా కాకుండా పోతుంది..గుమ్మటంలా వున్న దాన్ని గుమ్మానికి కట్టుకోవాలిగానీ, గుదిబండలా మెడకు కట్టుకోకూడదమ్మా..!" కారెట్ ముక్కని తుంచి నోట్లో వుంచుకుంటూతాపీగా చెప్పాడు.

అప్పుడే వంటగదిలోకి రాబోతున్న 'లావణ్య ' చెవిలో పడ్డాయామాటలు. తన గురించి బావ ప్రేలాపన అంతా వింది ప్రక్కనుంచి.

" పిచ్చవాగుడు కట్టిపెట్టు..నీకు ఇష్టం లేకపోతే నోర్మూసుకో.." మందలింపుగా అంది.

"అబ్బో..మేనకోడల్ని అంటే నీకే యింత కోపమొస్తుందే..? " వెటకారంగా అన్నాడు.

" వంట గదిలో నీకేం పనిరా..ఫో బయటికి ముందు.." కసిరింది కోపంగా.

" ఫోన్ చేసి ఎప్పుడొస్తావ్..ఎప్పుడొస్తావ్..అని గొడవచెస్తావ్.. తీరా నేను ప్రేమగా వస్తే.. పొమ్మంటున్నావ్.. మీ లావమ్మ వచ్చినప్పటినుంచి నీలో చాలా ఛేంజ్ వచ్చింది మమ్మీ..! మీ తమ్ముడు పేరు మాత్రం గొప్పగా పెట్టాడు లావణ్య అని.. ఏ మెరుపుతీగ లాగానో..సన్నజాజి తీగ లాగానో తన కూతురు వున్నట్టు.." నవ్వుతూ చెప్పాడు చాలా వ్యంగ్యంగా, బయటికి వెళ్తూ.

ఆ మాటలు విన్న లావణ్య కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తన గదిలోకి వచ్చి మంచం మీద పడి ఏడ్చేసింది.

తన తమ్ముడి గురించి శశాంక వాగటం అంజనా దేవికీ కోపం తెప్పించింది. తమ్ముడంటే ఎంతో ఇష్టం ఆమెకి. అతని చిన్నతనంలోనే తమ తల్లి చనిపోవడంతో , తనే తల్లిలా అతని ఆలనా - పాలనా చూసింది. తనని ఇప్పటికీ 'అమ్మ ' కంటే అపురూపంగా చూసుకుంటాడు. లేకలేక పుట్టిన ఒక్కగానొక్క కూతురుని తన ఇంటి కోడలిగా పంపాలని ఆతని ఆశ. అదే మక్కువ తనకీ, తన భర్తకీ కూడా

అల్లారు ముద్దుగా పెంచారేమో, కాస్తంత బొద్దుగా వుంటుంది లావణ్య. కోనసీమలా కళకళలాడే మొహం. గోదావరిలా గలగలా పరవళ్ళు తొక్కే వయసు. సారవంతమైన భూమిలా జీవం తొణికిసలాడే రూపం. అందులో పచ్చని పైరులా స్వచ్చమైన మనసు. మొత్తానికి లావణ్య పదహారణాల పల్లెపడుచు. ఇంటర్ వరకూ ఇంటిపట్టునే వుండి చదివుకుని ఫష్ట్ క్లాస్ లో పాసయ్యింది.యం.సి.ఎ. చేయ్యాలన్న కోరికతో, డిగ్రీ హైదరాబాద్ లో జాయిన్ అయ్యింది. ఇక్కడి వాతావరణం, కల్చర్ ముందులో కాస్తంత ఇబ్బంది పెట్టినా, మెల్లగా ఎడ్జెస్ట్ కాసాగింది, తల్లిలాంటి మేనత్త సాహచర్యంతో -

అంజనాదేవికి లావణ్య అంటే వల్లమాలిన అభిమానం. ఆడపిల్లలంటే ఎంతో ఇష్టం ఆమెకి. అందుకేనేమో ఆమెకి ఆడపిల్లలను ఇవ్వలేదు భగవంతుడు. ఇద్దరూ మగపిల్లలే. పెద్దవాడు అమెరికాలో స్థిరపడి అక్కడి అమ్మాయినే పెళ్ళిచేసుకుని, తల్లి ముచ్చట్లన్నింటికి, నీరుకార్చాడు.చిన్న కొడుక్కి మేనకోడలను చేసుకోవాలనే, ఆలోచన ఆమెది. మొదట్లో, తన భర్త కొంచెం ముభావంగా వున్నప్పటికీ, ఒకానొక పరిస్థితిలో వ్యాపారం దెబ్బతిని, ఆర్ధికంగా నష్టపడి, పరువుపోయే సమయంలో, పెద్దకొడుకు ఏమాత్రం ఆదుకోలేదు , సరికదా..అప్పటినుంచి ఇండియా రావడమే తగ్గించివేసాడు.

ఆ పరిస్థితులలో బావమరిది బ్రతుకు కోరతాడన్నట్లు, లావణ్య తండ్రి కొంత తన కొబ్బరి తోటను అమ్మివేసి, అక్క కుటుంబానికి కొండంత అండ అయ్యాడు. ఆ సంఘటన దరిమిలా, అంజనాదేవి భర్త రమణారావు లోనూ, మార్పు వచ్చింది. లావణ్య పట్ల అనురాగం పెరిగింది. టీ బిస్కట్స్ వున్న ట్రే ని తీసుకుని ' బుజ్జీ ' అంటూ పిలిచింది అంజనా దేవి. అత్తయ్య తన గదివైపు వస్తుందని గ్రహించిన లావణ్య, వడిగా లేచి, తనకు ఇష్టమైన కాసెట్ ని టేప్ రికార్డర్ లో వుంచి, బాత్ రూం లోకి పరుగుతీసింది మొహం కడుక్కునే మిషతో. గదిలోకి అడుగుపెట్టిన అంజనా దేవికి వినిపిస్తుంది పాట తియ్యగా...

" అత్త ఒడి పువ్వువలే మెత్తనమ్మా..ఆదమరచి హాయిగా నిదురపోమ్మా..ఆడుకుని..ఆడుకుని..అలసిపోతివా..? అలపు తీర బజ్జోమ్మా...అందాల బొమ్మా.. "

ఎంత కమ్మని పాటా ? అయినా పిచ్చి పిల్లకి ఎప్పుడూ, ఇదేపాట..' అనుకుంది మనసులో అనందంగా.

* * * * *
" ఏంటి మమ్మీ స్పెషల్ ఇవాళ ఇంట్లో ఘుమఘుమల మోత..? " కంచం ముందు కూర్చుంటూ ప్రశ్నించాడు శశాంక. " రేపు గురువారం నువ్వు వెళ్ళిపోతున్నావుగా..? రేపు ఇంట్లో నాన్-వెజ్ వండముగా..! అందుకనే నీకిష్టమైనవన్నీ ఇవాళే వండాము..." చెప్పింది అంజనా దేవి.

" వండాము అంటే..మరెవరో..ఆ..డాము..." వెటకారంగా అన్నాడు లావణ్య వంక చూస్తూ.

"ఇంకెవరూ..మన బుజ్జే .." అంటూ లావణ్యను చూపిస్తూ చెప్పింది అంజనా దేవి, ముగ్గిరికి అన్నం వడ్డిస్తూ -

"చచ్ఛాం అయితే.. ఎపెరెన్సెస్ ఆర్ డిసెప్టివ్ ..అని .. కేవలం కంటికి, ముక్కుకేనా, నోటిక్కూడా రుచినిస్తాయా..? " అడిగాడు శశాంక వేళాకోళంగా.

" అంత భయమైతే తినటం మానివేసి, చూస్తూ వాసన పీల్చుకుంటే సరి.." ఈసడింపుగా చెప్పింది లావణ్య.

" వాడు చిన్నప్పటి నుంచీ అంతే..! చెయ్యడం చేతకాక పోయినా వంకలు పెట్టటం బాగా వచ్చు.."

అత్తాకోడళ్ళ కోపం గమ్మత్తుగా వుంది శశాంకకు. లావణ్యను మరింత ఉడికిస్తూ చెప్పాడు.

"యాంగర్ ఈజ్ బ్లైండ్ అన్నారు బేబీ..! ఇంతలోనే అంత కోపం వచ్చేస్తే ఏలా..? కంటికి, ముక్కుకి, నచ్చాయన్న కాంప్లిమెంట్ ని స్వీకరించటం కూడా మరిచిపోతున్నారు తమరు. కంటికి అందాన్నిచ్చేది, నోటికి నచ్చాలి కదా..! తినవద్దంటే ఏలా..? " కూల్ గా అడిగాడు లావణ్యని.

ఒక మెట్టు దిగొచ్చాడు దొర అనుకుంది లావణ్య మనసులో. ఇంతకాలం అతనేమన్నా సహించింది, అతని మీదున్న పిచ్చి ప్రేమతో. తన ప్రేమనే పిచ్చిది - మొద్దుదీ అనుకుంటే ఏలా..? ముంబాయిలో ఏదో పెద్ద ఉధ్యోగం వెలగబెడుతున్నానన్న బోడీ గర్వం. రేపు తనూ ఎల్లలు దాటి ఎగరగలదు ఈ చదువు పూర్తైతే..! అప్పుడు తన కొంగు పుచ్చుకుని తిరుగుతాడు..మహారాణీ..! మహారాణీ..! అంటూ - అవును ఇలాంటి వాళ్ళను అలాగే తిప్పాలి. ఇలా మెంటల్ గా కామెంట్ చేసేవాళ్ళకి అదే సరైన ట్రీట్ మెంట్. దృడంగా అనుకుంది లావణ్య.

" అబ్బా..ఈ చింత చిగురు మాంసం అదిరింది మమ్మీ..రియల్లీ..బ్రహ్మాండంగా వుంది.." అభినందనగా చెప్పాడు శశాంక. ఎంతో మక్కువగా తినడాన్ని ఓరకంట గమనిస్తుంది లావణ్య.

సంతోషం ఉరకలు వేసింది మనసులో. పిచ్చివాగుడు వాగకుండా వుంటే మరింత సంతోషించేదాన్నిగా అనుకుంది మనసులో.
"చేపల పులుసు రుచి చూడు..ఇది కూడా లావణ్యే చేసింది. ఇక మళ్ళీ ఎప్పుడూ వాగవు.." అంది అంజనా దేవి,
ఆతని ప్లేట్లో కూర వడ్డిస్తూ.
"అంటే నోరే పడిపోద్దా..? " భళ్ళుమని నవ్వుతూ అడిగాడు తల్లిని, నోట్లో చేపముక్కని కుక్కుకుంటూ.. ఓరకంట లావణ్యనే చూస్తూ -
ఆ గొంతులో చేపముల్లు గుచ్చుకుంటె బాగుండు.." అనుకుంది లావణ్య.
" శశీ..! నువ్వు ప్రశాంతంగా తినవు. ఎదుతివారిని తిననివ్వవు.." కసిరింది అంజనా దేవి.
" నేనేం అన్నా మమ్మీ..? అమ్మాయిగారి టాలెంట్లన్నీ 'మాలావు ' గా వున్నాయని మెచ్చుకుంటున్నా..అదీ కూడా తప్పేనా..? " అన్నాడు లావు అన్న పదాన్ని సాగదీస్తు.

తన్నుకోచ్చే కోపాన్ని దిగమింగుకుంది లావణ్య. తన శరీరం తీరే అంత. తినకపోయినా కరిగి చావదు. తిండిపోతులా తింటూ, నామీదే కామెంట్స్ 'మొద్దుగాడు ' అని తిట్టుకుంటూ చకచకా భోజనం ముగించి, లేచింది లావణ్య అతని ముందు కూర్చోవడం ఇష్టం లేక.

" అదేంటి బుజ్జీ..పెరుగు వడ్డించుకోలేదు..? " గాబరాగా అడిగింది అంజనా దేవి.
లావణ్య సమాధానం చెప్పే లోపే కలుగజేసుకుని, చెప్పాడు శశాంక.
" నువ్వేమో పెరుగు..పెరుగు అంటావ్..మీ బుజ్జేమో ఇంత పెరిగింది ఇక చాలు అంటుంది..ఏం లావు-అణ్యా ? " ఆమె పేరుని విరిచి, భళ్ళున నోరు తెరిచి బిగ్గరగా నవ్వుతూ అన్నాడు వెటకారంగా -
" క్లోజ్డ్..మౌత్..క్యాచెస్..నొ..ఫ్లైస్.." పదం పదం విడివిడిగా చెప్పింది లావణ్య కసిగా.
ఘొల్లుమని నవ్వాడు శశాంక. మేనకోడలు అన్నదేదో అర్ధంకాక నోరు తెరిచింది మేనత్త.
* * * * *
ప్లాట్ ఫారం మీద రైలు బయలుదేరడానికి సిద్ధంగా వుంది. శశాంకకు వీడ్కోలు చెప్పడానికి అత్తకు తోడుగా వచ్చింది లావణ్య. కొడుకుకోసం ఎదో కొనడానికి వారిద్దరిని వదిలి పక్కకు వెళ్ళింది అంజనా దేవి. ఇద్దరే మిగిలారక్కడ.

" చూడు లావణ్య..! ఈ వారం రోజులు ఎంతో ఉల్లాసంగా గడిచిపోయాయి..నిన్ను ఆటపట్టించడం నాకు సరదా. అఫ్ కోర్స్ నీకీ అంతేననుకుంటాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది..బాడీ మీద శ్రద్ధ లేని వారు.. మరీ దేనిమీదా కేర్ తీసుకోలేరేమోననిపిస్తుంది నాకు. ఏన్ ఓపెన్ ఎనిమీ ఈజ్ బెటర్ దాన్ ఫాల్స్ ఫ్రెండ్ ..అంటారు. అలా నిన్ను టీజ్ చేసినదానికి, నీకు నేను ఓపెన్ ఎనిమీని, క్లోజ్ ఫ్రెండ్ ని అనుకో.." చాలా సీరియస్ గా చెబుతున్న అతని మాటలను, మధ్యలోనే తుంచేస్తూ..
" నువ్వేమీ ఫీల్ కాకు..నేనేమీ నీ మాటలను పట్టించుకుని ఫీల్ అవ్వట్లేదు.." అంది చాలా తేలికగా కొట్టిపారేసినట్లు. అతనిని డామినేట్ చేసానన్న ఈగో ఫీలింగ్ ఆమె కళ్ళల్లో.
" అయ్యో..నేను అనుకున్నంత అయ్యిందే.. నువ్వు ఫీల్ కావాలని కదే.. నేను అంత ఫీల్ అయ్యింది. ." అన్నాడు బాధగా ఏదో దారుణం జరిగిపోయినంత ఎక్స్ ప్రెషన్ ఇస్తూ. పిచ్చికోపం వచ్చింది లావణ్యకు, అతని ఓవర్ ఏక్షన్ చూసి.
ఇంతలో చెతిలో బిస్కెట్ పాకెట్స్ మినరల్ వాటర్ బోటిల్ తోటి వచ్చింది అంజనా దేవి. తన చేతిలోనివి కొడుకుకి అందిస్తూ....
" ఎక్కడపడితే అక్కడ తిని ..ఆ పంపు నీళ్ళు తాగకు..ఆరోగ్యం జాగ్రత్త..వెళ్ళంగానే ఫోన్ చెయ్యి.." చంటిపిల్లాడికి చెబుతున్నట్టుగా చెప్పిందామె. రైలు మెల్లగా కదలసాగింది.
" మమ్మీ..! నేనేదో లావణ్యను అన్నానని..ఫీల్ అయ్యి చిక్కిపోకు..మీ బుజ్జి అసలేం ఫీల్ కావటంలేదంటలే..! కావాలంటే నువ్వే అడుగు..ఏం బుజ్జి..? " నవ్వుతూ అరిచి చెబుతున్నాడు రైలు ఎక్కుతూ.
అతని మొహం నవ్వుతున్నా, నొసలు వెక్కిరించటం గమనించింది లావణ్య.
* * * * *
"వ్వాట్టే గ్రేట్ ఛేంజ్? " ఆశ్చర్యంగా చూస్తూ తన్మయత్వంగా అరిచాడు శశాంక్. లావణ్య శరీరంలో కలిగిన మార్పుని గమనించి,అప్పుడే కాలేజీ నుంచి వచ్చింది లావణ్య.
"నువ్వెప్పుడొచ్చావ్..? " గర్వం మనసులో గంతులు వేస్తుండగ కూల్ గా అడిగింది.
" మీటింగ్ పని మీద మార్నింగ్ వచ్చా.. ముందుగా ఇంఫార్మ్ చేయకుండా వచ్చి మీకు సర్ ప్రైజ్ షాక్ ఇద్దామనుకుంటే మీరే ఇచ్చేస్తున్నారు ఒన్ బై ఒన్ .." అన్నాడు సిన్సియర్ గా.
' షాకేంటిరా బావా..మా షాన్ చూసి, ఇక షేక్ అయిపోతావ్ చూడు..! ' అనుకుంది మనసులో. పైకి మాత్రం అమాయకంగా మొహం పెట్టి.
." షాక్ అవ్వాల్సినంత పనేం జరిగింది.." అంది.
" షాక్ కాక మరేమిటి..ఇంట్లో మమ్మీ ఏమో ఇంగ్లీష్ దంచేస్తుంది..నువ్వేమో.." ఆగిపోయాడు ఆపై ఏమి చెప్పాలో తెలియక.
" ఆ..నేనూ ..? " అంటూ దీర్ఘం తీసింది ఓరకంట చూస్తూ.
లావణ్య బాడీ షేపే కాదు..మాట్లాడే స్టైల్ కూడా మారిపోయింది అనుకున్నాడు. అతని సమాధానం కోసం ఎదురుచూడకుండానే, " అత్తయ్యా..! " అంటూ పిలుస్తూ వంట గదిలోకి దారి తీసింది.

వచ్చినప్పటినుంచి గమనిస్తూనే వున్నాడు శశాంక్ లావణ్య దినచర్యని. మునుపటిలానే వుంది, ఏమార్పు లేదు. మరి ఈ నాలుగైదు నెలల్లో లావణ్య శరీరంలో అంత మార్పు ఏలా వచ్చింది. ఒబెసిటీ సెంటర్ లాంటి దాంట్లో, ఏమన్నా ట్ర్రిట్ మెంట్ తీసుకుందా..? తల్లికూడా క్లూ ఇవ్వడం లేదు. పైగా తల్లి కూడా ఏలా నేర్చుకుందో గానీ, ఇంగ్లీష్ దంచేస్తుంది. డాడీక్కూడా తన తల్లి ఇంగ్లీష్ విషయం తెలియనట్లుంది.
" దాని మొహం అది ఇంగ్లీష్ మాట్లడటం ఏమిటీ..?" అంటూ తన మొహం మీదే నవ్వేసారు అమాయకంగా.విచిత్రంగా వుందే ఈ అబలల బలం..ఏమిటో పసికట్టాలి అనుకుని, మరో వారం రోజులు సెలవు పెట్టాడు శశాంక్ తన కొలువుకి-
* * * * *
ఉలిక్కిపడి లేచాడు శశాంక ఎవరో నిద్రలేపినట్లు, సమయం 4.30 కావొస్తుంది. తెల్లవారటానికి చాలా సమయం వుంది. లావణ్య గుర్తుకువచ్చింది. మెల్లగా లేచి ఆమె గదివైపు నడిచాడు నిశ్శబ్ధంగా. తలుపులు తెరిచే వున్నాయి. శబ్ధం రాకుండా అతి మెల్లగా నెట్టాడు తలుపులని. ఎదురుగా కనిపించి దృశ్యం చూసి బిగుసుకుపోయాడు. ఫ్యాన్ గాలికి చెలరేగి ఆడి ఓడిన ఆమె సిల్క్ లంగా, ఆమె తొడల పైభాగానికి చేరింది. ఒడలు మరిచి నిద్రిసుంది లావణ్య. మిల్క్ నైట్ కాంతిలో మిలమిలా మెరిసిపోతున్నాయి ఆమె పాలరాతి ఊరువులు. గూటిలో నుండి నింగికి ఎగరటానికి సిద్ధామౌతున్న చక్రవాకపు పక్షుల్లా, బిగించిన ఆమె రవికలో నుంచి తొంగిచూస్తున్నాయి ఆమె వక్షోజాలు. వాటి నిగారింపు అతనిలో దాగిన కోరికల ఆకలిని పెంచసాగింది. మొదటిసారిగా మోహపు ప్రవాహంలో మునిగిపోయాడు శశాంక. అనన్య సామన్యమై లావణ్య మేని సౌందర్యాన్ని చూసి -
* * * * *
రాత్రి వేళ నిద్ర రావటం మానివేసింది- నిశాచురునిల చరిస్తూ , చోరునిలా ఆమె అంగాల అందాలను హరిస్తూ , కలల ఒడిలో చేరి మురుస్తున్నాడు శశాంక్ మూడు రోజుల్నుంచి - ఆ సాయంత్రం ఆరు గంటలు కావస్తుండగా నిద్ర లేచాడు శశాంక్ . పేరేంట్స్ ఏదొ ఫంక్షన్ కెళ్లి లేటుగా వస్తామన్నారు .లోపలి తలుపులు వేసివున్నయంటే లావణ్య ఇంట్లోనే వుందన్నమాట. ఆలోచిస్తూ బాత్ రూం లోకి దారితీసాడు శరీరపు సెగలు అరేలా.. తలారా స్నానం చేసి తడి ఆరని బాడి పై స్ప్రే చల్లుకున్నాడు. బాత్ రూం లోనుంచి బయటకు వస్తుండంగా, దభేల్ మని ఏదో పడిన శబ్ధం వినిపించింది లావణ్య గదిలోనుంచి.
" అమ్మా.." అన్న లావణ్య మూలుగు వినిపించింది వెంటనే. నడుముకి టవల్ని గట్టిగా బిగించుకుని, ఆందోళనగా పరుగుపెట్టాడు ఆమె గదిలోకి . , కళ్ళముందు కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు శశాంక్ .

కేప్రస్ ప్యాంట్, దానిపైన లూజ్ టీషర్ట్ వేసుకుని నేలమీద గోడకు ఓ ప్రక్కగా పడివుంది లావణ్య. లోపలికి వచ్చిన శశాంక్ ను చూసి సిగ్గుపడిపోయింది.
" ఏలా పడ్డావ్..? " కంగారుగా అడిగాడు శశాంక్.
" ఈ మధ్య యోగ నేర్చుకుంటున్నాను బావ..! కొన్ని బాగానే వేయగలుగుతున్నాను. ఒకటి రెండు ఆసనాలు వచ్చి చావడం లేదు..అవి ప్రాక్టీస్ చేయబోతుంటే పడిపోయా.." చెప్పింది సిగ్గుతో నలిగిపోతూ.
" ఆ..హా..యిదన్నమాట సీక్రెట్..! మన బుజ్జి బేబీ గారు తన ఫాట్ తగ్గించుకోవడానికి ఎంచుకున్న రూట్ యోగా అన్నమాట.." ఏదో చిదంబర రహాస్యం కనిపెట్టిన వాడిలా, చిద్విలాసంగా నవ్వుతున్నాడు.
' మళ్ళా మొదటికొచ్చింది వ్యవహారం..' అనుకుంది లావణ్య.
" ఏది నువ్వు నేర్చుకున్న యోగాసనాలు వెయ్యి చూద్దాం.." అన్నాడు శశాంక్ దర్పంగా. సిగ్గు దొంతరలలో దాగుండిపోయింది లావణ్య మోము.
"సిగ్గులమొగ్గలు తర్వాత పూయించోచ్చు..ముందు నువ్వు నేర్చుకున్న ఆ పిల్లి మొగ్గలు వేయిచూద్దాం... " ఆఙ్ఞాపిస్తున్నట్లుగా చెప్పాడు. దొంగను పట్టుకున్ననన్న అధికార గర్వంతో....
కానీ, తన కోరికే విష సర్పమై తన సర్వాన్ని హరిస్తుందని ఆక్షణం అతనికి తెలియదు పాపం...!
మెల్లగా వెల్లకిలా నేలపై పరుండిపోయింది లావణ్య. శ్వాసను మెల్లగా పీలుస్తూ శవాసనంలో పరుండిపోయింది, కొంచెం సేపు కళ్ళు మూసుకుని -
అదే అదనుగా పదునైన తన చూపుల బాకుతో, ఆమెను నఖశిఖపర్యంతం చీల్చుతున్నాడు.

నేలపైనుంచి కొంత ఎత్తుకు తన రెండు కాళ్ళను పైకి లేపింది లావణ్య. అదే స్థితిలో కాళ్ళనుంచి, తన తల భాగాన్ని పైకి లేపి, రెండు చేతులను కాలి తొడల పక్కకు చేర్చింది. ఇప్పుడు ఆమె నడుం నేలపై నుంది. ఆ ఆసనం వేస్తున్నప్పుడు లావణ్య పొట్ట భాగం మిషన్ లా షేక్ అవ్వడం స్పష్టంగా కనిపిస్తుంది శశాంకకు. స్విచ్ ఆన్ చేసినప్పుడు, గజగజా వణికే మిక్సీలా కదులుతుంది ఆమె ఉదర భాగం . దానిలోని నాభి స్థానం .. ఎంతో సెక్సీగా అనిపించింది శశాంకకు.

అతనిలో ఆ ఆలోచన రావడమే తరువాయి ఎద పొదలోనుంచి నిద్ర లేస్తున్న కోడెనాగు కదలిక తెలిసివచ్చింది శశాంకకు.

అలాగే తల వెనుక చేతులను పెట్టుకుని మోకాళ్ళను తల వద్దకు చేర్చి రెండు కాళ్ళను ఒక వైపుకి, దానికి అభిముఖంగా నడుము నుంచి పైబాగం మరో వైపుకి వంపింది. తడి టవల్ని పిండే తప్పుడు మెలికలు తిరుగూతూ, టర్కి టవల్ పొందే ఆకృతిని చూస్తున్నాడు లావణ్య నడుములో. మెల్లగా నలిగే నడుమే కాదు, కరిగే కండరాలు కని పిస్తున్నాయి అతనికి స్పష్టంగా. ఆ నడుము వంపుల్ని స్పృశించాలన్న కాంక్షను బలవంతంగా అణచుకున్నాడు.

బోర్లా పడుకుని పొట్ట భాగాన్నుంచి కాళ్ళవరకూ నేలకు ఆనించి, రెండుచేతులను భుజాలపక్కగా నేలకు అదిమి పెట్టి, మెల్లగా తల పైకెత్తి ఎద భాగాన్ని గాలిలోకి లేపింది. స్ప్రింగ్ లా వెనుకకు వంగుతున్న్న వెన్నుపూసనే కాదు, గట్టిగా బలం చేకూర్చుకుంటున్న ఆమె పిరుదులపట్టునూ గమనించాడు ఈసారి. అతని నరనరాలు మదనుని శరాలకు తెగి పోతున్నాయేమోననిపించింది.

అలాగే పరుండి రెండు చేతులతోనూ కాళ్ళను గట్టిగా పట్టుకుని, శక్తిమీర కాళ్ళను వెనుకకు నెడుతుంది లావణ్య. చేతులు బలంగా కాళ్ళనే పట్టి వుంచటంవలన తల, ఎద భాగం పైకిలేచి విలుకాని చేతిలో ఎక్కుపెట్టిన ధనుస్సైంది ఆమె తనువు. ఆ భంగిమలో కాళ్ళ ,చేతుల, పిక్కల బలమే కాదు...ఆమె వక్షోజాలు నిక్షిప్తం చేసుకుంటున్న శక్తిపుంజాన్ని చూశాడు. క్షణక్షణానికి తీవ్రమవుతున్న కోరికల లావా తననే దహించి వేస్తుందేమోననే భయం కలిగింది శశాంకకు.
గట్టిగా కళ్ళు మూసుకున్నాడు, భరించలేని బాధను నిభాయించుకునే ప్రయత్నం చేస్తూ - ఆలోచనలలో క్షీణిస్తున్న శక్తిని కూడదీసుకుని అడిగాడు మెల్లగా... " ఇంతకీ..నీకు రాని ఆ ఆసనం ఏమిటీ..? " అంటూ -
కనులు తెరిచి చూసింది లావణ్య. మిలమిలమంటూ మెరుస్తున్నాయి నక్షత్రాల్లా..
' తనకు కావల్సిన శుభఘడియలు సమీపిస్తున్నాయి ' అనుకుంది ఆనందంగా -
" సర్వాంగాసనం ..." అంది చిన్నపిల్లలా. " అంటే..? " అడిగాడు అమాయకంగా.
" ఏం లేదు..తలా మెడపై బరువునుంచి, మొత్తం శరీరాన్ని నిటారుగా పైకి లేపటం. అదే రావటం లేదు. మెల్లమెల్లగా నా కాళ్ళను పైకి లేపు బావా..! ఒక్కక్షణం గోడలాగా కాస్త సపోర్టివ్వు చాలు..." అంది.
అదేదో చాలా స్వల్ప విషయమయినట్లుగా..
పల్లెపల్లెలనూ దావాగ్ని జ్వాలల్లో దహించి వేయడానికి కేవలం ఒక చిన్న అగ్గిపుల్ల చూలు. ఇప్పుడు దాన్నే మండించే ప్రయత్నం చేస్తుంది ముద్దుగుమ్మ.ఆమె చెప్పినట్లే చేశాడు శశాంక. తెలియటం లేదు అతనికి - తనలో తనేం కోల్పోయాడో..? ఇంకా ఏమేమి కోల్పోబోతున్నాడో..??
నేలపై తల వెనుక భాగాన్నుంచి, నడుకుకి చేతులను ఆనించి, అతని చేతులకు తన కాళ్ళను అప్పగించింది. ఒకప్పుడు తనని వెక్కిరించిన దానికి మూల్యం చెల్లిస్తున్నాడు శశాంక అమాయకంగా. తప్పదు ' ఆల్ యీజ్ పేర్ ఇన్ లవ్ అండ్ వార్ ' అనుకుంది మనసులో -
ఎంతటి బాసైనా కాంతదాసుడే.. ! దాసుడయ్యాడిప్పుడు శశాంక తనకు తెలియకుండానే..!
" జాగ్రత్త..బావా..! " అంటూ అతడిని మరింత మైకం లోకి నెట్టింది.
ఆమె రెండు కాళ్ళను తన చేతులతో పట్టుకుని, గుండెలపై సపోర్టింగ్ గా పెట్టుకుని, నిలుచున్నాడు శశాంక ఏ శంకా లేకుండా - ఇప్పుడు అతని శరీరం ముందుభాగం ఆమె శరీరానికి తాకుతుంది వెచ్చగా రగులుతూ. ఆమె శరీరం వెనుకభాగం అతని శరీరానికి అద్దుకుంది మంచుగడ్డలా చల్లగా మండిస్తూ. ఇద్దరిలోనూ ఒకేరకమైన 'ఇచ్చ ' రెచ్చిపోతూవుంది విచ్చలవిడిగా -
' ఇఫ్ యు వాంట్ టు డీల్ విత్ ఏ ఫాక్స్..ధింక్ ఆఫ్ హిజ్ ట్రిక్స్ ' అన్న పదానికి ప్రాణప్రతిష్ఠ చేస్తుంది ఒక మిషతో కన్య - రోషంతో లావణ్య.
మెల్లగా కాలివేళ్ళను అటూ-యిటూ కదిలిస్తూ, ఆచ్ఛాదనలేని అతని ఛాతీపై ' సరిగమలు ' పలికిస్తుంది లావణ్య. తట్టుకోలేక 'మగరిసలు ' ఆలపిస్తున్నాడు క్షీణ చంద్రుడు. కావాలనే ఆమె అలా ప్రవర్తిస్తుందని తెలుసుకుని సిగ్గుపడ్డాడు తన తెలివి తక్కువతనానికి.
" ఏం బావా..! మొహం అలా మాడిపోయిందేమిటీ..? నా కాళ్ళు పట్టుకోవలసి వచ్చిందనా ? ఏం చేస్తాం ? సం ఒన్ ఆర్ వైజ్ అండ్ సం ఒన్ ఆర్ అదర్వైజ్ ..కోపంతో కాళ్ళు వదిలేయకే..ప్లీజ్..!! " అంది నోటితో అభ్యర్ధిస్తూ, నొసలుతో వెక్కిరిస్తూ -
అంతే..అమాంతం వదిలేసాడు శశాంక ఆమె కాళ్ళని. ఆశ్చర్యం..! పడిపోతుందనుకున్న లావణ్య పడిపోలేదు సరికదా..!మరిన్ని కదలికలను చేసి చూపించింది గాలిలో కాళ్ళతో. విభ్రాంతుడయ్యాడు శశాంక ఆమె చర్యలకి. శరీరాన్ని నేలపై ఆనించి, బాడీని రిలాక్స్డ్ గా వుంచి, నవ్వుతూ అడిగింది...
" ఏం బావా..! అలా అయిపోయావేమిటి..? లావు ఒక్కింతయూ లేదు అన్నట్లు.." అంది .'లావు ' అన్న పదాన్ని సాగదీసి అతనిపైకి విసురుతూ. తెల్లబోయిచూస్తున్నాడు ఆమెవంక.
" ఏం...యిప్పుడు..మాతలు..లావేం.." అంది మరీ చిన్నపిల్లలా. బుంగమూతి పెట్టి వెక్కిరిస్తూ.

ఆ ఇంతి కేరింతలతో, కవ్వింతలతో ముద్దబంతి అయ్యింది. ఆ మగధీరునిలో అహం చెలరేగి కలహానికి దిగింది. మోహపు మాయతో నిండి అతడిని రెచ్చగొడుతూవుంది ఆమె నాభి లోయ. ఆమె కళ్ళల్లో కాంక్షాంబరం..దేహమంతా కాంతి సంబరం.
ఆమెనే గమనిస్తున్న శశాంక మనసు పరవశానికి గురై, ఆమె ప్రేమపాశానికి వశమైపోయింది. అమాంతం ఆమె పైకి ఒదిగిపోయి గాఢంగా బంధించి వేశాడు తన కౌగిట్లో - అధ్భుతానందాంభుధిలో ఓలలాడుతుంది లావణ్య. అతడినే పెనవేసుకుంటూ -
" మై డియర్ స్వీట్ హార్ట్..! మొత్తానికి నువ్వే జయించావు..అదీ పగతో సాధించావు..నీ కసి తీరిందా..? " అంటూ ముద్దుల ముద్రలతో ఆమె తనువంతా అద్దేస్తున్నాడు శశాంక.
"పగతో కాదు బావా..! నాకు ఇంత యోగానిచ్చింది. యోగానే..! నీపై కసికాదు..వసివాడని ప్రేమ.." అంది పారవశ్యంతో తేలిపోతూ -
మరింత గాఢంగా హత్తుకున్నాడు శశాంక ఆమెని. పులకింతలతో, పున్నమికాంతులతో, వెలిగిపోతుంది గర్వంగా లావణ్య మోము - సర్వం కోల్పోతున్న అమావాస్య చంద్రుడిని చూసి-
* * * * *

( స్వాతి సపరి వార పత్రిక 9-8-2002 )





కామెంట్‌లు లేవు: