20, డిసెంబర్ 2008, శనివారం

కొత్త పుంతలు...!


చెంచురామయ్యకు ఆ దారి కొత్త కాదు. ఎడ్లబండ్లు నడిచే మట్టి రోడ్డు, దారి పొడవునా తుమ్మ చెట్లు, అక్కడక్కడా ఎంతో జీవితాన్ని చూసిన అనుభవంతో ఊడలు దిగిన మర్రిచెట్లు. ఇవన్నీ చెంచురామయ్య రోజూ చూసేవే. చూడనిదల్లా వేపచెట్టు దగ్గర కొత్తగా వెలిసిన కల్లు పాక.

మూడు రోజుల క్రితం తను ఆ దారిన వెళుతున్నప్పుడు, ఏవరో చిన్న పాక వేస్తున్న హడవుడి కనిపించింది. తను పెద్దగా పట్టించుకోలా.ఇవాళ కొత్తగా కనిపిస్తుంది కల్లుపాక కూడా కాదు, రంగు కాగితాల తోరణాలు కావు, అలికిపెట్టిన ముగ్గులూ కావు, నురగతో నిండివున్న కల్లుకుండలూ కావు,

వయసు పొంగుతో నిండి, నలుపు రంగులో వుండి, లేత సూర్యకిరణాలకి మిలమిలా మెరుస్తున్న కొరమీను చేప లాంటి పిల్ల. పిల్లంటె పిల్ల కాదు,ముప్పై, ముప్పై ఐదుకి మధ్య వుండొచ్చేమో వయసు. లేత తమలపాకులా కాకుండా, ముదురిన కోనసీమ కొబ్బరిబొండంలా వుంది. పెదాల మీద పరిచయమున్న నవ్వుతో, ఓరకంట చూసిన చూపు, సుడిగుండంలా చుట్టేసింది చెంచురామయ్యను.

చెంచురామయ్యకు యాభై ఏళ్ళు దాటి రెండెళ్ళైయ్యింది.మనిషి పెద్ద పొడవు కాదు. పొట్ట బాగా పెరిగినందువల్లనేమో, పొట్టే అంటారు చాలామంది. మూతిమీద మీసాల్లానే పెరిగాయి, చెవులమీద వెంట్రుకలు. మిగిలిన కాసిన్నీ.. కోటకు కాపలా కాస్తున్న సైనికుల్లా బుర్ర చుట్టూ పెరిగాయి. గింజలు రాల్చడానికి చదును చేసిన చేనులా వుంటుంది బట్టతల.
చెంచురామయ్యకు ఊళ్ళో మంచిపేరే వుంది. ఇరవై ఐదు ఎకరాల రైతేగానీ, ఏనాడూ పనివాళ్ళను గట్టిగా తిట్టికూడా ఎరగడు.
' గాడిద కొడకా ' అనిగానీ అన్నాడంటే చాలా కోపంగా వున్నాడన్నమాటే. భార్య చనిపోకముందు చెరువు దగ్గరి రావిచెట్టు కింద చేరి, ఊరి పెద్దలతో పిచ్చాపాటి మాట్లాడటం చేస్తుండే వాడు. విలేఖరిలాగా వార్తా సేకరణలేగాని, ఏనాడూ గట్టిగా స్టేట్ మెంట్ ఇచ్చికూడా ఎరగడు. అందుకే కాస్త నోరున్నవాళ్ళు, తాము చెప్పిందాన్ని బలపర్చుకోవటానికి .. చెప్పాల్సింది చెప్పి...
" నువ్వేమంటావు చెంచురామయ్య..? " అని అడుగుతారు.
" అనటానికేముంది నువ్వు చెప్పింది సబబే.." అనేవాడు.

ఏడేళ్ళ క్రితం భార్య చనిపోయినప్పటి నుంచి, ఆ పక్కకు వెళ్ళటం తగ్గించేశాడు. పొలం పనులు చూసుకోవటం, సాయంత్రమయ్యేసరికి పడక్కుర్చీ వేసుకుని టి.వీ చూడటం దినచర్యగా గడపసాగాడు. అలా సాఫీగా, తాపీగా సాగిపోతున్న చెంచురామయ్య జీవితంలో ఇవాళ 'అలజడి 'మొదలైయ్యింది.


పొలం దగ్గరకు వచ్చాడన్నమాటే గానీ, పనిమీదకు మనసు మళ్ళడం లేదు. పొద్దుతిరుగుడు పువ్వులాగా మనసు కల్లుపాక దగ్గర చూసిన పిల్లమీదకే మళ్ళుతుంది. ' దీని సిగతరగ ' ఎలాంటి చూపు చూసింది..? ' ఈతముల్లు గుచ్చుకున్నట్టు బాధతో గిలగిల్లాడిపోయాడు. తన పరిస్థితి తనకే ఆశ్చర్యమేసింది. ' తనేమిటి ? అదేమిటీ..? ' ఆలోచనలో పడిపోయాడు.

* * * * *

" బాబు ఆ దిగువ పొలానికి నీళ్ళెట్టమంటారా..? " ఆలోచనలకు అంతరాయం కలిగేసరికి కళ్ళు తెరిచి చూశాడు . ఎదురుగా కిష్టిగాడు కనిపించాడు. పెట్టమన్నట్టు కళ్ళతోనే సైగచేశాడు.

" ఓరే కిష్టిగా..ఇలా దగ్గరికి రా " వెళ్ళిపోతున్న కిష్టిగాడిని పిలిచాడు చెంచురామయ్య. రాములవారి పాదాలవద్ద హనుమంతులవారి ఫోజులోలా ఎంతో వినయంగా వచ్చి నిలబడ్డాడు కిష్టిగాడు.

" ఎవర్రా అది ? నాయుడి గారి పొలం పక్క కల్లు పాక పెట్టింది..? " లేని గంభీరతని ప్రదర్శించాడు.

సారా ప్యాకెట్టును చూసినప్పుడు కలిగే ఆనందం కంటే రెట్టింపు ఆనందం కలిగింది కిష్టిగాడికి. యజమాని అటువంటి ఆరాలడగటం పనివాళ్ళకు ఎంతో ఉత్సాహాం కల్గిస్తుంది.

" ఎక్కడ్నుంచి వచ్చిందో నాకుమాత్రం తెల్దండి..ఇద్దరు పిల్లలంట. పెద్దాడేమో అప్పిగాడి సైకిల్ షాపులో పనిచేత్తనాడండి..చిన్నాడేమో.." చిరాకేసింది చెంచురామయ్యకు. ఈ వెధవ ఎప్పుడూ ఇంతే. కావాల్సింది మాత్రం చెప్పడు.

" గాడిదకొడకా..పెట్టినోడు ఎవర్రా అంటే ఎదవ సొద చెబుతావు " విసుకున్నాడు..కాదు నటించాడు. పైగా 'పెట్టినోడు ' అంటూ వత్తి పలికాడు.

" ఆడమగోళ్ళెవరూ లేరు బాబు..ఆడకూతురే ఎట్టినాది. మొగుడు వదిలేసినాడల్లేవుంది బాబు. అక్కడెవ్వరూ కానరారు. అయినా యాపారం కూడా మాంచిగా సాగుతున్నాది బాబు. దీని దెబ్బకు కొండలుగాడి దుకాణం కాళీ అయిపోనాది.." హుషారుగా చెబుతున్నాడు కిష్టిగాడు.

మళ్ళీ దారి తప్పుతున్నాడు వెధవ అనుకున్నాడు చెంచురామయ్య.
" పోరా పోయి నీళ్ళపని చూడు. పోరంబోకు సొద ఎప్పుడూనూ.." విసుక్కున్నాడు.

తనేం తప్పుచేశాడో అర్ధంకాలేదు కిష్టిగాడికి. మొహం వేలాడేసుకుని వెళ్ళిపోయాడు. అందిన సమాచారం ఆనందాన్నే ఇచ్చింది చెంచురామయ్యకు. పైగా మొగుడొదిలేశాడన్న మాట మరింత హుషారునిచ్చింది. అంతలోనే దిగులు కమ్ముకుంది. తనకేమో కల్లు తాగే అలవాటు లేదు. మరి దేని కోసమని కల్లుపాక దగ్గరకెళ్ళటం ? మళ్ళా ఆలోచనలో పడిపోయాడు చెంచురామయ్య.

* * * * *

" రండీ బాబూ..! ఈ నులక మంచమ్మీద కుర్చోండి.." పాక లోపలికి ఆహ్వానించింది రత్తాలు. చెంచురామయ్య వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరూ లేరు.

" పిల్లా..నీ పేరేంటే..? " అన్నాడు కాస్త భయంగా.

" రత్తని అంటారుగానీ, నా పేరు రత్తాలండీ.." వినయంగా చెప్పింది.

తాటి ఆకును కత్తితో మధ్యగా చీల్చుతుంది రత్తి. అది చూస్తున్న చెంచురామయ్య హృదయం కూడా తాటి ఆకులానే సర్రున తెగినట్లైంది.

రవిక లోపల వేరే తొడుగు లేదేమో, చిన్న లొట్టెలు రెండు గుండెలమీద పెట్టుకున్నట్లనిపించింది. ముందుకు వాలిన పొట్ట నల్లని కొత్తకుండలా నిగనిగలాడుతోంది. వంగుని వుండటం మూలానా, చీర ఒంటికి బాగా అంటుకుపోయి అవయవ సౌష్టవాన్ని చూపిస్తోంది. కనిపించని కాలి తొడలు ఎదిగిన తాటిచెట్టు మొదలునే గుర్తుకుతెస్తున్నాయి. కత్తిని కిందపడేసి, ఆకుని ముడులు వేస్తూ నిలుచుంది రత్తి. చీర బాగా కిందకు కట్టిందేమో, లోతైన బొడ్డు కల్లుముంత నోరులా కనిపించింది.

దొంగ చూపులు చూస్తున్న చెంచురామయ్యలో యవ్వనం గువ్వలా ఎగిరి, రగులుకోవటం మొదలెట్టింది కామపు సెగ.

' దోనెను 'తెచ్చి చెంచురామయ్య చేతికి అందించింది. మారుమాట్లాడకుండా అందుకున్నాడు . కల్లు ముంతను ఎత్తి, అభిముఖంగా వచ్చి వంగుని వంపసాగింది.

"మెల్ల్లగా పొయ్యవే పెద్దగా అలవాటు లేదు.." గుసగుసలాడినట్టు చెప్పాడు.

" గుటకేసి చూడండి బాబు.. కమ్మగుంటేనే తాగండి..నాకాడ కల్లు రుచి చూసినోళ్ళు మరేకాడికీ పోరు.." అంది కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ.

ఒక్కసారిగా షాకు తగిలినట్లనిపించింది చెంచురామయ్యకు. మెల్లగా గుటకలు వేస్తూ, కళ్ళెత్తి చూశాడు రత్తి వైపు. అంత దగ్గరగా అమెను చూసిన చెంచు రామయ్యకు గుటక పడలేదు. పొలమారింది వెంటనే. ఒళ్ళంతా పడింది కల్లు.
టప్ టప్ మని అతని నెత్తిన అరచేత్తో కొట్టింది రత్త్తి. ఆశ్చర్యంగా చూశాడు రత్తి వైపు.

" సమించండి బాబు..పొలమారితేనూ..." సంజాయిషీగా చెప్పింది..

" నెత్తినేమి ఒలికిందే, ముందు ఇక్కడ తుడూ.." అంటూ రత్తి చెయ్యిని తన గుండెల మీద పెట్టి రుద్దుకోసాడు. ఆశ్చర్యపోలేదు రత్తి. చెంచురామయ్య రాకలోని కోరికను ఎప్పుడో పసికట్టింది. సిగ్గులొలకబోస్తూ మొహం తిప్పుకుని రుద్దసాగింది. అతి సుకుమారంగా కదులుతున్న ఆమె చేతివేళ్ళ స్పర్శకు గమ్మత్తైన అనుభూతి కలిగింది చెంచురామయ్యకు. తమకంతో ఆమెవంక చూశాడు.

అదే క్షణంలో ' ఇక చాలు బాబు ' అన్నట్టు కళ్ళార్పుతూ ఓరకంటగా చూసింది రత్తి.

'దీని సిగతరగ మళ్ళా అదే చూపు ' మనసులోనే మురిసిపోయాడు చెంచు రామయ్య.

' కల్లిచ్చిన కైపూ- కామపు ఊపూ ' ఇక నిభాయించుకోలేక పోయాడు. అమాంతం రత్తిని వాటేసుకుని వెనక్కి వాలిపోయాడు నులకమంచం మీద. పత్తిపువ్వులా ఒదిగిపోయింది రత్తి, చెంచురామయ్య కౌగిట్లో. ఆమె పెదవులు అతని బుగ్గల్ని తాకుతున్నాయి. ఆమె గుండెలమీ బరువు తన గుండెలమీద పడ్డట్టనిపించింది. గట్టిగా బంధించాడామెను తనలో వున్న శక్తినంతా కూడదీసుకుని.

" వదలండి బాబు..! ఎవరైనా చూత్తారు .." అంది వదిలించుకోబోతూ.
"చూస్తే చూడనీయే. మన్నేటి చేత్తారు..నీయవ్వ..! ఒక్క గుక్క ఏస్తేనే ఇంత మత్తుగుందేటే..? " ఆన్నాడు మైకంగా. ఆమె బుగ్గను కొరకబోతూ.

" మీకు మత్తిచ్చింది కల్లేటీ..? " అంది మొహాన్ని అతనికి అందకుండా చేస్తూ.

" మరేటే..?" ప్రశ్నించాడు మరింత కౌగిలి బిగిస్తూ.

" అబ్బ..! మొరటోళ్ళు బాబూ..పక్కటెముకలు యిరగొట్టేత్తున్నారు.." అంది అతని గుండేల మీద గోళ్ళతో రాస్తూ.

గిలిగింతలు పెట్టినట్టనిపించింది చెంచురామయ్యకు. ఆమె వీపు మీద నుంచి చేతిని మెల్లగా కిందకి జరిపాడు. కండపట్టి కవ్విస్తున్న నడుము ముడతల్ని అరచేత్తో గట్టిగా నొక్కాడు. సన్నగా మూలిగింది రత్తి మరింత దగ్గరవుతూ. చెంచురామయ్య చేతులు ఒక్కచోట నిలవడం లేదు - రత్తి ముద్దులు ఒక్కచోట ఆగటం లేదు -

ఆ ..ఆటలో ఎవరు నెగ్గారో తెలియదు కానీ, నైతికంగా ఓడిపోయాడు చెంచురామయ్య నిజజీవితంలో. గెలుపూ-ఓటములూ తెలియని ఆ ఆట రోజూ ఆడుతూనే వున్నాడు చెంచురామయ్య రత్తితో -

* * * * *

కమ్మని తాటికల్లు బాగా మషాలా దట్టించిన కోడికూర మనసారా తింటున్నాడు. ఇలాంటి సరికొత్త రుచులు గత మూడు నాలుగు నెలలుగా కొనసాగుతూనే వున్నయి చెంచురామయ్య జీవితంలో. తొలినాడు పరిచయమైన రత్తికి, ఇప్పటి రత్తికి తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది. కట్టూ , బట్టా పద్దతుల్లో శుభ్రత ఎక్కువైంది. కల్లు అమ్ముకుని బతకాల్సిన అవసరం ఇంక లేకపోయింది. చెంచురామయ్య హైదరాబాదు నుంచి కొని తెచ్చిన 'దిల్ కుష్ ' అత్తరును క్రమం తప్పకుండా వాడుతూనే వుంది. చుక్కల చీర కట్టిన రత్తి, ఈ రోజు ఎందుకో మరింత ఆకర్షణీయంగా కనిపించింది. ఆ మాటే అన్నాడు ఆమె బుగ్గగిల్లుతూ..

" ఏంటే..ఆకాశంలో మెరిసే చుక్కల్ని చీరలో సింగారించావు..? పైగా మొహం చంద్రబింబంలా వెలిగిపోతాంది..? ఏంటి కత..? "

" ఏంలేదు మామ..! ఆ విషయం నీకు చెప్పాలంటేనే సిగ్గవుతా వుంది.." అంది

కులుకుతూ" చెప్పవే చిలకా..! పండక్కేమన్నా కొత్తకోక కావాల్నా..?" అడిగాడు చెంచురామయ్య పక్కనే వున్న కల్లుముంతను అందుకుంటూ.

" ఛ..ఛ..అదేం కాదు మామ.." సిగ్గుపడిపోయింది. ముచ్చటగా వుంది అతనికి దాని సిగ్గు.

" చెప్పవే నా దొంగముండా..? ఏటి కావాలే..? " అన్నాడు నడుమ్మీద గిల్లుతూ .

" నువ్వు తండ్రివవుతున్నావు మామ..! " అంది రత్తి గారాలు పోతూ.
తాగుతున్న కల్లు పొలమారింది..

"ఏంటే నువు చెప్పేది..?" ఆడిగాడు ఆశ్చర్యంగా.

"నిజం మామ ఇప్పుడు రెండో నెల.." అంది.

తాటిచెట్టు మీద నుంచి కిందపడ్డట్టుగా గతుక్కుమన్నాడు చెంచురామయ్య. తనెప్పుడూ ఊహించలేదీ విషయం. ఊహించాల్సిన అవసరం లేదనుకున్నాడు తన వయస్సుకి. నిజంగా ఇది పిడుగులాంటి వార్తే. ప్రతి పురుషుడూ, ఆనందించే ఈ సమయంలో ఎదో తెలియని భయంతో వణికిపోయాడు చెంచురామయ్య. తాగలేకపోయాడు ఆపైన. ఉండలేకపోయాడు అక్కడ. లేచి నిల్చున్నాడు..

"అదేమిటి మామ..అర్దాంతరంగా లేచిపోనావు.." అంది రత్తి చెయ్యిపట్టి ఆపుతూ..

" రేపు వస్తాలే .." అంటూ ముఖం చూపించకుండా ఏదో పనున్నట్లు వచ్చేశాడు బయటకు

* * * * *

ఇది జరిగి వారం పది రోజులు అవుతున్నా, పొలం వైపుకు వెళ్ళలేదు చెంచురామయ్య. ఒంట్లో బాగుండలేదని ఇంటిపట్టునే వుండిపోసాగాడు.ఏంచెయ్యాలో తోచకుండా వుంది. ఆలోచించటానికి కూడా మనస్కరించంటం లేదు. ఈ విషయం బయటపడితే ఎంత పరువుదండగా ? ఊళ్ళో తలెత్తుకుని తిరగలేడు. ఇంతకాలం ఎంతో గుట్టుగా బతికాడు.

యాభై ఏళ్ళకు పైగా పెంచుకున్న మంచీ - మర్యాదా, ఓ.. ఐదు నిముషాల బలహీనతకు బలికానున్నాయా..? బుద్దిమాలిన పని చేశానని దిగులు పడ్డాడు. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకుండా వుంది. మనసంతా నిస్తేజమై పోయింది. మునుపటి ఉత్సాహం లేదు. దెయ్యం పట్టిన మనిషిలా నీరసించిపోయాడు -

' మనసు తీర్చుకుంది కరువు. వయసుకు తెచ్చింది బరువు. '

కొంతకాలం ఆ పక్కకు వెళ్ళకుండా వుంటే సమసిపోతుందని సమాధానపడ్డాడు. దేవునిమీద భారం వేసి ఈ కష్టం నుంచి గట్టెక్కించమని ప్రార్ధించాడు.

* * * * *

గదిలో కూర్చుని టీ.వి చూస్తున్న చెంచు రామయ్యకు, కాంపౌండ్ వాల్ గేటు తీసుకుని లోపలకు వస్తున్న రత్తి కనిపించింది. చెమటలు పట్టాయి చెంచు రామయ్యకు. ' ఈ దరిద్రపు ముండ ఇక్కడుకు దాపురించిందేమిటీ..? కొంపమీదకు తెచ్చిపెడుతుందా ఏమిటి నిప్పు.. ? వణికిపోసాగాడు.

" ఎవరుకావాలి ? " ప్రశ్నించాడు చెంచురామయ్య పెద్దకొడుకు రత్తిని చూసి

" ఏం లేదు బాబు..! నాయుడు గారు ఏప చెట్టుకాడ స్థలం కాళీ చెయ్యమంటున్నారు..పిల్లలు గలదాన్ని.. అయ్యగార్ని అడిగి.. మీ పెద్ద బావికాడ కాస్త జాగా ఇప్పిస్తే, చిన్న గుడిసేసుకు బతుకుతాము..ఈ మాటే అయ్యగార్ని అడిగిపోదామని వచ్చా.." అంది ఎంతో వినయంగా -

ఆ మాటలు విన్న చెంచు రామయ్యకు ఒంటిమీద గొంగళిపురుగు పాకినట్లు కంపరమెత్తింది.

' దొంగముండ..మెల్లగా పాగా ఏద్దామనుకుంటుంది.. దీని సంగతి తేల్చాలి..లేకుంటే తను మునగటం ఖాయం ' అనుకున్నాడు దృడంగా. ఇంతలో పెద్దకొడుకు గదిలోకి వచ్చి చెప్పాడు రత్తి విషయం.

" తర్వాత చూద్దాంలే..ముందు పొమ్మను.." సౌమ్యంగా చెబుదామనుకున్నాడుగానీ, చెప్పలేకపోయాడనే అనిపించింది ..తనకే. ఇక లాభంలేదు..దీనికి ముగింపు పలకాల్సిందే. ఎవరి ప్రాణం పోయినా పర్వాలేదు. తన పరువు మాత్రం పోకూడదు. చివరికి ఒక నిశ్చయానికి వచ్చేశాడు.

* * * * *

" ఇదిగో పదివేలు..ఈ డబ్బు తీసుకుని ఊరువదిలి పెట్టి ఫో.." డబ్బుకట్టను ఆమె ఒళ్ళోకి విసిరి ఆఙ్ఞాపిస్తున్నట్టుగా చెప్పాడు చెంచు రామయ్య.

" అన్నాయం బాబు..కల్లాకపటం తెలీనిదాన్ని తల్లిని చేశారు.. ఈ విషయం నలుగురికి తెలిస్తే నా బతుకేం కాను..? " వలవలా ఏడ్చింది.

' నీ బతుకేం కాదు..పోయేది నా బతుకే.. ' అనుకున్నాడు లోలోపలే.

" తెలిసేదేముంది..ఎక్కడనుంచి వచ్చావో ఎవరికి తెలుసు..అట్లానే గుట్టు చప్పుడు కాకుండా ఎల్లిపో.." సూటిగానే చెప్పాడు.

" నా వల్ల కాదు..నన్నాయం చెయ్యకండి బాబు..మిమ్మల్నే నమ్ముకున్నాను.."భోరున ఏడ్చింది.

ఇదంతా చూస్తున్న చెంచ్చు రామయ్యకు చిరాకేసింది. ఇవాళే దీని విషయం పరిష్కరించుకోవాలి. మరల ఈ తోవకు రాకూడదు అనుకున్నాడు. కుడిపక్క జేబులోంచి మరో ఐదువేల రూపాయిల కట్టను బయటకు తీశాడు.

" ఇదిగో మరో ఐదువేలు. మొత్తం పదిహేను వేలు. ఇవి తీసుకుని పట్నం వెళ్ళిపో..నేను వచ్చి కలుత్తా వుంటాగా.." అనునయంగా చెప్పాడు. నిజమేనా అన్నట్టు చూసింది.

" నిజమేనే పిచ్చిదానా.." అన్నాడు తల నిమురుతూ.

సుడిగాలిలా వచ్చి వాటేసుకుంది రత్త్తి. ఇంతకు ముందు ఇలా వాటేసుకుంటే, ఒంట్లో వేడి రగులుకునేది. ఇప్పుడు మంటల్లో కాల్చుతున్నట్టుగా వుంది.

" మామ నువ్వు లేందే బతకలేను. నన్నాయం చెయ్యకు..నా మీద ఒట్టేసి చెప్పు.."

" ఎందుకే మనం శాశ్వతంగా ఏరై పోతున్నట్టు యిదై పోతున్నావు. నేను పట్నం వచ్చి కలుత్త్తానంటున్నాగా.." రత్తి కన్నీళ్ళు తుడుస్తూ ప్రేమగా చెప్పాడు.

'అవసరం అన్నింటిని నేర్పిస్తుంది..నటన నేర్చాడు చెంచు రామయ్య ' -

" రేపు తెల్లారి బస్సుకెళ్ళిపో..పట్నంలో అన్ని ఏర్పాట్లు చూసుకుని రా.. అడ్రస్సు యిద్దువుగానీ.." అన్నాడు శాంతంగా నమ్మబరుస్తూ. సరేనంది రత్తి.

" చీకటిపడింది. పెద్దాడు వచ్చే ఏళయ్యింది. మరి వస్తా.. డబ్బు జాగ్రత్త.." అంటూ వడివడిగా వచ్చేశాడు. మారు సమాధానం కోసం ఎదురుచూడకుండా -

పోతేపోయింది వెధవ డబ్బు. గుండెల మీద బరువు ఇంత తేలికగా వదిలిపోతుందనుకోలేదు. ఎలాగైతేనేం.. వదిలించుకున్నాడు ఇలాంటి బుద్దితక్కువ పని జీవితంలో మరోసారి చెయ్యకూడదని మనసులోనే ఒట్టు పెట్టుకున్నాడు.
* * * * *

ఆ..దారి..చెంచు రామయ్యకు..కొత్తే..!

కాలువగట్టు - దారి పొడవునా ముళ్ళకంచెలూ - జిల్లేడు చెట్లు - పాముల పుట్టలూ -

అది తన పొలానికి అడ్డదారేకానీ, దొడ్డదారి మాత్రం కాదు. అయినా ఆ దారినే ఎంచుకున్నాడు. పరిసరాలని పరికించడం మానివేశాడు.

పైగా ఇప్పుడు 'కల్లు ' తాగడం పూర్తిగా మానివేశాడు చెంచు రామయ్య...!!

* * * * *

( స్వాతి సపరి వార పత్రిక 15-9-1995 )

కామెంట్‌లు లేవు: