13, డిసెంబర్ 2008, శనివారం

కుచ్చు టోపీ...!!

మూడు పదుల వయస్సు ముదురుతున్న దశలో 'అప్పారావు ' కొడుకు 'సూరిబాబు 'కి జోడుగుళ్ళపాలెం నుంచి మంచి సంబంధం పట్టుకువచ్చాడు మేరేజ్ బ్రోకర్ 'చీకుల సన్యాసిరావ్ '
" నమస్కారమండీ అప్పారావ్ గారు..! మన అబ్బాయికి అదిరిపోయే సంబంధం తీసుకొచ్చా యీసారి..
గంటా వారి సంబంధం.. మోత మోగాల్సిందే..ఏవన్ క్లాస్.."
"క్లాస్ మాట తర్వాత..ముందు క్యాషు ఎంతో చెప్పు " చిరాగ్గా అడిగాడు అప్పారావు, చుట్ట చివరి ముక్కను పంటికింద పెట్టి పటుక్కున కొరుకుతూ -
"కట్నందేముంది కానీండి..పిల్లమాత్రం బంగారం అనుకోండి..ముడికో లక్ష చొప్పున మూడు లక్షలు యిస్తారు. ఆ నాలుగు అక్షింతలూ వేయించి..ఆ ఏడడుగులూ నడిపించండి..." నవ్వుతూ చెప్పాడు సన్యాసి రావు - సంచిలోనుంచి అమ్మాయి ఫోటోని తీస్తూ...
"మూడు ముళ్ళేం ఖర్మయ్యా..? ఏకంగా ఏడుముళ్ళూ ఏపిస్తా..ఏడిప్పించు.." చుట్టని గట్టిగా దమ్ముపట్టి లాగి బిగిస్తూ చెప్పాడు అప్పరావు.
"అయ్యా..! భలే తమాషాగా మాట్లాడతారు తమరూ..!" కితకితలు పెట్టబోయాడు సన్యాసిరావ్.
"నీతో తమాషాలేంటయ్యా..? నాకున్న ఆస్తికి ఒక దామాషా ప్రకారం రావాలి కదా కట్నం..? "
"ఆ మాట నిజమనుకోండి..! కానీ వారు అంతకుమించి ఇవ్వలేరు..పిల్లంటారా ? బంగారం ! మీరేచూడండి.." అంటూ ఫోటోని అందించాడు.
"మాటమాటకి..పిల్ల బంగారం..పిల్ల బంగారం అంటున్నావ్..ఇంతకీ అసలు బంగారం మాటేమిటీ..?" ఫోటోని అందుకుంటూ అడిగాడు అప్పారవు.
"ఇరవై కాసుల దాకా పెడతారండి..అసలు అమ్మాయే..బంగారపు బొమ్మ...!" ఫోటోని చూస్తున్న అప్పారావు మొహంలోని ఫీలింగ్స్ ని పసిగడుతూ హుషారుగా చెప్పాడు సన్యాసిరావ్ .
"ఇంకా ఈ కాసుల గోలేంటయ్యా..? విషయాన్ని వీశెల్లో చెప్పక.
."అయ్యా..! మనం మాట్లాడుకుంటున్నది బంగారం గురించి గానీ.. బెల్లం గురించి కాదుగా..?
" మరి ఇవాళ ఈ బెల్లం తూకం సరిపోతేనే కదా..? రేపు ఆ జీలకర్రా..బెల్లం కలిసేది..? వెటకారంగా ప్రశ్నించాదు అప్పారావు.
' ఈ డబ్బు పిచ్చోడిని ఒప్పించటం ఎలారా దేవుడా..! ' అని మనసులోనే మొత్తుకున్నాడు సన్యాసిరావ్.

ఇంతలో ఆ భగవంతుడే పంపించినట్లుగా, నెత్తిమీదున్న నాలుగు పరకల్ని సరి చేసుకుంటూ లోనికి వస్తున్నాడు
సూరిబాబు . కొడుకు రావడాన్ని చూసి, టేబుల్ మీదున్న ఫోటోని సంచి లోపల పెట్టుకోమన్నట్లు కళ్ళతో సైగ చేసాడు అప్పారావు సన్యాసిరావ్ కి. అప్పారావు టెన్షన్ పడటాన్ని గమనించాడు సన్యాసిరావ్. కానీ, అప్పారావు చెప్పిన అటెంక్షన్ విషయాన్ని గమనించనట్లు, టేబుల్ మీదున్న ఫొటోని చేత్తో పట్టుకుని...
"ఇదిగో..మనం మురిసిపోవటం ఎందుకు ? మాటల్లోనే వచ్చాడు కధానాయకుడు..అతనికే చూపిద్దాం నాయకిని..అతగాడి మురిపెం కూడా చూద్దాం.." అంటూ పెళ్ళి కూతురి ఫోటోని సూరిబాబు చేతిలో పెట్టాడు సన్యాసిరావ్.
ఒళ్ళు మండిపోయింది అప్పారావుకి. 'దొంగ గాడిద కొడుకు ' మనసులోనే కసిగా తిట్టుకున్నాడు సన్యాసిరావ్ ని -
ఆ ఫోటోని చూడటంతోనే..స్విచ్ వేయగానే వెలిగే బల్బులా వెలిగిపోసాగింది సూరిబాబు ఫేసు. ఫిలమెంట్ కొట్టేసిన ట్యూబ్ లైట్ లా మాడిపోయింది అప్పారావు ఫేసు . కొడుకు మొహం లోని వెలుగుని చూసి..
"ఎలా వుంది బాబు అందాల భరిణ..? కుందనపు బొమ్మలా వుందా..? భాషలో కూడా బిల్డప్ పెంచేసాడు సన్యాసిరావ్. సిగ్గుపడిపోయాడు సూరిబాబు అంత వయసు లోనూ. ఆ 'ముదురు సిగ్గు ' ముచ్చటగా వుంది సన్యాసిరావ్ కి.
అతని అతి విన్యాసమే పిచ్చకోపం తెప్పిస్తుంది అప్పారావుకి -
"అబ్బ..సిగ్గుపడే సమయం దగ్గరలోనే వుందయ్యా..పెళ్ళి కొడకా..! కాస్తంత అట్టేపెట్టుకో ఆ పెళ్ళి వరకూ.." పంపుతో గాలి కొడుతున్నట్టు కొడుతున్నాడు సన్యాసిరావ్ హుషారుని.

వూరిపోతున్నాడు సూరిబాబు ఆ హుషారు గాలికి. సూరిబాబు ఆనందంలోనే తానూ మునిగితేలుతున్నట్టు గొప్పగా నటించేస్తున్నాడు సన్యాసిరావ్. అస్సలు అప్పారావు వంక చూసే ప్రయత్నమే చెయ్యటం లేదు - పొరపాటున గానీ, సన్యాసిరావ్ అప్పారావు వంక చూసివుంటే తెలిసొచ్చేది - నోట్లొవున్న చుట్టని కసిగా ఎలా నుసి నుసి చేసాడో, అలానే , ఒక్క కంటి చూపుతోనే , సన్యాసిరావ్ ని మసి మసి చేసేటందుకు రగిలిపోతూ అప్పారావు కాచుక్కూర్చున్నాడని -
అప్పారావులో ఆగ్రహం తారాస్థాయికి చేరుతుండగానే, 'బుడుంగు ' మని బయటకు వచ్చింది అప్పారావు భార్య
' మంగ తాయారు ' అంతే - చిల్లుపడ్డ సైకిల్ ట్యూబ్ లా కుచించుకుపోయాడు అప్పారావు.

" ఏం సన్యాసిరావ్..? మళ్ళా ఆ దిక్కుమాలిన సంబంధాలే తీసుకొచ్చావా..? దర్పంగా అడిగింది మంగ తాయారు. "అమ్మమ్మా..ఎంతమాట..? ఈసారి సాక్షాత్తూ, ఆ ధనలక్ష్మే మీ యింటి కోడలయ్యేందుకు సిద్ధంగా వుంది కావాలంటే మీరే చూడండి..." అంటూ, సూరిబాబు మురిపెంగా సవరదీస్తున్న ' గంటా ధనలక్ష్మి ' ఫోటోని సున్నితంగా అతని చేతుల్లోంచి అందుకుని, అపురూపంగా అందించాడు సన్యాసిరావ్ మంగ తాయారు చేతికి.
"పిల్ల బాగానే వుంది.." అంది మంగ తాయారు చూసిన వెంటనే.
"శుభం..." అన్నాడు సన్యాసిరావ్ తుమ్ము వచ్చినంత తొందరగా-
" వెళ్ళీ చూసొద్దాం.. " అన్నాడు సూరిబాబు ఆనందంగా.
"శుభస్య శీఘ్రం.." అన్నాడు సన్యాసిరావ్ మరింత కోలాహలంగా -
కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నాడు అప్పారావు ఒక్కడై. కొంపలు అంటుకుపోతున్నట్టు అరిచి చెప్పాడు వెంటనే -
" చూసి రావడానికి అదేమన్నా పెంటపాడు సంతా..? పెళ్ళిసంబంధం..! మంచీ- చెడూ విచారించ్చోద్దూ..? " పాల పొంగు లాంటి సూరిబాబు ఉత్సాహంపై నీళ్ళు చిలకరించేసాడు అప్పారావు.
"మీరు త్వరగా విచారించండి..లేకుంటే నేను తీరిగ్గా విచారించాల్సి వస్తుంది.." మెల్లగా గొణుకుతున్నట్టు పలికాడు సూరిబాబు.
ఆవేశంలో ఆ గొణుకుడు వాల్యూం పెరిగి, స్టీరియో ఫోనిక్ సౌండ్ సిస్టం లోలాగా వినిపించింది అక్కడున్న అందరికీ - అదిరిపడ్డాడు అప్పారావు అందం తాలూకూ ఎఫెక్ట్ ని చూసి. పిచ్చకోపంతో సన్యాసిరావ్ వంక చూసాడు. ఎదురుగ్గా పిచ్చికుక్క వచ్చి నిలుచున్నప్పుడు కలిగే భయం లాంటిదే కలిగింది సన్యాసిరావ్ కి ఆక్షణంలో, నిగ్రహం తప్పిన 'తిప్పల అప్పారావు ' ఉగ్రరూపాన్ని చూస్తుంటే..!
* * * * *'
జోడుగుళ్ళ పాలెం ' వెళ్ళి ధనలక్ష్మిని చూసి," వెళ్ళి కబురు పంపిస్తాం " అని చెప్పి తిరిగొచ్చి పది, పదిహేను రోజులవుతున్నా, ఆడపిల్ల వారికి కబురు పంపలేదు అప్పారావు. గానుగెద్దులాగా తిరగసాగాడు సన్యాసిరావ్ అప్పారావు ఇంటి చుట్టూ. మరో లక్ష కట్నం పెంచమని డిమాండ్ చేసాడు అప్పారావు. చచ్చీ-చెడీ ఒప్పించాడు సన్యాసిరావ్, పిల్ల తండ్రి 'పరంధామయ్యని '
"ఇది ఆషాడం కదా..! శ్రావణం రానీయ్..! మిగతా విషయాలు మాట్లాడుకుందాం .." అంటూ మరో నెల రోజులకి సన్యాసిరావ్ రాకపోకలకి బ్రేక్ వేసేసాడు అప్పారావు.
* * * * *
' ఆషాడం పోనీయ్ - శ్రావణం రానీయ్ ' అంటూ పరంధామయ్య సంబంధానికి గడువు గడియ వేసి, మరో కొత్త సంబంధానికి, తలుపులు తెరిచాడు అప్పారావు, మరో మేరేజ్ బ్రోకర్ 'మెలిక పోతురాజు 'తో కలిసి. పోతురాజు చెప్పిన కొత్త సంబంధం తాలూకు వివరాలకు అప్పారావు హృదయంలో ఆనందం రెట్టింపైనా, మనసులో ఆందోళన మాత్రం నాలుగింతలైంది -
* * * * *
సూరిబాబు తన గదిలోనుంచి బయటకు రాబోతుండగా తండ్రి హాల్లో ఎవరితోనో చాలా కోపంగా మాట్లడటం వినిపించింది. గుమ్మం వద్దకు వచ్చి చూసేసరికి, ఫోన్లో ఎవరిమీదనో వీరావేశంతో అరుస్తూ కనిపించాడు -
" ఏడుస్తున్నావెందుకురా అంటే..ఎగ్గొట్టడానికి అన్నాట్టా..వెనకటికొకడు నీలాంటోడు..."
" ఛాల్లే..నోర్మూసుకోవయ్యా..వాడి మొహం చూస్తుంటేనే తెలుస్తుంది వాడొట్టి దరిద్రుడని.."
" చెప్పు తీసుకుని కొడతానని చెప్పు వెధవని.. వాడికి వుంటే ఏమిటీ..? మా వాడికి లేకుంటే ఏమిటీ..? "

బి.పి.వచ్చినట్లు అరుస్తున్నాడు అప్పారావు. తండ్రి మాటల్లో తన గురించి ప్రస్తావన వచ్చేసరికి సూరిబాబుకి టెంక్షన్ పెరిగింది. ' ఇంతకీ నాకు లేనిదేమిటీ..? ' లేచి ఎగురుతున్న నాలుగు పరకల్ని, నెత్తికి అడ్డంగా రుద్దుకుంటూ,యమ సీరియస్ గా ఆలోచించసాగాడు సూరిబాబు. అంతలోనే తెలిసిపోయింది, తనకు లేనిదేమిటో..అదీ తండ్రి మాటల్లోనే -

" అవునయ్యా..! మా వాడిది బట్టతలే. ఆ ముగ్గుబుట్ట వాడి కూతుర్ని చూసేందుకు మావాడేం సిగ్గుపడి, విగ్గుపెట్టుకుని రాలేదే...? " రెచ్చిపోతున్నాడు అప్పారావు ఉద్రేకంతో ఊగిపోతూ -
సిగ్గుతో చచ్చిపోయాడు సూరిబాబు. విషయం పూర్తిగా అర్ధమైపోయింది. ముగ్గుబుట్ట వాడు అంటే, పరంధామయ్యే..! ధనలక్ష్మి రూపం మెల్లగా కరిగిపోసాగింది.
"తియ్యవయ్యా..తొక్కలో సంబంధం.. నెల తిరక్కుండా మా వాడికి పెళ్ళి చేయకపోతే, నా పేరు తిప్పల అప్పారావే కాదు..ఇదే నా సవాల్.. చెప్పు ఆ దరిద్రుడికి..." ఆవేశంతో వూగిపోతూ ఫోన్ పెట్టేసి,
విసురుగా బయటికి నడిచాడు అప్పారావు. అడుగు వెనక్కి వేసాడు సూరిబాబు ఎంతో భారంగా -
' హమ్మయ్యా.. కొడుకు విన్నాడు చాలు.. బట్టతలే గట్టెక్కించింది. ఇక పరంధామయ్య సంబంధాన్ని తెంపేసుకున్నట్లే..! ' మురిసిపోతున్నాడు అప్పారావు భవిష్యత్తుని తలుచుకుని, తనలోని నటుడిని తెలుసుకుని -
* * * * *
"ఏయ్..బావా..! " అంటూ పిలిచాడు మెలిక పోతురాజు అటుగా వెళ్తున్న సన్యాసిరావ్ ని చూసి.
" ఏంట్రోయ్..పోతురాజూ..కనపడటమే మానేసావ్..?" నవ్వుతూ వచ్చాడు సన్యాసిరావ్.
" ఓరేయ్ సీనూ..రెండు సింగిల్ టీలు పట్రారా.." ఆర్డరిచ్చాడు పోతురాజు ఆనందంగా.
"ఏంట్రోయ్..బండి మంచి గెలాపూ మీదుంది..గట్టి బేరం ఏమన్నా తగిలిందా..? " హుషారుగా అడిగాడు సన్యాసిరావ్.
పోతురాజు చెప్పిన బేరం సంగతి విని షాకైపోయాడు సన్యాసిరావ్. నమ్మలేకపోయాడు చెప్పిన పోతురాజు నోటినే కాక, విన్న తన చెవుల్ని కూడా -
" నువ్వు చేప్పేది నిజమా ? ఏది చిట్టినగర్ అప్పారావు కొడుక్కేనా..? " మరింత అనుమానంగా అడిగాడు సన్యాసిరావ్. " అవును బావా..! కుదించి కట్టిన తవుడు బస్తాలాగా వుంటాడు చూడు. నల్లగా..ఆ అప్పారావ్ కొడుక్కే నేకుదిర్చింది.." "ఇంతకు ముందు ఇటుసైడు సంబంధం ఏదో కురిరిందని..రేపు శ్రావణంలోనే మాట్లాడుకుంటున్నారని విన్నాను.." ఆరా తీసాడు సన్యాసిరావ్ తన ఉనికిని బయటపడనీయకుండా -
"ఎవడో ..సన్నాసి తెచ్చాడంట బావా .. ఆ దిక్కుమాలిన సంబంధం.. అది తెచ్చినోడే ముష్టోడనుకుంటే, ఆ సంబంధం మరీ వీర ముష్టంటా..! మనం పట్టుకెళ్ళిన సంబంధం తగలగానే, ఆ సంబంధాన్ని పీకి పారేసాడు..." పగలబడి నవ్వుతూ చెబుతున్నాడు పోతురాజు.
ఒళ్ళు మండిపోయింది సన్యాసిరావ్ కి ఆ నవ్వుని చూసి.. తను తెలుసుకోవలసిన వివరాలు మరికొన్ని వున్నాయి. అందుకే ..! పాపం సన్యాసిరావ్ సహనం వహించాడు... హృదయం దహిస్తున్నా...!!

" అయినా బావా..! ఏడెక్కడా..? మూడెక్కడా..? మనం ఏడిప్పిత్తున్నాం.." తనే యిస్తున్నట్లు చెప్పాడు పోతురాజు. "ఏంటీ ఏడిపిస్తున్నావా ? అలానే కానీయ్..ఇంతకీ ఎక్కడి సంబంధం ? " కడుపుమంట తీర్చుకుంటూ కూపి లాగసాగాడు సన్యాసిరావ్.

" కత్తి మార్కండేయుల్ గారని.. వారి స్వస్థలం 'గుత్తి '- ఆస్తులన్నీ అక్కడే వున్నాయి. ఇప్పుడు వ్యాపారం పనిమీద తిరుపతిలో సెటిలయ్యారు. ఒక్కటే కూతురు ..బొచ్చెడంత ఆస్థి..." హుషారుగా చెబుతున్నాడు పోతురాజు టీ చప్పరిస్తూ..

"ఇంతకీ ఏం వ్యాపారం వాళ్ళది..?"" వెంట్రుకల వ్యాపారం...బాగనే కూడబెట్టారు.."

" ఏంటీ ..? వెంట్రుకలా..? కసిగా అడిగాడు సన్యాసిరావ్.

"భలేవాడివి బావా..! కూడ బెడుతున్నవి ఆస్థులు. కూడు బెడుతున్నవి వెంట్రుకలు. ఆళ్ళకి ఈ వ్యాపారంతో పాటు 'టోపీల ' వ్యాపారం కూడా వుంది.."

"అయితే ఇంకేం .. అప్పారావ్ కి పెడతాడులే గుత్తి వియ్యంకుడు 'కుచ్చుటోపి..." కసిగా చెప్పాడు సన్యాసిరావ్.

"మనకు పెట్టకుండా వుంటే అంతే చాలు బావా.." ఘొల్లున నవ్వుతూ చెప్పాడు పోతురాజు.

" అది నీకెట్టాగు..ఆ అప్పారావు గాడు పెడతాడులే.." అనుకున్నాడు సన్యాసిరావ్, అప్పారావ్ తనకి పెట్టిన టోపిని తలుచుకుంటూ -
* * * * *
అర్ధరాత్రి యస్.టి.డి రింగ్ వినిపించేసరికి, ఉలిక్కిపడి లేచాడు అప్పారావు. " హల్లో..ఎవరూ.." అన్నాడు కంగారుగా ఫోనందుకుని.
"అప్పారావ్ గారేనాండి మాట్లాడేది..? " వినిపించింది అవతలి వైపు నుంచి.
" అవునవును..మీరెవరూ.." ఉత్సాహంగా అడిగాదు అప్పారావ్. బహుశా తిరుపతి నుంచేనేమోననుకుంటూ.
" నేనెవరో ఇవరంగా చెబుతాగానీ, నీ కొడుకు పెళ్ళి ఎప్పుడురా అప్పారావ్..? " జీరగా వినిపించింది కంఠం.

ఏకవచనంలో తనపేరు వినిపించేసరికి తోక తొక్కిన త్రాచులా బుసలుకొట్టాడు అప్పారావు.
" ఎవడివిరా నువ్వు తాగుబోతు వెధవా..? " పిచ్చికోపంతో వూగిపోయాడు అప్పారావు.
" నీయమ్మా మొగుడినిరా అప్పారావ్..! వీరభద్రాన్ని..! జోడుగుళ్ళ పాలెం నుంచి..! మా బాబాయ్ సంబంధాన్ని లూప్ లైన్లో పెట్టి, మరో సంబంధం చేసుకుంటావా..? ఆడపిల్ల వాళ్ళంటే అంత అలుసురా నీకు..? చెయ్యరా కొడకా..చెయ్య్..! నీ కొడుకు పెళ్ళి ఎలా చేస్తావో నేనూ చూస్తాగా..! దుర్గమ్మోరి గుళ్ళో పెళ్ళంట కదరా..? మంచి చోటే ఎట్టుకున్నావ్ మువుర్తం..! నిన్ను అమ్మోరికి బలిచ్చి.. ఆ కృష్ణమ్మలో స్నానం చేసి చక్కా పోకబోతే..నా కొడకా..! నా పేరు వీరభధ్రమే కాదు..." గోదాట్లో వరదలా బండబూతులు సాగిపోతున్నాయి వీరభధ్రం నోట్లోంచి -
గొంతు పిడచ కట్టుకుపోయింది అప్పారావుకి. గొంతు చించుకుని అరుస్తున్నాడు..
" హల్లో..వినిపించి చావడం లేదు..హల్లో..హల్లో..." వినిపించనట్లు అరుస్తున్నాడు అప్పారావు వినిపించే బండబూతులు వినలేక. ఆ అరుపుకి అదిరిపడి లేచింది మంగ తాయారు మంచం మీదనుంచి. పరిగెత్తుకుంటూ వచ్చాడు సూరిబాబు తండ్రి గదిలోకి.
" ఏమైంది నాన్నా..? " కంగారుగా అడిగాడు. చెమటలు పట్టి వణికిపోతున్న తండ్రిని చూసి-ఏమని చెప్పగలడు అప్పారావు..? అందుకనే...
" ఏం లేదు..ఏం లేదు..ఏదో రాంగ్ నెంబర్..వెళ్ళిపడుకోండి.." అంటూ హడావుడిగా పంపించివేసాడు కొడుకుని.
కాబోయే ముప్పుని తలుచుకుంటూ కూర్చుండిపోయాడు అప్పారావు. నిద్రపోవడానికి ప్రయత్నించకుండా -
* * * * *
విజయవాలో గానీ కొడుకు పెళ్ళి చేస్తే, కృష్ణా బేరేజ్ మీదనుంచి నీళ్ళులేని చోట రాళ్ళ బండల మీదకి విసిరేస్తారేమోననే భయంతో, ముందుగా పెట్టిన కండీషన్ని సడలించి, తిరుపతిలో పెళ్ళికే మొగ్గుచూపాడు అప్పారావు. ముందుగా తనయింట్లో, ఎటువంటీ ఖర్చులేకుండా, విజయవాడ చుట్టుప్రక్కల నున్న తన బంధువులందరికీ, వియ్యంకుడు పెట్టే 'పెళ్ళి ' భోజనంతోనే సరి పెట్టోచ్చన్న 'కక్కుర్తి 'తో 'దుర్గమ్మ గుళ్ళో పెళ్ళి మొక్కు ' అంటూ మార్కండేయుల్ని సెంటిమెంట్ తో పడేసాడు.
మరి అలాంటి సెంటిమెంట్నే కాదని, మొక్కుబడినీ పక్కన పెట్టి, తాను యిబ్బంది పడుతూ, సంప్రదాయాన్ని పాటిస్తున్నాడంటే, అప్పారవు బావగారి విశాల ధృక్పధానికి ఎంతగానో మురిసిపోయాడు మార్కండేయులు -

అలా మురుస్తున్న వేళ, అప్పారావు బావగారి నుంచి ఫోన్ వచ్చిందని తెలియగానే, అనందంగా అందుకున్నాడు ఫోన్ని మార్కండేయులు.

" చెప్పండి బావగారు..ఏమిటీ..యిలా. మేము గుర్తొచ్చాం.." ఎంతో సంబరంగా మొదలెట్టాడు మార్కండేయులు సంభాషణని. అవతల నుంచి అప్పారావు చెప్పిన విషయం విని షాకైపోయాడు . ముచ్చెమటలు పట్టాయి.

" ఇదెక్కడి న్యాయమండీ బావ గారు " బేలగా అడిగాడు మార్కండేయులు.

" నా కొడుక్కి కట్నం..నా కూతురికి ఆడపడుచు కట్నం.. యిస్తుండగా లేంది..నాకు ఇవ్వడానికి ఎందుకు బాధపడతారు..? " రీజన్ చెప్పాడు అప్పారావు ఎంతో లాలనగా-

" అసలు ఏ రీతి అని మీకివ్వలంటారు..?" మొత్తుకున్నాడు మార్కండేయులు.

" వాళ్ళను పుట్టించినోడిని కాబట్టి.. పాపం..అసలు నవమాసాలు మోసిన కన్నతల్లికి ఏం ఇస్తున్నారని అడగటం లేదు సంతోషించండి..." రాయితీ కూడా యిచ్చాడు అప్పారావు ఎంతో కనికరంగా -

" అసలు ఇలాటి ఆచారం.. ఎక్కడైనా వుందాండీ...? " బావురుమన్నాడు.

" ఎక్కడా లేదా.. ? అయితే మరీ మంచిది..! ఈ సంప్రదాయం నాతోనే మొదలవుతుంది. రేపు భవిష్యత్తులో తెలివైనోళ్ళందరూ నాపేరే చెప్పుకుంటారు..." గర్వంగా చెప్పాడు అప్పారావు.

గొంతు పెగల్లేదు పాపం మార్కండేయులుకి.

" ఇప్పుడే తేల్చిచెప్పండి..నేనడిగిన ఆ 'లక్షా ' యిస్తానంటేనే..ఈ పెళ్ళి..లేదంటే కాన్సిల్ అనుకోండి..మరోమాట ...ఈ విషయం మనిద్దరి మధ్యనే వుండాలి..మూడోకంటికి తెలియకూడదు.." హెచ్చరించాడు గట్టిగా -

చివరిక్షణంలో కూతురి పెళ్ళి తప్పిపోయిందంటే, నలుగురూ నాలుగురకాలుగా అనుకుంటారని - 'మామగారి కట్నం 'గా అప్పారావు అడిగిన ఆ ముష్టి లక్షా యిచ్చేందుకు ఒప్పుకున్నాడు మార్కండేయులు ఎంతో కుమిలిపోతూ -

* * * * *

అందరినీ కళ్యాణ మండపానికి పంపి, పచార్లు చేస్తున్నాడు అప్పారావు విడిదింట్లో, తన కట్నం కోసం. అంతలో కాలింగ్ బెల్ మ్రోగేసరికి ఆనందంగా వెళ్ళి తలుపులు తెరిచాడు. ఎదురుగా ఓ ముప్పైఏళ్ళ కుర్రాడు, చేతిలో స్వీట్ పాకెట్ తో నిలుచుని వున్నాడు.

" నమస్కరమండీ..నా పేరు గోవిందం. మార్కండేయులు గారి మేనల్లుడిని. మామయ్య గారు ఈ స్వీట్ ప్యాకెట్ మీ చేతికిచ్చి ..మిమ్మల్ని వెంటపెట్టుకుని మండపం వద్దకు తీసుకురమ్మన్నారు.." ఎంతో వినయంగా వివరించి, తన చేతిలోని ప్యాకెట్ని అప్పారావు చేతికి అందించాడు గోవిందం భయపడుతూ -

బరువుగా, అందంగా ప్యాక్ చేయబడిన ఆ " స్వీట్ ప్యాకెట్ " ని అందుకోంటూనే,

" పుచ్చుకోలేదంటే మాళ్ళా బావగారు నొచ్చుకుంటారు గానీ, నాకెందుకయ్యా.. ఈ స్వీట్ ప్యాకెట్టు..? అసలే నాకు మధుమేహం కూడానూ..! " చెబుతూనే ఆరా తీసాడు అప్పారావు, గోవిందానికి అసలు విషయం ఎంత వరకు తెలుసునని ..!

" వియ్యంకుడికి స్వీటిచ్చి ..మండపం వద్దకు తీసుకురావలంట కదండీ..? " అమాయకంగా బదులిచ్చాడు గోవిందం.

" ఏమైనా..మీ మర్యాదలే వేరు..వస్తానుండు.." అంటూ గబగబా లోనికి వెళ్ళి డబ్బుని లెక్క చూసుకుని, అతి జాగ్రత్తగా, తన సూటుకేసులోనే భద్రపరచుకొని, సంతోషంగా వచ్చి కారులో కూర్చుంటూ ..

" ఏం చేస్తుంటావయ్య గోవిందం ..? " అడిగాడు అప్పారావు .

" మావయ్య గారి వద్దే పని చేస్తున్నానండి..మావయ్య గారి కుచ్చు టొపీల వ్యాపారానికి బొచ్చు కొనుగోలు చేస్తుంటాను.."భయపడుతూ వివరించాడు గోవిందం.

" మొత్తానికి భలే పని.." విరగబడి నవ్వసాగాడు అప్పారావు.

అతని వంకే ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు గోవిందం నోటమాటరాక. ' అంత పగలబడి నవ్వాల్సిన పనా తను చేస్తున్నది..? ' అని ఆలోచిస్తూ -
* * * * *

కొడుకుని శోభన కార్యానికి పంపి, తను స్వకార్యం నిమిత్తమై ఎవరికీ అనుమానం రాకుండా పాత సంచీతో బాంకుకు బయలుదేరాడు అప్పారావు. క్యాషియర్ చెప్పిన విషయానికి అశ్చర్యపోయి, అప్పారావుని తన గది లోనికే పిలుపించుకుని, అప్పారావు నోటికి పెప్సీని అందించాడు బాంక్ మేనేజర్.

'ఈ నెల్లోనే.. కట్నం తాలూకు ఐదు లక్షలు యఫ్.డి చేసిన మహత్యం ' నవ్వుకున్నాడు అప్పారావు, పెప్సిని చప్పరిస్తూ -

ఏ.సి.రూము చల్లదనానికో..పెప్సీ యిచ్చిన మత్తుకో, మేనేజర్ గదిలోనే, ఒళ్ళు మరిచి గురక పెట్టాసాగాడు అప్పారావు . 'ఠపీ ' మని నడినెత్తిన ఏదో పడేసరికి కళ్ళు తెరిచి చూసాడు. ఎదురుగ్గా తననే చూస్తూ నిల్చుని ఉన్నారు పోలీసులు.

' ఇది కలా.. ? నిజమా.. ? ' అన్న ఆలోచన అప్పారావు మదిలో సాగుతుండగానే, మరోదెబ్బ నడినెత్తిన అదీ లాఠీతో, మరలా 'ఠపీ ' మనీ - ఈ దెబ్బతో మత్తు వదిలిపోయింది, తిప్పల అప్పారావుకి -



" ఇవన్నీ దొంగనోట్లే సార్..! ఎంతమందిని ముంచాడో తెలియదు గానీ, ఇంతకు ముందు ఇదే నెలలో ఒ ఐదు లక్షలు ఎఫ్.డి కూడా చేసాడు..ఇవాళ సరాసరి మాకే టోకరా వేద్దామని వచ్చాడు.. " ఆవేశంతో వూగిపోతూ చెబుతున్నాడు బాంక్ మేనేజర్. వింటున్న అప్పారావుకి విషయం అర్ధంకాక, బొప్పి కట్టినచోట నెప్పిగా వుంటే,మెల్లగా రుద్దుకోసాగాడు.

" చూడండి దొంగవెధవని.. ఎంత అమాయకంగా మొహ పెట్టి చూస్తున్నాడో..సెల్లో వేసి ఒళ్ళంతా కుళ్ళబొడిస్తే, భళ్ళున కక్కుతాడు రహాస్యాల్ని..ముసలినక్కా మొహం వీడూనూ.." తనే లాఠీచార్జీ చెయ్యాలన్నంత వీరావేశంతో వూగిపోతున్నాడు బాంక్ మేనేజర్.

భయంకరమైన షాక్ తో బేలన్స్ తప్పి ' ధడేల్ ' మంటూ నేలమీద పడిపోయాడు అప్పారావు -

* * * * *
తండ్రి చేతికి ఆ లక్షా ఎక్కడి నుంచి వచ్చాయో ఎంత కొట్టుకున్నా అర్ధంకాలేదు సూరిబాబుకి. పోనీ మామగారిని అనుమానిద్దామా అంటే, పెళ్ళికి నెల రోజుల ముందే ఏడు లక్షలూ యిచ్చేసారు. ఆ మొత్తం బాంక్ లో వేసిన తరువాతనే వాడకం మొదలెట్టింది. ఆ మొత్తం లోనుంచే ఓ..ఇదు లక్షలు యఫ్.డి కూడా వేసింది. కాబట్టి మామగార్ని అనుమానించాల్సిన పరిస్థితి లేనేలేదు. విడమరచి చెప్పేటందుకు తండ్రి పరిస్థితీ బాగోలేదు..అయనికి 'మతిస్థిమితం ' తప్పింది. మరి ఎక్కడి నుంచి వచ్చిందీ లక్షా..?

అంతలోనే గుర్తుకువచ్చింది సూరిబాబుకి - ' ఓ..అర్ధరాత్రి..తండ్రికి ఫోన్ రావడం..చెమటలు పట్టటం.. వణుకూ..టెంక్షన్..అంటే తన తండ్రీ..?? ఇంతటి మోసానికి సాహసించాడా..???

" నీకేం తక్కువైందనిరా దిక్కుమాలినోడా...ఈ చిక్కుల్లో నన్ను పడేసావ్..? ఈ రోజు అత్తరింట్లో సుఖంగా వుండాల్సిన వాడిని. నన్నిలా రోడ్డున పడేసావ్..! " కసిగా మనసులో తండ్రిని తిట్టడం మొదలెట్టాడు సూరిబాబు.

లక్షకు లక్షా ఖర్చుపెట్టి కేసుని మాఫీ చేయించేటందుకు , పాపం కొత్త పెళ్ళికొడుకు సూరిబాబు, అత్తరింటి

( పోలీస్ స్టేషన్ ) చుట్టూ తిరగనారంభించాడు.పాపం...!

మతి తప్పిన అప్పారావు, శూన్యంలోకి చూస్తూ, రెండు చేతులతో గాల్లో ఏవో లెక్కలు కట్టి, డబ్బుల్ని మూటలు కడుతున్నాడు..ఒట్టి చేతులతో...పిచ్చి చేష్టలతో...

ఆ స్థితిలో చూసిన మార్కండేయులు హృదయమూ చలించిపోయింది -
తనతో గొడవపడి, తన వద్ద పని మానివేసి, తనకు పోటీగా అదీ సొంతంగా ' కుచ్చు టోపీల ' వ్యాపారాన్ని ప్రారంభించిన ఆ గోవిందంగాడి ఉన్నతికి, ఈ వియ్యంకుడి వక్రగతికీ ఏమైనా 'లింక్ ' వుండి ఉండవచ్చా..? అన్న ఆలోచనలో మునిగి పోయాడు మార్కండేయులు కళ్ళుమూసుకుని...ఎదురుగా తననే చూస్తున్న వియ్యంకుడి వెర్రి చూపుల్నిచూడలేక -

* * * శుభం * * *
( ఇది ఇంకా ప్రచురణకు నోచుకోలేదు..)

కామెంట్‌లు లేవు: