17, మార్చి 2010, బుధవారం

గీతార్ధసారం !!

మానవుడు ఎంత దుర్భలుడు ? సర్వావయవములు సమన్వయంగా పనిచేస్తుంటే, తాను సర్వేశ్వరుడననే గర్వం ! ఇక వాటిలో ఏ ఒక్క అవయవమైనా, తన విధిని విడనాడితే తాను సర్వం కోల్పోయాననే దైన్యం !!

అర్ధమవసాగింది శ్రీపతిరావుకి జీవితం యొక్క పరమార్ధం. ఆలోచిస్తున్నాడు హాస్పటల బెడ్ మీద పరుండి - శరీరంలోని అవయవల్లానే... కుటుంబంలోని వ్యక్తులు, వారితో సంబందాలు, వారి విధులూ, సంఘంలోనివ్యక్తులూ - వారి వృత్తులూ. ఎవరి సహకారం లోపించినా, గమనం గతి తప్పుతుంది.

తాము కష్టపడి పనిచేసి పరిశ్రమకు లాభాలను ఆర్జించి పెట్టామని కార్మికులు, బోనస్ పెంచమైని కోరితే, తన పెట్టుబడితోనూ, పలుకుబడితోనూ, లాభాలను పొందాననే అహంతో వారి కోరికను మన్నించలేదు శ్రీపతిరావు. అది చిలికి చిలికి గాలివాన అయినట్లుగా, కార్మికుల కోరిక స్ట్రెంగ్త్ పెరిగి స్ట్రైక్ గా మారింది. ఇప్పుడు లాకౌట్ ప్రకటించాల్సిన పరిస్థితులలో వుంది. అయినప్పటికీ శ్రీపతిరావు అహం ఆనందించిందే గానీ, మనసు ఆలోచించలేదు. ఆరోగ్యం మాత్రం చెడింది.

హార్ట్ ఎటాక్ వచ్చి హాస్పటల్లో జాయిన్ అయినా అమెరికా, కెనడా దేశాలనుంచి వచ్చి చూసేందుకు తన ఇద్దరి కొడుకులకు తీరికలేదు. అతి కష్టం మీద ఎలాగొలా తీరిక చేసుకోవాంటే నష్టం తప్ప లాభం లేదు. సూపర్ స్పెషాలిటీ హాస్పటల్లో వి.వి.ఐ.పి. ట్రీట్మెంట్ పొందుతున్న శ్రీపతిరావు, ధనంతో అనారోగ్యాన్ని నివారించగలిగాడే కానీ, అనుబంధాన్ని మాత్రం పొందలేకపోయాడు.

*****

ఆ రోజే శ్రీపతిరావు హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్నాడు. బాల్య స్నేహితుడు సీతా రామారావు దగ్గరే వుండి ప్రత్యేకమైన శ్రద్దతో, అన్ని విషయాలు చూస్తున్నాడు. హాస్పటల్ గుమ్మందాటి ఆవరణలోకి వచ్చిన శ్రీపతిరావు కళ్ళముందు కనిపిస్తున్న నిజాన్ని చూసి నమ్మలేకపోయాడు. తనతో వాదించి, విభేదించి... తనని హాస్పటల్ పాలుచేసిన కార్మికులు... తన శక్తితో ఎవరినైతే అణచివేయాలని తపిస్తున్నాడో ఆ కార్మికులు... తన కళ్ళెదుట ? విషాద వదనాలతో, కన్నీళ్ళ ప్రవాహంతో, మండుటెండను సైతం సహిస్తూ, పసిబిడ్డలతో సహా, తనని చూసేందుకు వేచివున్నారు.

"బాబుగారూ..." ఘొల్లుమన్నారందరూ ఒక్కసారిగా శ్రీపతిరావుని చూసి.

ఎంతో దర్పంగా, ఆడంబరంగా వుండే శ్రీపతిరావునే చూశారు ఇంతకాలం. ఇలా దైన్యంతో చూసే సరికి వారి హృదయాల్లో తెలియనంత బాధ సుళ్ళు తిరిగిపోయింది. వారి దు:ఖాన్ని చూసిన శ్రీపతిరావు హృదయం కూడా చలించింది.

" మమ్మల్ని క్షమించండి... మా వల్లనే మీకిన్ని కష్టాలొచ్చాయి " ఘొల్లుమని విలపించాడు కార్మిక నాయకుడు రాఘవ.
" మీ ఉప్పు తిని మీ మీదే కత్తి కట్టినాం... మేము దుర్మార్గులం బాబు...దుర్మార్గులం..." భోరుమని విలపించాడు యాదయ్య. అతను శ్రీపతిరావు వద్ద ఎంతో కాలంగా పనిచేస్తున్నాడు. ఇలాంటి స్థితిలో ఎన్నడూ చూడలేదు యజమానిని.

" ఊర్కో... రాఘవా ! యాదయ్యా ! ఊర్కోండి ! మీ అందరి దయవల్ల నేను బాగానే వున్నానుగా ? కూల్ డౌన్..కూల్ డౌన్.." మమత నిండిన గుండెతో ఓదారుస్తున్నాడు శ్రీపతిరావు కన్నతండ్రిలా.

అక్కడ గుమిగూడివున్న కార్మికుల బాధ మరింత పెరిగింది యజమాని ప్రేమార్తికి.

" ఇంతమంది హృదయాల్లో కొలువై వున్న మీ సారుకి ఏం కాదు. పదండి... భగవంతుడు కూడా మిమ్మల్నుంచి ఆయన్ని వేరుచెయ్యలేడు..." కారు వద్దకు దారి తీసూ చెప్పాడు సీతారామారావు.

రెండు చేతులతో వారందరికీ నమస్కరిస్తూ మెల్లగా కారు ఎక్కాడు శ్రీపతిరావు. అశ్రునయనాలతో, చెమర్చిన హృదయాలతో వీడ్కోలు పలికారు కార్మికులంతా. కారు కదిలింది మెల్లగా.

" సీతా ! ఏమిటిరా ఇదంతా ? నమ్మలేకుండా వున్నాను..." ఆశ్చర్యం నిండింది శ్రీపతిరావు స్వరంలో.

" దిసీజ్ క్వైట్ నేచురల్ శ్రీపతి ! సుఖాలు మనుషుల్ని దూరం చేస్తాయి. కష్టాలు దరికి చేరుస్తాయి. నువ్వు మామూలు మనిషిగా వున్నంతవరకూ, వాళ్ళు తమ డిమాండుని సాధించుకునేందుకు నీతో పోరాడే యోధులయ్యారు. నువ్వు హాస్పటలైజ్ అయ్యావని తెలిసిన మరుక్షణం సర్వం కోల్పోయిన అనాధలయ్యారు ..." వివరించాడు సీతారామారావు కార్మికుల మానసికస్థితిని.
" మరి ఫ్యాక్టరీ, స్ట్రైక్, లాకౌట్...? " సందేహంతో ఆగిపోయాడు శ్రీపతిరావు.
"ఎప్పుడైతే నువ్వు హాస్పటల్లో చావు బతుకుల మద్య ఊగిసలాడుతున్నావని తెలుసుకున్నారో, అప్పుడే వారిలో మథనం ప్రారంభమైంది. వాళ్ళ వల్లనే నీకు ఇంతటి కష్టం వచ్చిందని, ఆ పాపం వారిదేనని విలపించి, తమ కోరికను త్యాగం చేసి యథాప్రకారంగా మరలా పనుల్లోకి వచ్చారు..." వివరంగా చెప్పాడు సీతారామారావు.

వింటున్న శ్రీపతిరావుకి తన మనసుని ఎవరో మెలిపెడుతున్నట్టుగా అనిపించింది. రక్త్తం పంచుకుని పుట్టిన కొడుకులు ఇలాంటి సమయంలోనే రాలేకపోతే మరి ఎప్పుడొస్తారు ? తన భార్య చనిపోయినప్పుడు కూడా పెద్దకొడుకు రాలేదు. తల్లికి తలకొరివి పెట్టే బాధ్యత చిన్నకొడుక్కి వుంది కాబట్టి వాడైనా వచ్చివుంటాడు. డాలర్స్ కి తప్పా మమ్మీ,డాడీలకు విలువలేని దేశంలో జీవనం గడుపుతున్నవారు, అంతకుమించి ఎలా స్పందిస్తారు ?

న్యాయమైన కోర్కెను సైతం త్యజించి, తమ ఆశల్నీ, ఆనందాలనీ త్యాగంచేసి , మరలా పనిలోకి వచ్చి చేరారంటే...ఎవరు వీళ్ళు ? వీరికీ, తనకు మద్యగల సంబంధమేమిటీ ? తన సంపద తన మిత్రునికి ఏనాడూ సహాయపడకున్నా, బాద్యతగల ప్రభుత్వోద్యోగంలో వుండీ, తన సేవలో నిమగ్నమయ్యాడంటే...ఈ సీతారామారావుకీ, తనకూ మద్యగల అనుబంధమేమిటీ ? స్నేహబంధం కాకుండా -' ఆలోచిస్తూనే వెనక్కివాలాడు శ్రీపతిరావు.

*****

సీతా ! నీలాగ సంతోషంగా వుండాలంటే ఏం చెయ్యాలిరా ? " ప్రశ్నించాడు శ్రీపతిరావు దీక్షగా తన ముక్కల్ని చూస్తున్న సీతారామారావుని.
" త్యాగం చెయ్యాలి...ఇదిగో ఇలాంటివాటిని... " ఆఠీన్ రాణిని విసిరేస్తూ చెప్పాడు సీతారామారావు.
"త్యాగం చెయ్యాల్సింది డబ్బుల్నా ?" మరలా ప్రశ్నించాడు శ్రీపతి శాంతంగా.
"దాంతో పాటు చాలా వాటిల్ని... అనుబంధాల్ని... ఆప్యాయతల్నీ... మొహాల్నీ... మోసాల్ని... ఆశల్నీ... ఇటువంటి ఆసుల్నీ..." ఇస్పేట్ ఆసుని డిస్ కార్డ్ చేస్తూ చిన్నగా నవ్వుతూ చెప్పాడు.
"వీటినన్నింటిని నువ్వు వదిలేశావా ?" అదే ముక్కని తీసుకుంటూ అడిగాడు శ్రీపతిరావు.
"వదిలి పెట్టాల్సిన భాధేలేకుండా అసలు పెంచుకోలేదు వేటినీ కూడా... పెంచుకుంటే పెరిగేది కౌంటే... అది పి.సి గానీ, బి.పి గానీ...నాది షో ..." అన్నాడు సీతారామారావు ముక్కని మూస్తూ.

"నీలాగా ఒక సీక్వెన్సూ..రెండు జోకర్ల ఆట కాదురా నాది... ఏ.సి.. డి.సి..." చెప్పాడు శ్రీపతిరావు సీతా రామారావు జీవితంతో తన పేకముక్కల్ని పోలుస్తూ.
" అందుకే కదరా నీకు కౌంటో... ఎమౌంటో తగుల్తావుంటాయి " చెప్పాడు సరసంగా.
" ఇది నిజమే " మనస్పూర్తిగా ఒప్పుకున్నాడు శ్రీపతిరావు గొల్లుమని నవ్వుతూ -
ఎంతో హాయిగా వుంది శ్రీపతిరావుకి ఆ సంభాషణ. ఓర్వలేని మనసు శ్రీపతిరావుకి కొడుకుల సంగతిని గుర్తుచేసింది ఆసమయంలో.
" సీతా ! వీళ్ళు నిజంగా కొడుకులే నంటావా ? " ప్రశ్నించాడు ధీర్ఘంగా ఆలోచిస్తూ. పంచిన పేకముక్కల్ని ఎత్తుకోలేదు శ్రీపతిరావు . అతని మూడ్ అర్ధమైంది సీతారామారావుకి.
" శ్రీపతి డోంట్ ఫీల్..జనరేషన్ పూర్తిగా మారిపోయింది. దానికి తగ్గట్టుగా మనమూ మారాలి..."
"వాట్స్ ద బ్లడీ జనరేషన్ ? జనరేషన్ మారిందని ఆడవాళ్ళు నవమాసాలు మోయటం మానివేశారా ? తల్లితండ్రులు పిల్లల బాగోగులు చూడటం మానివేశారా ? వాళ్ళలాగే మనం కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తించివుంటే, ఇవాళ ఇటువంటి పరిస్థితులు వుండేవా ? " ఆవేశం కట్టలు తెంచుకునే ప్రయత్నం చేస్తుంది శ్రీపతిరావు గుండెలో -
" నిదానంగా ఆలోచించు శ్రీపతి ! తాము కన్నవాళ్ళు తమని వృద్ధాప్యంలో చూస్తారో ? లేదో ? అన్న సంశయం కనుక కలిగితే, ఏ తల్లితండ్రులైనా ప్రాణమిచ్చి ప్రేమగా పెంచగలరా పిల్లల్నీ ?" ప్రశ్నించాడు సీతారామారావు ప్రశాంతంగా.
" ఈ ప్రశంకు సమాధానం చెప్పాల్సింది నువ్వు చెప్పే జనరేషన్ " విసుగ్గా చెప్పాడు శ్రీపతిరావు.
" నిజమే శ్రీపతి! నేను చెప్పేదేమిటంటే ఇవాళ ప్రతిఫలాపేక్షలేని జీవే...చిరంజీవి. మనం పంచి ఇచ్చే దేనినుంచైనా, ప్రతిఫలం ఆశించకపోవటం ఉత్తమ లక్షణం " చెప్పాడు సీతారామారావు కూలుగా.
" ఏమిటిరా ఆశించకూడనిది ? చావుబతుకుల్లో ఉన్నప్పుడు కన్నకొడుకుల్ని చూడాలనుకోవడం, వారి సమక్షంలో గడపాలనుకోవడం...ఆపేక్ష అవుతుంది గానీ, ప్రతిఫలాపేక్ష ఎలా అవుతుందిరా ? వారి పిల్లలు ఇటువంటి స్థితిలో వుంటే పరుగులు పెట్టిరారూ ? ఈ వయసూలోనూ మనం పరుగులుపెట్టి పోమూ " చెప్పాడు శ్రీపతిరావు శూన్యంలోకి చూస్తూ.

" అదేరా నేనూ చెప్పేది. తండ్రి బాధ్యతే అలా పరుగులు పెట్టిస్తుంది..." అన్నాడు సీతారామారావు.
" వృద్ధాప్యం కూడా బాల్యం లాంటిదే కదరా ? మరో మనిషి ఆసరా అవసరం కాదా ? వారికోసం తపించి వారి మంచిస్థితిని అందించి వారు సంపాదనలో ఉన్నతమైన స్థితిలో వుండేలా చేయగలిగానే కానీ, సంస్కారంలో ఉన్నతుల్ని చేయలేకపోయాను " తీవ్రమైన నైరాశ్యం శ్రీపతిరావు మాటల్లో ధవినించి కన్నుల్లో తడిలా కనిపించింది. గుండెల్లో బాధ కవ్వంలా చిలుకుతుంటే వెన్నలా వస్తుందా విలాసం ?
శ్రీపతిరావు మానసిక ఆందోళన అర్ధంకానిదేమెకాదు సీతారామారావుకి.
"శ్రీపతీ! ఋణానుబంధంతో సంతానం ప్రాణానుబంధంతో సంతోషసంతాపాలు పుడతాయి. ఏదీ మనం ఊహించైంది కాబోదు. జరిగిన దాన్ని స్వీకరించడం, జరుగబోయేదాన్ని స్వాగతించడం మన విధి..." ఉపశమనంగా చెప్పాడు.
సీతారామారావు మటులు కొంత ప్ రశాంతతను అందించాయి శ్రీపతిరావుకి.
అది గమనించి మరలా చెప్పాడు సీతారామావు " ఇప్పుడు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా వుండు " చెబుతూఒ శ్రీపతిరావు చెయ్యి నొక్కాడు అనునయంగా స్పృశిస్తూ-
"ఎక్కడుందిరా ప్రశాంతత ? డబ్బులతో కొనగలమా దాన్ని?" ప్రశ్నించాడు వెంటనే.
" ప్రశాంతతకు అడ్రస్సు మన మనసేరా ! దానికున్న మహత్తు ఏమిటో తెలుసా ? దేన్ని మనం గాఢంగా కోరుకుంటామో దాన్నే పొందమని ప్రోత్సహిస్తుంది, దాన్నే అందిస్తుంది. నువ్వు ఒక మనిషిపై ప్రేమను పెంచుకుంటే ప్రేమించమంటుంది. ద్వేషాన్ని పెంచుకుంటే వార్ని దహించమంటుంది... వైదికుడు కోరే యోగమైన వైశికుడు కోరే భోగమైనా అందించే సరస్సు ఈ మనసు. అందుకే దాన్ని మానస సరోవరం అంటారు. ఇప్పుడు నీ మానస సరోవరంలో ఎటువంటి కలతల కెరటాలు ఎగసిపడకుండా, కల్లోల అలలు చెలరేగకుండా నిన్ను ప్రశాంతంగా వుంచే శక్తి కావాలి ! ఆ శక్తి నీ బాధకు ఉపశమనాన్ని అందించి. నీకు సేద తీర్చాలి. అలాంటి శక్తి ఆ గీతకే వుంది. ఎస్...ఇప్పుడు నీకు ఆ గీతే కావాలి..." తర్కించుకుంటూ చెప్పాడు చివరి వాక్యాన్ని సీతారామారావు.
" గీతా ? గీత ఎవరూ ? " ఆశ్చయంగా అడిగాడు శ్రీపతిరావు. కుతూహలమూ వుంది అందులో-
" ఎవరో ? ఏమిటో ? తొందరెందుకూ ? వీలైతే రేపే పరిచయం చేస్తా ! ఇక నాతోడు కూడా వద్దంటావు..." నర్మగర్భంగా చెప్పాడు సీతారామారావు చివరిమాటని.
సిగ్గుతో చిరునవ్వులు చిందిస్తున్న శ్రీపతిరావుకి కరచాలనం చేసి కదిలాడు సీతారామారావు.
" ఎవరీ గీత ?? " అన్న తీవ్రమైన అలోచనలో నిమగ్నమైపోయాడు శ్రీపతిరావు.

******

కామెంట్‌లు లేవు: