11, డిసెంబర్ 2008, గురువారం

ప్రేమ సౌరభం...!!!

ఆకాశాన్ని నీలిమేఘాలు హత్తుకుంటున్నాయి దిగులుగా. గుబులు గూడుకట్టుకున్న వదనంతో కనిపించాయి మబ్బులు. నేలమీదకి వాలిపోవటానికి సిద్దమవుతున్న జడివానను చూసి కాబోలు..మేఘాల గుండెల్లో ముసురుకున్న దు:ఖాన్ని అంతటినీ శమింపచేయాలని కాబోలు, వేగంగా పరుగులిడుతున్నాయి వాయుపయనాలు. చినుకులు పడకముందే ఇంటికి చేరాలనే తాపత్రయంలో ఉన్నాడు 'సాగర్ ' విలుకాని శరాఘాతం నుంచి తప్పించుకునే హరిణిల పరిగెడుతుంది నల్లరోడ్డుపైన తెల్లరంగు స్కూటర్.

ఇంటిలోనికి అడుగుపెట్టిన సాగర్ కు టి.వి. చూస్తున్న తల్లి కనిపించింది. ఆమె నిండుమోవిపై వెలుగుతున్న ఆనందాన్ని చూసి అనుకున్నాడు , ఆమె వెళ్ళిన పని పండై ఉంటుందని -

" వెళ్ళిన పనేమైంది ?" చేతిలోని బుక్స్ ని టేబుల్ పై వుంచుతూ, నవ్వుతూ అడిగాడు తల్లిని.

" పిల్ల బంగారు బొమ్మలా వుంది. మాటల్లో ఎంతో సౌమ్యత. చక్కని పలువరస..మిలమిలా మెరుస్తున్న కళ్ళు.. నువ్విష్టపడే పెద్ద కళ్ళు.. పెద్ద బొట్టు..పొడవాటి జడ.. నిజంగా..చాలా బాగుంది.." ఎంతో మురిపెంగా వర్ణిస్తుంది రాజ్యలక్ష్మి కొడుక్కి. కాబోయే కోడలి అందచందాలకు బందీ అయినట్లుగా వుంది.

" అందచందాలేనా ? చదువు సంగతులేమన్నా ఉన్నాయా..? తల్లిచెప్పిన వివరాలకి మన్సు మురుస్తున్నా, ఆ భావనలేవీ పైకి కనిపించనీయక నవ్వుతూ అడిగాడు.

"బి.యస్సీ. చదువుకుందట.ఏవో కంప్యూటర్ కోర్సులూ చేస్తుందట.." ఉత్సాహంగా చెప్పింది రాజ్యలక్ష్మి. "డిగ్రీయేనా ?" నిరుత్సాహంగా అన్నాడు.

" చదువేమన్నా సంసారం చేస్తుందా ? అన్నింటికీ వంకలు పెడతావు.." మందలింపుగా అంది.

అతనికి కనీసం పోస్ట్ గ్రాడ్యుయేట్ నైనా చేసుకోవాలని ఆశ. తనలాగే ఏ కాలేజీలోనైనా లెక్చరర్ గా పనిచేయవచ్చు కదాని ఆలోచన. మధ్యతరగతి పెదాల మీద 'మందహాసం ' మెరవాలంటే, ఒకరి సంపాదన సరిపోదని వాదన.

" ముందు అమ్మయిని చూడు...నీకు కావలసిన అర్హతలేమిటో.. నీ అభిప్రాయం ఎమిటొ తరువాత చెప్పు.." ఎంతో నమ్మకంగా చెప్పింది రాజ్యలక్ష్మి.

"విశ్వసుందరా...?" ఎగతాళిగా అడిగాడు సాగర్. కొపమొచ్చింది రాజ్యలక్ష్మికి. "విశ్వసుందరో....సువర్ణసుందరో..ముందు చూడు నయనా..! నిన్ను ఒప్పించలే..." అంటూ విసురుగా లేచి, వంటగదివైపు నడిచింది కాఫీ తెచ్చేందుకై.ఆలోచనలలో మునిగిపోయాడు సాగర్. బయట వర్షం పడుతున్నట్లుంది. చలిగాలి వీచి గిలిగింతలు పెడుతూ వుంది.

'అమ్మ ' మనసుని ఇంత బాగా ఆకట్టుకుందంటే ఆ అమ్మాయి నిజంగా ' అందాల వాగో...ఏ మెరుపు తీగో..అయ్యుండాలి ' అనుకున్నాడు సాగర్. ఉరుములు - మెరుపులతో దోబూచులాడుతోంది ఆకాశం.

*****

ఇంటిముందుకు వచ్చి టాక్సీ ఆగగానే వడివడిగా దాని దగ్గరకు వచ్చారు నారయణరావు గారు. ముందుగా కిందకు దిగాడు సాగర్ మేనమామ శ్రీనివాసరావు. ఆ వెంట రాజ్యలక్ష్మి. శ్రీనివాసరావు గారి కోడలు శకుంతల దిగారు. అందరికీ భక్తిపూర్వకంగా నమస్కరించి రిసీవ్ చేసుకుంటున్నారు నారయణరావు గారు. ఇదంతా గమనిస్తున్నాడు సాగర్ కార్లో నుంచి.

" దిగు సాగర్ "' అహ్వానిస్తూ పిలిచాడు శ్రీనివాస రావు. అంత వరకూ లేని బిడియమేదో ఆవహిస్తోంది సాగర్ని.

ఆ బిడియానికి మదిలోనే గడియవేసి నవ్వుతూ దిగాడు సాగర్ కారుముందు సీట్లోంచి. తనని చూసిన చాలా కళ్ళలానే నారాయణరావు గారివీ మెరవటం సాగర్ గమనించాడు. ఈటెల్లాంటి చూపులను దాటుకుంటూ లోనికి నడిచాడు -వరండాలో సోఫాలలో కూర్చున్నారు అతిధులు. ఒక విధమైన భావోద్రేకం తోటి వున్నాడు సాగర్. తన తల్లి వర్ణన తాలూకూ అనుభూతి ఏదో ఈ ఉద్రేకాన్ని నిద్రలేపుతోంది. అతని మదిలో ఎన్నో అలోచనలు ఒక దానితో ఇంకొక దానికి పొత్తులేకుండా - అనిర్వచనీయమైన ఆలోచల అలజడిని అవలోకించుచుండగానే, అతిధి మర్యాదలు జరిగిపోయాయి వడివడిగా. మదిలోని ఆలోచనలకు ఆనకట్ట వేయకముందే, కళ్ళెదుట వచ్చి కూర్చుంది ' కధానాయిక ' అప్రయత్నంగా ఆతని చూపులు ఆమె మీదకు మళ్ళాయి. తలవంచుకుని కూర్చునుంది. మెల్లగా నిశ్శబ్ధం ప్రవేశించింది ఆ గదిలోనికి.

" నీ పేరేమిటమ్మా..?" పలకరింపుగా ప్రశ్నించాడు శ్రీనివాసరావు.

" మాధవీ లత" చెప్పింది మెల్లగా..'వీణ తీగపైకి వేణువు రాగం జారిపడిన శబ్ధం ' లా వినిపించింది సాగర్ చెవులకి ఆ పదం.

పేరు చెప్పి తలవాల్చబోతూ ఓరకంటితో చూసింది సాగర్ ని మాధవీలత. మొదటిసారిగా - అదీ సూటిగా - ఆమెనే చూస్తున్న ఆతని కళ్ళు ఉలిక్కిపడ్డాయి ఆమె చూపుల వలలో చిక్కుకుని.

"ఏం చదువుతున్నావమ్మా..? " తనకు తెలిసినవే అయినా, కావాలనే మరలా అడుగుతున్నాడు శ్రీనివాసరావు. వివరంగా చెప్పింది. శ్రద్దగా వింటున్నట్లు కనిపించాడు సాగర్, తల్లి రాజ్యలక్ష్మికి. ఆ శ్రద్ద అమ్మాయి పలుకు మీదనో, ఆమె చెప్పే వివరాల మీదనో అర్ధం కాలేదు ఆమెకు.

" నీకు వున్న అభిరుచులు కూడా కొంచెం చెప్పమ్మాయ్ .." చిన్నగా నవ్వుతూ పలకరింపుగా అడిగింది శకుంతల. ఓరకంట సాగర్నే చూస్తూ - అతని మనసులో సుళ్ళుతిరుగుతున్న ప్రశ్న అది. ఈ మాట శకుంతల నోటివెంట రాగనే కళ్ళతోనే అభినందన చేసాడు శకుంతలకి. రెండుక్షణాలు ఆలోచించి చెప్పింది మాధవీ లత.

"పరిళాలు వెదజల్లే సాహిత్యం..మనసుని తాకే సంగీతం..ఇవే నాకు ఇష్టమైన ఇష్టాలు..." చొరవగా చెప్పింది శకుంతలకు.

ఆమె బావ వ్యక్తీకరణకు ముగ్దుడైయ్యాడు సాగర్.

" నువ్వేమన్నా అడుగుతావా..? " మెల్లగా అడిగాడు శ్రీనివాసరావు సాగర్ని.

జారిపడ్డాడు సాగర్ అనుభూతుల ఉట్టెనుంచి. అడగాల్సినవి ఏమీ లేనట్టు తలూపాడు అడ్డంగా. అడగాలనుకున్నవి ఎన్నో మదిపొరల మడతల్లో మిగిలిపోయాయి.

" అబ్బాయిని నువ్వేమన్నా..అడగదలుచుకున్నవి వుంటే, అడుగమ్మా.." అంది రాజ్యలక్షి మురిపెంగా -మాధవీ లతను ప్రోత్సహిస్తూ... తల ఎత్తి సాగర్ వైపు చూసింది మాధవి లత. తన వైపు సూటిగా చూస్తున ఆమె చూపులను, తన చిలిపి చూపులతో నిలిపివేసాడు. తల వాల్చేసుకుంది మాధవీ లత. సిగ్గు తాలూకు నిగ్గు ఆమె బుగ్గలకు చేరి,చెంపలు కెంపు రంగులో మెరిసాయి.

" అడుగమ్మా ఏమన్నా..!" మరింత లాలనగా అంది రాజ్యలక్ష్మి.

మనసు మూగైపోగా, కృతఙ్ఞతా పూర్వకంగా ఆమెనే చూస్తూ తలూపింది మాధవీ లత. ' ఏమీ అడగలేనట్టు - మాధవీ లతను లోనికి తీసుకెళ్ళమని కళ్ళతో సైగ చేసి చూపింది శకుంతల,ఆమె తరపు ఆడవాళ్ళకు -

అందరికి మరో మారు నమస్కరిస్తూ పైకి లేచింది మాధవీ లత.సాగర్ కీ నమస్కరించింది..కళ్ళల్లో కాంతులు మెరిపిస్తూ.. పెదాలపై చిరునవ్వులు కురిపిస్తూ -ఆ మెరుపులనూ, చిరునవ్వులనూ, మురిపెంగా చూస్తున్న అతని చూపులను చీల్చుతూ, బుసలు కొడుతున్న నల్లత్రాచులా కదలాడింది..ఆమె పిరుదులపై నుంచి పైకి లేస్తూ నల్లని వాలుజడ -

ఆ జడ యిచ్చిన మధురమైన అనుభూతి, ఓ..కలల ఒడిలోకి జార్చింది సాగర్ని. వరించిన ఆనందాన్ని భరించలేక కారు సీట్లో వెనక్కి వాలిపోయాడు సాగర్. కారు ముందుకు ఉరికింది.

*****

పురోహితుడు మాధవీలత చేత పూజ చేయిస్తున్నాడు. పూజా కార్యక్రమం పూర్తి అయిన పిదప సాగర్ ని లోనికి పిలిచి, ఇద్దర్నీ పక్కపక్కన కూర్చోబెట్టారు. అందుబాటులో వున్న దంపతులు జంటలుగా లేనివాళ్ళు ఒంటరిగా వచ్చి అక్షింతలు జల్లి ఆశ్వీరదిస్తున్నారు కాబోయే దంపతులను.గంటకు పైగా సాగిన ఆ కార్యక్రమంలో సాగర్ కి అమితానందాన్నిచింది పెద్దల దీవెన కాదు - స్థిరంగా కూర్చోలేక అటూ-ఇటూ కదులుతున్నప్పుడు, తన ఎడమ భుజానికి,ఆమె కుడి భుజానికి మధ్య నలిగిన 'శరీర స్పర్శ '

వివాహం శ్రావణమాసంలో నిశ్చయమైంది. ఇంకా మూణ్ణెల్ల వ్యవధి భరించలేని వ్రణమైంది. విరహం సాగర్ హృదయంలో రణమైంది.

*****

రూపం తప్ప మరేమాత్రం పరిచయం లేని మనిషి తననింతగా విరహానికి గురిచేయటం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది సాగర్ కి. ' తనది ' అనుకున్న వాటిమీద మనిషి పెంచుకునే ' ప్రేమే ' ఈ విరహానికి కారణమనిపించింది. లేకుంటే తనకు భార్య కాబోయే మనిషిని చూసాడు. కానీ, ఇద్దరి మధ్యా ఒక్క మాటకూడా చోటుచేసుకోలేదు. కాని,తన మనసులో మాత్రం నిండుగా చోటుచేసుకుంది...ఆలోచనలన్నీ తానై-

అందరిలా తనూ ఏ ప్రేమానుభూతీ లేకుండా పెళ్ళిచేసుకోవాలా ?తను ప్రేమిస్తున్న ప్రేమను ఆమె హృదయంలో అంకురించేలా చెయ్యలేడా ? ఎందుకు చెయ్యలేడు ? ప్రేమించే మనసున్నప్పుడు...??

*****

' తేనెటీగల్లా 'మధురభావనలు ముసురుకుని తియ్యని 'తేనియను ' చేర్చుతున్నాయి 'ఎదతుట్టిలో '- మధురోహలతో తననీ విధంగా హిన్సించటం న్యయమా ? అని లేఖసాయంతో నిలదీయాలనుకున్నాడు, తన ప్రియ భామినిని

కానీ అత్తింటి వారి చిరునామా లేని కారణంగా ఆ ఆలోచన ఆచరణీయం కాలేదు. తియ్యగా బాధించే ఈ విరహాన్ని భరించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. కాలం కరుణించింది. సాగర్ బాధకు ఉపశమనం దొరికింది. అదీ ఒక నెల తరువాత మాధవీ లత తమ్ముడు రాకతో. హైదరాబాద్ లో ఏదో పని పెట్టుకుని వచ్చాడతను. మండువేసవిలో ఎడారిలా వున్న సాగర్ విరహజీవితంలో, బావమరిది రాక 'తొలకరి జల్లు - కోరికి తీర్చే హరివిల్లు '

*****

అప్పటికి రెండు,మూడుసార్లు చదివినా, మళ్ళీ ఎప్పటికప్పుడు వింతగానే తోచింది సాగర్ కి. అది తను రాసిన 'తొలి ప్రేమ లేఖ ' -తనకు తెలిసిన షెల్లీ, కీట్స్, లాంబ్ లనే కాక, తెలియని తెలుగు కవుల కావ్యాలనీ చదివాడు. కాచి వడబోసిన గొప్పవాళ్ళ భావాలకు తన అనుభూతులను జోడించి చాలా బాగా రాశానని తలపోసాడు. ఆ లెటరు చదివిన ఏవరైనా, ఎవరో మహా కవి రాసిన ' ప్రేయసి ప్రణయ లేఖా ప్రబంధం ' అని కూడా అనుకోవచ్చునని బావించాడు. తను రాసిన రీతిగా మాధవీలత రాయలేక పోవచ్చుననే సందేహం కలిగి చిన్న హెచ్చరిక కూడా చేశాడు చివరన.

'బాగా రాయాలనే తలంపుతో అశ్రద్ధ చేయకు. ఒకవేళ నీ మనసు మూగనైతే, తెల్లకాగితం మీద 'సంతకం ' చేసి పంపు. నీ సమాధానం రాకున్నట్లైతే ఇక మనం కలిసేది మన పెళ్ళి రోజునే, ఇట్లు... నీ..ప్రియ ..సాగర్. '

అని సంతకం చేసి, ఉత్తరాన్ని పోస్ట్ చేసాడు. ఇక జరుగబోయే పరిణామాల్ని తలచుకుంటూ ....

*****
'సుహానా సఫర్ ఏ మౌసం హసి...' రేడియోలో మధుమతిలోని పాట వస్తుంది. నిద్రకు ఉపక్రమించ బోయేముందు పాటలు వినడం ఎంతో ఇష్టం సాగర్ కి. మంచంపై పడుకుని వింటున్నాడు. " మరచిపోయాను..నీకేదో పోస్ట్ వచ్చింది.." అంటూ కవర్ని అందించింది రాజ్యలక్ష్మి ,ఉత్కంఠతో గబగబా గది లోనికి వచ్చి -పరిచయం లేని చేతివ్రాత ఎవరిదై వుంటుందా...? అని అనుకుంటుండగానే, ఆలోచన స్ఫురించి ఆనందం మెరిసింది మోముపై. బరువుగా వున్న కవరును చింపి లేఖను బయటకు తీసాడు. కాగితం మడతలు విప్పుతుండగా , మొహంపై పడ్డాయి గులాబీ రేఖలు దోసిళ్ళతో పోసినట్లు. విభ్రాంతుడైయ్యాడు ఈ కొత్త అనుభూతికి.

" కాబోయే శ్రీవారికి నా నమస్సుమాంజలి... !

మీచే భావుకతను ఆపాదించుకున్న మీ ప్రియలేఖ... మీ హృది తలుపులు తెరచి, నా మదిలోనికి ప్రవేశించి, నాచే ఈ తలపులను బయట పెట్టిస్తుంది. చిలిపి చూపుల ఛురికలు విసిరి నా హృదయాన్ని గుచ్చారు. కొంటె చూపుల గాలం వేసి, నా మనసును పట్టారు. ఆడపిల్లననే కనికరం లేకుండా, ఇలా శిక్షిస్తారా నన్ను..? ఆకలి దప్పులు లేకుండా చేసి...పతి ధ్యానంలో పడవేసి -

అనుదినం మీ ఉహాలు నన్నో ఊయల లోనికి నెట్టి, ఏవో లోయలలోకి విసిరేస్తున్నాయి. ఒంటరినైన నన్ను మీ తుంటరి తలపులు ఎంత బాధిస్తున్నాయో మీకు తెలుసా...? ప్రత్యుత్తరానికై ఆంక్షల శిక్ష విధించటం భావ్యమా...? అలకపానుపు ఎక్కవలసిన సమయం మునుముందు వుండగా, అబలనైన నాపై అలుక వహించటం న్యాయమా..? నా పరిస్థితి నాకే విచిత్రంగా వుంది...! చలికాలం కూడా ఎంత దిగులును ఒలికిస్తుంది నాపైకి..?

చలికాలంలో మెదడులో 'మెలాటోనిన్ ' అనే రసాయనిక పధార్ధం ఉత్పత్తి తగ్గిపోతుందట. దానివల్లననే మానసికంగా దిగులూ, ఆందోళనా పెరుగుతాయట. మెదడులో 'పినియల్ గ్లాండ్ ' ఈ మెలాటోనిను ఉత్పత్తి చేస్తుంది. శరీర ప్రక్రియ లోని సహజ సిద్ధ లయను కాపాడే పధార్ధమిది. దిగులుకు గురైన వారినీ, గురికాని వారినీ పరిక్షించి చూస్తే, దిగులుకు గురైన వారిలో, ఈ పధార్ధం స్థాయి పడిపోయివుంటుందట..! ఇది సైన్స్ నేర్పిన పాఠం.

ఈ మెలాటొనిన్ కంటే కూడా చాలా భయంకరమైన రసాయనిక పధార్ధం 'విరహం ' అని నా అభిప్రాయం. ఇది అనుభవం నేర్పిన పాఠం. అందుకనే ఏదో దిగులూ...ఎదంతా గుబులు. ఎదిరించి విరహంతో కలహమాడి ఓడిపోయాను. ఆ ఓటమి ప్రమోదమైననూ, ఆ వ్యాధి ఆనందమైననూ, నాకు ఆమోదము కాదు...!
మీ నారి తన శ్రీవారి పుట్టిన రోజును తెలుసుకోగోరుతుంది. దయచేసి తెలపరూ...! ప్లీజ్ ..!!

ఆలుచిప్పలాంటి కళ్ళతో...స్వాతి జల్లులాంటి ఉత్తరానికై, ఉత్తర దిక్కుకు తిరిగి కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటా..! మా వూళ్ళో ఆపద్భాంధవి ఆ దిక్కులోనే వుంది మరి...!
సరే....ఇక వుంటాను మరి...

వెన్నేల్లో ...మీ స్మృతులారబోసుకుంటూ...

మీ ..

ప్రియ మాధవి..

చదవటం ముగించిన సాగర్ కి హృదయం లయ తప్పింది. మనసుని మోహం కప్పింది.గుండెపై నిలిచున్న కొన్ని గులాబీ రేఖలను మెత్తగా హృదయానికి హత్తుకుంటూ, మెల్లగా కలవరించాడు మా ధ వీ ల త అన్న ఐదక్షరాలు. *****

నా ప్రియాతి ప్రియమైన మధు...!

నీ ప్రేమ సౌరభం నా హృదయాన్ని స్పృశించింది. ' ఆర్ట్ యీజ్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ ' అన్న షేక్సిఫియర్ పదం తాలూకూ గుబాళింపు మనసుని తాకింది. నీ లేఖ నన్నో ఆనంద శిఖరాగ్రం పైన నిలిపింది. మనుష్యుల మధ్య ఎడం వున్నా, మనసులు మాత్రం గాఢం గా పెనవేసుకుంటున్నాయి. నా పుట్టిన రోజునాడు, నీకో అందమైన అనుభవాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఆ రోజునే మన ఇద్దరి కలయిక...అదీ ఏకాంతంలో - మీ పాండురంగనాధుని సన్నిధానంలో - శ్రమాశల సమ్మేళనంలో మీ వూళ్ళో అడుగుపెడతాను.నేను వస్తునట్లు ఎవ్వరికీ తెలియనీకు.

ఈనెల ఇరవై నాలుగున నీ 'భర్త 'డే !మనం ఆ సాయంత్రం ఐదు గంటలకు గుడిలో కలవబోతున్నాము. ఇందులో సంభవం కానిది ఏదీ లేదు. నేను వస్తున్నా..! నీ కోసం...!!

చివరిగా - 'ఐ లవ్ టు లూజ్ మై సెల్ఫ్ యిన్ అదర్ మెన్స్ మైండ్ ' అన్న లాంబ్ పలుకు నీకు చెప్పాలని వుంది.

సే ...లవ్...!

నీ

ప్రియ సాగర్.

*****

మాధవీలత మనసంతా ఆందోళనగా వుంది. ఆయన తనకోసమే వస్తున్నారని గుడికి వెళ్తానని చెబితే, తన తల్లి ఒప్పుకోదు. పైగా ఇటువంటివి మన సంప్రదాయం కాదని గోల చేస్తుంది. ఆయన ఈ పాటికి వచ్చేసే వుంటారు. ఎక్కడ వున్నారో..? ఎంత ఆశతోటి ఇంతదూరం వరకు వచ్చారు ? గిరిగీసిన గిరులను దాటుకుంటూ, తరంగిణి లాంటి తరుణి ఎలా చేరగలదు సాగరుణ్ణి...?? తప్పదు మరి చేరాలి.. అదే దాని గమ్యం అయినపుడు..!

దేవుడా..! నన్ను కాపాడవూ ప్రార్ధించింది మనసులోనే. దేవుడు ఆమె ప్రార్ధనను ఆలకించినట్లుగా వుంది. అకస్మాత్తుగా వూడిపడింది ఆమె బాల్య స్నేహితురాలు సౌదామిని. గలగలమని సెలయేరులా మాటలు పరుగిడిన తరువాత, ఈనాటి తన దు:ఖానికి హేతువేంటో హితురాలికి తెలియజేసింది మాధవీలత.

"ఓస్...ఇంత చిన్న విషయానికి కొండంత వేదనా..? చిటికెలో తీరుస్తా...వుండు.." అంటూ వంటగదివైపు పరుగుతీసింది సౌదామిని... మాధవీలత తల్లిని మాయ చేసేందుకై -

*****

"అరుగో ఆయనే..!" అంది మాధవీలత. కోనేరు గట్టున కూర్చున్న సాగర్ ని సౌదామినికి చూపిస్తూ.

చిన్న చిన్న గులకరాళ్ళను విసురుతున్నాడు సాగర్ కొలనులోకి.

"యు ఆర్ వెరీ లక్కీ మధు..." అని అభినందించి వెళ్ళిపోయింది సౌదామిని.

అతని దగ్గరగా వెళ్తున్న కొద్దీ, అడుగులను ఏదో శక్తి అడ్డగిస్తున్నట్లుగా వుంది మాధవీలతకు. ఆమె రాకను గమనించి లేచి వచ్చాడు సాగర్.

" ఎలా వున్నారు మాధవీలత గారు..? " చొరవగా పలకరింపుగా అన్నాడు సాగర్.

" మీ దయవలన బాగానే వున్న..! " సిగ్గును దాస్తూ నవ్వుతూ అంది.

" మరి నాకే మీ దయ లేంది..."

అంత నిర్దయగా నేనేమీ ప్రవర్తించలేదే..? " చొరవగా సమాధానం చెప్పింది.

ముసి ముసి నవ్వులు రువ్వుతూ కొలను గట్టుమీద కూర్చున్నాడు సాగర్... సిగ్గుపడుతూ అతనికి కాస్త దూరంలో కూర్చుంది మాధవీ లత.

"ఇంత దూరం వచ్చినందుకు ఏమిస్తున్నావు నీ మొగుడు గారికి..? " అడిగాడు గోముగా.

" విలువైన మనసే ఇచ్చిన తరువాత, మరి ఇంకేం వున్నాయి ఇవ్వడానికి..? " ఓరకంట అతన్నే చూస్తూ అంది .

"అయితే ఒక చిన్న ముద్దు యిచ్చి నా ముచ్చట తీర్చు.." అన్నాడు కొంటెగా.

" అబ్బా ...ఆశ...అవన్నీ పెళ్ళైన తరువాతనే..." అంది కళ్ళతో వారిస్తూ..

" మధూ..! కళ్ళు మూసుకో..నీకో అనుభూతినిస్తా..!" తొందర చేస్తూ అడిగాడు.

ఆమె మదిలో ఆలోచనలు రణం మొదలెట్టాయి. ' అమ్మో ' కళ్ళు మూసుకుంటే చిలిపి చీమ కుట్టదని నమ్మకం ఏమిటీ..? ఒకవేళ కొంచెం సాహసం చేసి ముద్దు పెట్టుకుంటే..? పెట్టుకుంటే తప్పేమిటీ..? అతను కాబోయే మొగుదు కదా..! కానీ యిప్పుడు కాదుగా..? మరెందుకు ఇంత దూరం వచ్చింది..? ఇంతదూరం వచ్చింది ఇందుకా..? మరి...?? ఊహూ...!!!
అంతలో చేతిలో కొబ్బరి కాయలతో వారి చెంతకే వస్తూంది సౌదామిని.

" ఏయ్.. మధు..! ఏమిటిలా తెల్లమొహం వేసుకుని..చూడు..నువ్వు ఇవ్వనిది..నీ శరీరానికి సంబంధించింది..నాకేమీ వద్దు. నేనిచ్చేది మాత్రం నీ మనసుకే..! ఊ కళ్ళు మూసుకో..." మెల్లగా చెప్పినా ఆ కంఠంలో సీరియస్ నెస్ ద్వనించింది.

అతని మాటలను నమ్మింది.అతను చెప్పినట్లే చేసింది..ఓ..నమ్మకంతో కళ్ళు మూసుకుంది.. మెల్లగా ఆమెకు దగ్గరగా జరిగాడు సాగర్. తన కుడిచేతిని ఆమె హృదయానికి దగ్గరగా వుంచి, ఆమె మొహంవైపు చూశాడు. అవ్యక్తమైన ఆనందాన్ని పొందబోతున్నట్లుగా వుంది ఆమె మోము. ఆమె హృదయస్థలానికి మరింత దగ్గర్గా జరిపాడు తన కుడిచేతిని. ఓ...తియ్యని అనుభూతిని శాశ్వతంగా ఆమెకు ఇచ్చేందుకై -

ఆమె పెదాలు వణుకుతున్నాయి. ఒక్కసారిగా 'గుండె జల్లుమంది ' మాధవీలతకు. తన హృదయంపైన సూటిగా తాకిన 'స్పర్శ '-

ఒక్క్కసారిగా...! చల్లగా...! వెచ్చగా...! అంతలోనే ఆవిరై..! అంతా పరిమళమై..!!

చిరునవ్వు నవ్వుతున్నాడు సాగర్ - ఆమె సంభ్రమాశ్చర్యాలను చూస్తూ -

' అందమైన అనుభవాన్ని - అనిర్వచనీయమైన అనుభూతిని సొంతం చేసుకుని, ఆశ్చర్యంగా చూస్తుంది మాధవీలత తన ప్రియతముని వైపు. మెల్లగా ఆమె చేతిలో వుంచాడు సాగర్ సుగంధంతో పాటు ప్రేమనూ పంచే ' పెర్ ఫ్యూం ' బాటిల్ని. వారి చెంతకొస్తున్న సౌదామినినీ చుట్టేసింది..మలయ మారుతంతో కలిసి సాగిపోతున్న ఆ ఖరీదైన పెర్ ఫ్యూం సుగంధం...!

ఆ బాటిల్ లోని సుగంధం కొంతకాలానికి ఆవిరైపోవచ్చునేమో కానీ, ఆమె జీవితాంతం నిండి వుంటుంది ...

" ఓ... ప్రేమ సౌరభమై... "
*****
( స్వాతి మాస పత్రిక ... అక్టోబర్ 2000 )


9, డిసెంబర్ 2008, మంగళవారం

భోజ్యేషు మాత.....!!

వెన్నెల రేడు వెలిగిపోతున్నాడు నిండుగా నీలాకాశంలో. అప్పటి వరకూ ప్రియుని జాడ కానరాక, విరహంతో చింతించే 'విరహోత్కంఠిత ' లా వున్న సముద్రం, ఒక్కసారిగా ఆనందంతో ఉప్పొంగి గంతులు వేస్తున్నాట్లుగా వుంది. 'నక్షత్రాల వెలుగులే దారంట.. నవ్వుతూ వస్తున్నాయి నా వెన్నంట ' అని పాడుతున్నట్లుగా వుంది కెరటాల జోరు. ఉల్లాసంతో కేరింతలు కొడుతూ, పరిగెత్తుకుని వస్తున్న చెలి అలను ఒడిసిపట్టుకుని హృదయానికి హత్తుకోవాలనే ప్రియుడిలా పొంచి వుంది కొండ. పిండి ఆరబోసుకున్నట్లుగా వున్నాయి యిసుకతిన్నెలు...వెన్నెల వేడిమి క్రింద-
తీరం వెంట నడుస్తున్నారిద్దరూ. అతని హృదయంపై తలవాల్చి ఆమె - ఆమె నడుంచుట్టూ చెయ్యి వేసి , ఒడిసి
పట్టుకుని అతను - స్వర్గలోకపు ద్వారాలు తెరుచుకుంటూ నడుస్తున్నారు...

" అక్కడికి వెళ్ళి కూర్చుందామా..? " అడిగాడు 'వికాస్ ' దూరంగా వున్న కొండలను చూస్తూ-
"అమ్మో..ఆక్కడికా..? ఎలా వెళ్తాం..? " అంది మైధిలి భయంగా .వెళ్ళాలనే ఉత్సాహం ఆమె గొంతులో.

ఒడ్డునుంచి కొంత సముద్రం లోపలికి విస్తరించి వుంది కొండ. పాకుడుపట్టిన బండ రాళ్ళ మీదనుంచి జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ చోటుకి వస్తే నిక్షిప్తమైన 'సుఖనిధి 'ని పొందుతారని కాబోలు, దరి చేరనీయకుండా దారి కాచే విషనాగుల్లా బుసలుకొడుతూ ఎగసి పడుతుంటాయి అలలు, ఆ పాకుడు రాళ్ళ బాట మీద. "నేనున్నానుగా " అంటూ ముందుకు నడిపించాడు వికాస్ ఆమెని.
ఒకరినొకరు హత్తుకుంటూ, ఎగసిపడే కెరటాలను ఎదుర్కుంటూ,ఆ చిన్న కొండ పైకి చేరారిద్దరు -
ఆశ్చర్యపోయింది మైధిలీ. చైనా పని వారు నగిషీ చేసి తయారుచేసిన కుందనపు సెయ్యలా వుంది కొండ అంచు. దాని మధ్యన అలలు చెలులతో సహా తెచ్చి పరచిన పూలపుప్పొడి లాంటి ఇసుక రేణువుల పానుపు. ఎగిరికోసుకునే పండులా వుంది అల్లంత దూరాన జాబిల్లి. మన్మధ సంగ్రామానికి భేరి మ్రొగిస్తున్నట్లుగా వుంది సముద్రిని ఘోష. ఆనందాశ్చర్యాల మేళవింపుతో అచ్చెరువొంది చూస్తుంది మైధిలీ ప్రియతముని వైపు. ఆతని కళ్ళు ఆమెనే గమనిస్తున్నాయి. ఇసుకతిన్నెపై చతికిలబడ్డారిద్దరు. ఆమె కాళ్ళను ముందుకు చాపుకుని కూర్చుంది. ఆమె ఒడిలోతలపెట్టి, వెల్లకిలా పడుకుని ఆకాశం వంక చూస్తూ .. ..
"ఈ వాతావరణాన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది..? " ప్రశ్నించాడు వికాస్.
" ఇలానే కాలం గడిచిపోతే ఎంత బావుండు..?" చెప్పిందామే చుట్టూ చూస్తూ.
" ఇలా వూరికే కాలం ఆగిపోతే ఉసూరుమనదూ..? " ప్రశ్నించాడు.
"ఉసూరుమనేదేమిటీ..? " ప్రశ్నించిందామే కళ్ళెగరేస్తూ.
"యుద్దానికి సిద్దమైన మన్మధుడినైనా, బాణం వేయకుండానే ప్రాణం తీసే ఈ సొగసు.." అంటూ తన కుడి చేతి చూపుడు వేలుతో, ఆమె కుచాగ్రాన్ని తాకించాడు.
"ఛీ పాడు.." అంటూ తన ఒళ్ళో వున్న అతడిని ముందుకు తోసింది మైధిలీ.
'అబ్బా 'అంటూ అరిచాడు వికాస్ గట్టిగా..ఆ చూపుడు వేలును గట్టిగా పట్టుకుని.
" అరే ఏమైంది..? " కంగారు పడుతూ అఏఇగింది మైధిలీ.
" విలుకాడు సానబెట్టిన వజ్రబాణపు మొన గుచ్చుకుని వేలు తెగినట్లుంది.." చెప్పాడు వికాస్, ఇందాకటి తన చూపుడు వేలుని మరలా అమెకు చూపిస్తూ.
" అయ్యో రక్తం కూడా వస్తున్నట్లుగా వుందే..?" అంటూ ఆ వేలుని తన నోట్లో వుంచుకుంది మైధిలీ. ప్రధమ చికిత్స చేసేటందుకై. ఆమె నోట్లోని లాలాజలం లావాజలమైనట్టుగా అనిపించింది వికాస్ కి. అందుకే మరింత చిలిపిగా..
"అమ్మో..నీ రక్తం మరుగుతున్నట్లుగా వుందే.?" అంటూ ఆమె ఎదలో దాగే ప్రయత్నం చేసాడు వికాస్ భయం నటిస్తూ - మోహపు గిలిగింతలకు ఉక్కిరిబిక్కిరి అవుతుంది మైధిలీ. అదను చూసిన ఆమె మదిలోని కోరిక, సిగ్గు ముసుగు తీసి, ఆమె శరీరాన్ని వశపరుచుకునే ప్రయత్నం చేస్తుంది. మనసు వశం తప్పి మేను ఇసుకపై వాలింది. ' ఇష్టసఖి ' పూసుకున్న 'అష్టగంధముల ' పరిమళం అతని మనసుని పరవశింపజేసి శరీరాన్ని దహించివేసింది. మెల్లగా ఆమె ప్రక్కకి జరిగాడు వికాస్.
తెరచాపలా రెపరెపలాడుతుంది ఆమె చీరచెంగు తన చోటువదిలి. వెల్లకిలా పడుకుని వుంది మైధిలీ.ఆమె ముఖం లోకి తొంగిచూసాడు వికాస్. పైన మాటువేసి, ఆమె పైటమాటు అందాలను వీక్షించున్న కలువలరాయునికి వికాస్ అడ్డుగా రావడంతో ఆగ్రహం కలిగింది. అందుకే మరింత మండి పడ్డాడు వెలుగుమంటతో -అటు చందమామ కోపాన్నిగానీ, యిటు ప్రియసఖుడైన భర్త మోములోని మోహాన్ని గానీ గమనించే స్థితిలో లేదు మైధిలీ. ఆమె కళ్ళు మూసుకుని వుంది. మధురానుభూతినిచ్చే ఓ..అధ్భుత సుఖానికై సిద్దమవుతూ -
గాలికి ఎగురుతున్న ముంగురులను సవరించాడు వికాస్. జరుగబోయే పరిణామాల్ని తలచుకుని కాబోలు, మూసివున్న కనురెప్పల మాటున ఆమె కళ్ళు బెదురుతున్నాయి - పెదాలు అదురుతున్నాయి. అదిరే ఆమె అధరాలను తన పెదవులతో బంధించాడు వికాస్. ఎడమచేతితో ఆమె తలను సవరిస్తూ, కుడి చేతితో ఆమె శరీరంపై సైనికకవాతు నిర్వహించాదు. నఖశిఖ పర్యంతం ఎక్కడా ప్రతిఘటన లేదు ఆమెలో. ఆమె మధన సామ్రాజ్యపు సింహాసనాన్ని అధిష్టించేందుకు ఉధ్యుక్తుడయ్యాడు. ఏ అంగుళీ కరవాలానికి, ఆమె ఉడుపులు విడివడ్డాయో తెలియదు కానీ, ఆమె నాభిపై భాగం ఏ మాత్రం ఆచ్చాదన లేకుండా పోయింది.
పరికించి చూస్తున్నాడు వికాస్ ఆమె అందచందాలను - చక్రవాకపు పక్షులు రెండు ఆమె గుండెలపై నిల్చివున్నాయా ? అన్నట్లుంది ఆమె వక్షోజాల పొంకం. కాముని ప్రతాపం కాంచినది కాబోలు మదిలో, గగుర్పాటుతో ఆమె పొట్టపైని సనసన్నని రోమాలు లేచి నిలబడి, వెండిదారపు తీగల్లా మెరుస్తున్నాయి. తన ప్రకాశంతో సముద్రుని ఆవలి ఒడ్డును చూపించగలిగిననూ, ఆమె బొడ్డు లోపలి చీకటిని మాత్రం ఏమీ చేయలేకపోయాడు ఆ రజనీకరుడు. నాభి లోయలోనికి తొంగి చూసాడు వికాస్.
అనిర్వచనీయమైన ఆనందానుభూతిని ఆస్వాదిస్తుంది మైధిలీ కళ్ళు మూసుకునే - ఆమెలో పొంగుతున్న తనివినే కాదు, తనువునూ చూసాడు. ఆమె జడపాయలనే కాదు, చీర ముడులనూ వూడదీసాడు. వద్దని వారించలేదు మైధిలీ - ఆమె వాంచించినదే అది -
" ఎలా వుందీ అనుభవం ? " మెల్లగా అమెను ఆక్రమించబోతూ గొణికాడు వికాస్.
" చంపేస్తుందీ..!" చెప్పింది మత్తుగా కరిగిపోతూ..
"మరి చచ్చిపోతావా..?" అస్పష్టంగా గొణికాడు." ఊ చంపు..!! " గొణికింది మత్తుగా, మరెంతో కసిగా -
క్షణక్షణానికి తీవ్రమౌతున్న వారి తనువుల సెగతో చలిమంటలు కాసుకుంటోంది మార్గశిర మాసపు చలిగాలి. కాంక్షతో రగిలిపోతున్న మైధిలీ కళ్ళ తెరిచింది. ఆమె కళ్ళల్లోని ఎర్రజీరలను చూసిన వికాస్ కళ్ళు విజయగర్వంతో మెరుస్తున్నాయి. మరింతగా విజృంబించమని ఆదేశించింది మనసు, శరీరంలోని నరనరాన్ని. వికాస్ లోని కోరిక ఆకాశమంత అయ్యింది. మైధిలీలో వాంఛ సముద్రమై పొంగింది ...దాన్ని ముంచేందుకై -
అహంపూర్వికులై కలిసి, అణుశక్తితో పోరు సలిపి, ముక్తి కూడిన మైకంతో విడివడ్డారు నిస్సత్తువుగా -ముగిసింది మన్మధ సంగ్రామం.. ఆ సంగ్రామంలో రక్తం ఏరులై పారలేదు- అనురక్తి పారింది. ఇంతటి అధ్భుతమైన సుఖాన్నిచ్చిన ఆ రతిశయ్యా, సైకత పానువులూ, సమవుజ్జీలైన ఆ యిద్దరిని సాదరంగాఅహ్వానించాయి మరికొంత సేపు సేద తీర్చుకునేందుకై - రసపుష్టితో సృష్టికార్యంలో పూర్తిగా సంతుష్టులైన వారి మేని స్పృహ ఎటో ఎగిరిపోయింది. నిద్రలోకి జారిపోయారిద్దరూ..అక్కడే..అలానే...అలసిపోయి -
******
కళ్ళముందు కదలాడుతుంది నిన్నా-మొన్నటిలా.. ఆనాటి సాగరతీరంలో, వెన్నెల విడిది సేవలో జరిపినటువంటి 'రాసలీల ' ఆ రాత్రికి ముందూ,వెనుకా ఎన్నో రాత్రులు శృంగారంతో తడిచాయి గానీ, అంత మధురమైన రసానుభూతినిచ్చింది మాత్రం ముమ్మాటికి అదే !ఆనాటి మైధిలీ స్పందనను తనే నాటికి మర్చిపోలేడు -
" మీరు కూడా వచ్చి అక్షింతలు వేయండి బాబు..! " ఆహ్వానించింది మైధిలీ పెద్దమ్మ వికాస్ ని .ఆలోచనల్లోంచి జారిపడ్డాడు వికాస్. తలతిప్పి చూసాడు భార్య వంక. సిగ్గు భారంతో తలవాల్చేసింది మైధిలీ-
తలనిండా పూలు,పాపిట సింథూరం, ముఖాన పెద్దబొట్టు, మెడలో పులిమిన శ్రీగంథం, రంగురంగుల గాజులతో, బంగారు నగలతో ఆ పట్టుచీరలో, ఆ 'శ్రీవత్సలాంఛనుని ' పట్టమహీషి...ఆ 'శ్రీలక్ష్మి 'లానే కనిపించింది,అందరి కళ్ళకు లానే వికాస్ కళ్ళకి కూడా -' ఆనాటి జవ్వని నేడు గర్భిణి..సీమంతం జరుపుకుంటున్న తరుణి ' -
' నా నిండు జీవితానికి భాష్యం కావే ...సాక్ష్యమై నిలిచిపోవే ' అని మనసారా దీవిస్తూ, ఆమె తలపై అక్షింతలు చల్లాడు వికాస్. తన కాళ్ళకు వంగి నమస్కరించడానికి యిబ్బంది పడుతున్న భార్యను మధ్యలోనే నిలిపి హృదయానికి దగ్గరగా తీసుకున్నాడు ప్రేమమీర. మెల్లగా ఆమెను గదిలోనికి తీసుకువెళుతున్నాడు నడవటానికెంతో యిబ్బంది పడుతున్నట్లుగా వుంది మైధిలీ. ' నిన్నటి వరకూ చెంగు చెంగున ఎగిరిన హరిణి..నేడయ్యింది...గజగామిని ' -
ఆ రాత్రి చాలా అలసటగా పడుకునివుంది మైధిలీ. మెల్లగా ఆమె ప్రక్కకు చేరి ఆమె తలను నిమురుతున్నాడు వికాస్, ఆమె కళ్ళల్లోకి చూస్తూ - మురిసిపోయింది ఆమె మనసు సంతోషంతో నిండి .
" మైధీ..! నువ్వింత కష్టపడాల్సి వస్తుందని తెలిస్తే, నేనంత కష్టపడకపోదునే.." అన్నాడు చిలిపిగా .
" ఛీ....ఫో .." అంది సిగ్గులమొగ్గవుతూ -
" నీ కష్టం మాట దేవుడెరుగు..యిప్పుడు నాకెంత కష్టకాలం దాపురించింది..? " అన్నాడు బాధగా.
" ఇప్పుడు నీకొచ్చిన కష్టం ఏమిటే..?" ప్రశ్నిస్తూ అతనై తలను తన హృదయానికి హత్తుకుంది.
" ఇప్పట్లో నీ దాపుకొచ్చే సుఖం..మరి దరిదాపుల్లో లేదు కదా..? " చిలిపిగా చూస్తూ అడిగాడు.
" ఛీ..పాడు..నీకెప్పుడూ అదే ధ్యాసా..? " ప్రశ్నించింది కసురుతూ.
" శయనమందిరంలో రంభవై నువ్వు రెచ్చగొడుతుంటే , ధ్యాస అన్నమాటేమిటి..శ్వాస కూడా అదే అవుతుంది..
"పిచ్చికన్నా..! ఆ ప్రేమే కదరా మరో జీవికి శ్వాస నిస్తుందిప్పుడు.." అంది మైధిలీ అతన్ని మరింత అక్కున చేర్చుకుంటూ -
ఆమె మెడవంపులో తన ముఖాన్ని దాచేసాడు వికాస్ తెలియని దిగులుతో, అంతే బాధతో చేర్చుకుంది మైధిలీ అతడ్ని -వారీ రీతికి ముఖ్య హేతువు రేపటినుండి వారి దరికానున్న 'ఎడబాటు ' వారి ప్రేమసౌరభం ఆ గదిలోనే కాదు, వారి మది లోనూ చోటో తిసుకుంది -
*****
మనిషి జీవితం లోకి మరోమనిషి ప్రవేశించడమే వింత. అదే సొంత మనిషైతే అది అవుతుంది మరింత. తనని మరచి మరోమనిషి నేవలో మునిగిపోయిన భార్యను గమనిస్తూనేవున్నాడు వికాస్ ఉదయం నుంచి. అవే సేవలు యింతకాలం గుత్తంగా తానొక్కడే పొందాడు. ఉదయం వచ్చిన దగ్గర్నుంచి భార్యను ఏకాంతంలో కలిసే అవకాశమే చిక్కలేదు. ఇల్లంతా ఒకటే సందడి. వచ్చిపోయే వారితో ఒకటే హడావుడి.ఆ రాత్రి పదిగంటలు దాటుతుండగా అన్నిపనులూ చక్కదిద్దుకుని గదిలోకి వస్తూ, భర్తను చూసి కిసుక్కున నవ్వింది. ఆ నవ్వు పగతో వున్న పాముని రెచ్చగొట్టేది, కోపంతో వున్న మనిషికి తాపం పెంచేది. మెల్లగా వచ్చి టేబుల్ పైన పాలగ్లాసునుంచుతూ, తన జడలోని మల్లెపూలని ఆతని నాసికాపుటాలకి తాకించింది. అసలే విరహతాపంతో వున్న వికాస్ మదిని మరింత బాధించాయి...ఆ పూల వాసనలు ... ఆ బాల చేతనలు -
" బాబు ఎలా వున్నాడు..?" ప్రశ్నించింది మెత్తగా ఆతని కాళ్ళు వత్తుతూ.
"వాడికేం..వాడు బాగానే వున్నాడు..వాడి బాబే..."
" ఈ పెదబాబుకి ఏమైందంటా..? " అడిగింది అతని కాళ్ళ వేళ్ళ మొటికలు విరుస్తూ.
" ఇప్పుడు గానీ గుర్తుకురాలేదా మొగుడు..?" అడిగాడు చిరు కోపంగా.
"అయ్యా..! మహానుభావా..! ఏంచెయ్యమంటారు నన్ను..? ఇప్పుడు నేను ఇద్దరి పురుషుల ఉమ్మడి దాసిని.." అంటూ లేచివచ్చి అతని కళ్ళల్లోకే చూస్తూ..చెంతకు చేరింది -
ఆమె స్వచ్ఛమైన ప్రేమతో కూడిన చిరునవ్వు, అతని కోపానికి ఉపశాంతిని కలిగించింది. గట్టిగా హృదయానికి హత్తుకున్నాడామెను వికాస్ . లతలా అల్లుకుపోయింది మైధిలీ అతడ్ని -
వైకుంఠపాళీ లాంటి కామకేళిలో మొదటి నిచ్చెన ఎక్కారిద్దరూ. బందీయై వున్న ఆమె కుచములకు స్వేచ్ఛను ప్రసాదించాడు వికాస్. ఆనందంతో కదలాడసాగాయి ఆ పాలపుంతలు. వాటినే తదేకంగా చూస్తున్న వికాస్ కి ' చేమకూరి వెంకట కవి ' వ్రాసిన 'హృదయ విలాసం ' లోని రసరమ్య పధ్యం గుర్తుకువచ్చింది. అది సుభద్రను మొదటిసారిగా చూసినప్పుడు అర్జునునికి కలిగిన విరహవేదన....!
" కలిగెబో యీ ఇంతి కులుకుగుబ్బలు జూడ శీతశైలాదుల సేవఫలము..కలిగెబో యీ భామ కటి విలాసము జూడ, భూప్రదిక్షణము సల్ఫుటకు ఫలము...."
అలా అమె అంగాలతో తన అనుభవాన్ని జత చేసుకుంటూ.....ఇంకా ఇలా.......
"తన్వి తీరంగ నింక నీతన్వి గూడి, సరస సంభోగ సల్లాప సరణి దేలు..నాడుగా ఫలియించుట ..నా తఫము...." అనుకున్నాడు అర్జునుడు.తాను హిమగిరులను సేవించాడు కాబట్టి, ఆమె కుచద్వయాన్ని వీక్షించుట వలన ఆ యాత్ర ఫలవంతమైనట్టు, భూప్రదిక్షణము చేయుటవలన కలుగవలసిన ఫలము, ఆమె పిరుదుల సొగసు చూడటం వలన కలిగినట్టూ భావిస్తూ....తనివి తీరేలా ఆ చిన్నదానితో కూడి, సరస సల్లాపములతో, సంభాషణా చాతుర్యములతో సంభోగమున తేలినప్పుడు కదా ..! నా యీ తఫము పలియించింట..." అంటూ తన విరహవేదననూ, నరక యాతననూ తెలియచేసాడు అర్జునుడు, శ్రీ చేమకూర వెంకట కవి పుంగవుని ద్వారా లోకానికి ....అనుకున్నాడు వికాస్ తనలో కలుగుతున్న భావనలను గమనించి -
భార్య కాబోయే మనిషి పొందుకోసం అర్జునుడు అలమటిస్తుంటే, భార్య అయిన మనిషి పొందుకోసం పరితపిస్తున్నాడు వికాస్ వుదయం నుంచీ -
' స్మరుని సమ్మోహానాస్త్రానికి సమ్మోహితులైన వారిర్వురూ నరులే...శృంగార రణరంగాన సవ్యసాచులే ' -
చేతివేళ్ళకొసలను నెమలిపింఛాలుగా మార్చి, ఆమె తనువంతా స్పృశించాడు వికాస్. అతని పెదవుల తడి ఆమెకు మరింత వేడిని రగిల్చింది. పరవళ్ళు త్రొక్కుతున్న కోరికల సెలయేరు నిండుగా ప్రవహించసాగింది ఆమె మోములో. బహుశా అతని చేయి తాకిందేమో,ఒలికిపోసాగింది ఆమె ఒంటిపై, ఆమె కుచ కుంభాలలోని క్షీరం. పారవశ్యంతో మైధిలీ మేను తడుస్తూండగా, సహించలేని వికాస్ కలహానికి దిగాడు మరుని శరంతో -ఆమె చేతులు అతడిని గట్టిగా బంధించివేస్తున్నాయి. గోళ్ళు గిచ్చుతున్నాయి. పళ్ళు కొరుకుతున్నాయి. కానీ మనసు మాత్రం ప్రార్ధిస్తుంది. 'భరించలేని బాధను కలిగిస్తున్న ఆ మీనకేతునుని వధించమని
' -ఇద్దరిలోనూ ఒకటే కాంక్ష..అది తమ విరహానికి తగిన శిక్ష - అలా ఒకరిలో ఒకరు లీనమౌతున్న క్షణాన, యిద్దరూ కరిగి ఒక్కరే అవుతున్న క్షణాన....కలిగింది ఓ..అవాంతరం..వారిర్వురీ జీవితాలలోనూ ఈ అవాంతరం..
ఉలిక్కిపడ్డారిద్దరూ ఒక్కసారే -'కేర్ కేర్ ' మంటూ ఏడుస్తున్నాడు ఉయ్యాలలోని బాబు. అప్పటివరకూ ఆమె మోములో కనిపించిన ఉత్తేజపు దీప్తి ఒక్కసారిగా మాయమైంది. ఇంకా ఆ ప్రకంపనాలకి లోనైవున్నాడు వికాస్.బలవంతంగా భర్తను పక్కకు నెట్టి, ఒక్క ఉదుటున ఉయ్యాల వద్దకు పరిగెత్తి... ' నా కన్నే...నా బాబే..' అంటూ బాబుని హృదయానికి హత్తుకుంది మైధిలీ.
' అమ్మ ఆలింగనమే ' సగం ఆకలి తీర్చినట్లుంది బాబుకి- ఏడుపు ఆపాడు మెల్లగా -వాడి నోటికి తన స్తనాన్ని అందించింది మైధిలీ. అవురావురుమంటూ పాలు తాగసాగాడు బాబు. ఆమె మాతృత్వపు మధురిమను తనివి తీరా చూస్తున్నాడు వికాస్ ..ఎంతో ఆశ్చర్యంగా -బాబుకు పాలుపడుతూ, భర్త వైపు చూసింది మైధిలీ ఎంతో జాలిగా- ఆతని స్థితి ఆమెకు జాలి కలిగించి బాధ కలిగించింది. ఏం చెయ్యగలదు తను యిలాంటి పరిస్థితిలో...అతని ' అర్ధాంగి 'గా తనకూ కలుగుతుంది ఆ బాధ.
" భర్తపై వసివాడని ప్రేమున్నా..పసికూనే ప్రాణం కన్నా మిన్న ..తనకైనా..ఏ తల్లికైనా...!
బాబుకు పాలుపడుతూ మైధిలీ మురుస్తుండగా, మెల్లగా వచ్చి ఆమె మరో స్తనాన్ని ఆక్రమించాడు వికాస్ తన నోటితో. ఉలిక్కిపడింది మైధిలీ.
" ఛీ..ఛీ.. ఎమిటీపాడు పని వికాస్..లే ముందు.." భర్తను కసురుతూ బాబు వైపు చూసింది. వాడు ఎందుకో నవ్వుతున్నాడు. సిగ్గుపడిపోయింది అంతలోనే...
" నీకే చెప్పేది..నీకసలు సిగ్గుగానీ, బుద్ధిగానీ వున్నాయా..? లే..లే.." కసిరింది కోపంగా-ఉన్నాయన్నట్లు తలూపాడు తను చేస్తున్న పనిని ఆపకుండానే-
" నీకే చేప్పేది..ముందు లే.." సీరియస్ గా కసిరింది ఈసారి.
"చలం గారు ఏమన్నారు ? " అడిగాడు వికాస్ తనూ సీరియస్ గా మొహంపెట్టి.
"ఆ ఏమన్నారూ..? " అన్నట్టు చూసింది తీక్షణంగా
"స్త్రీ హృదయంలో వుండే మాతృత్వాన్ని అనుభవించని ప్రియుడు, స్వర్గానికి అంథుడు " చెప్పాడు గొప్ప విషయంలా -"ఛాల్లే..చాలా మంచి మాటే చెప్పాడు..లేముందు.." తన ఒడిలో నుంచి అతడిని తోసే ప్రయత్నం చేస్తోంది మైధిలీ సిగ్గుతో నలిగిపోతూ.
"కానీ నేను అంథుడిని కాను...పాంథుడిని.." అన్నాడు మరలా తన పనిలో పడుతూ.
ఏం చెయ్యగలదు అటువంటి పిచ్చిప్రియుడిని ...అల్లరి మొగుడిని..ప్రేమున్న ఆ ఆడది...??? దొంగలాగా వచ్చి తన ఆహారాన్ని హరిస్తున్న తండ్రిని విచిత్రంగా చూసాడు బాబు ' ఇది నా సొత్తు కదా! ' అన్నట్టు-
"ఆ లుక్ ఏమిటిరా ? ఇక్కడ నీకూ-నాకూ సమాన హక్కు.." అన్నాడు వికాస్ బాబు బుగ్గపై మెల్లగా తడుతూ-
నిజమే ! ఇద్దరికీ సమానమైన హక్కే వుంది. ఒకరికి తనువిచ్చిన హక్కు. మరొకరికి మనువిచ్చిన హక్కు. రెండో వారికే శాశ్వత ఎప్పటికైనా...!!
పసికూనలై తన ఒడికోనలో ఒదిగి పరవశిస్తున్న...ఆ యిద్దరి పురుషులని హృదయానికి హత్తుకుంది మైధిలీ ఎంతో పారవశ్యంగా -
ఇద్దరికీ చెరోరకమైన 'ఆకలి '... వారిద్దరికీ ఒకటే వాకిలి...తన తనువే వాళ్ళకి ఆకలి 'లోగిలి '-
ఒకరి ఆకలిని తీర్చేటందుకు 'తల్లై' -మరొకరి ఆకలిని తీర్చేటందుకు ' ఆలై ' - ఏకకాలంలో వారిద్దరి ఆకలిని తీర్చే ప్రయత్నం చేస్తుంది మైధిలీ....' తన మేనుని సగం చేసి ' ... భోజ్యేషుమాతై ...!!!
*****

( స్వాతి సపరి వార పత్రిక .... ఏప్రియల్ ఇరవై , రెండు వేల ఒకటో వత్సరం.. )

8, డిసెంబర్ 2008, సోమవారం

గుండె చప్పుళ్ళు...!

కొండగాలి మనుషుల్ని వణికిస్తుంది.మనసుల్ని కొరికేస్తుంది.కొండపైన వున్న గెస్ట్ హౌస్ మూలానా చలిగాలి మరింత చెలరేగి పొతూఉంది. అక్కడ కూర్చున్న ఐదుగురు పంచ పాండవులు కాదు.ప్రపంచతంత్రంలో మిత్రభేదం లేకుండా విత్తలాభం తెలిసిన వుద్దండులు.
అది ప్రొజెక్ట్ క్రాంట్రాక్టర్ చంద్రశేఖర్ ఎరేంజ్ చేసిన పార్టీ. మిగతా నలుగురూ అతని వ్యాపార సామ్రాజ్యానికి నలుదిక్కులుగా దక్షిణ మేస్తూ రక్షణ నిచ్చే కాసుల కాపరులు. హోదాకి చీఫ్ ఇంజినీర్ అయిన ఆదాయానికి పరమ చీప్ ఇంజీనీర్ గా ముద్రపడ్డ చీఫ్ ఇంజినీర్ మాధవరావు, లంచానికి-మంచానికి ఎక్స్ క్లూజివ్ ఇంజినీర్ గా పేరుపడ్డ ఎగ్సి క్యూటివ్ ఇంజినీర్ హరివిఠల్, చీఫ్ ఇంజినీర్ కనుసన్నల హింటులకు తన ఇండెంటును కలిపి తన ఉధ్యోగమే మనిమింట్ గా మార్చివేసిన ఆఫీస్ సూపరింటెండెంట్ రంగనాధం, 'నా లెక్కాగితే మీ డొక్కాగుతుంది ' అంటూ పళ్ళు ఇకిలిస్తూ తన విషపు కోరలను చూపే ఎకౌంట్స్ ఆఫీసర్ ఫణిభూషణం.
వీళ్ళు తమ లౌక్యంతో సౌఖ్యాలను సొంతం చేసుకునే పబ్లిక్ సర్వెంట్స్ - ప్రైవేట్ మర్చంట్స్.
విస్కీని గ్లాసుల్లోకి సమంగా ఒంపుతున్నాడు రంగనాధం. అందరికీ గ్లాసులను అందించి తన గ్లాసులోని విస్కిని ఒక చుక్క నేలమీదకి ఒంపి తాగనారంభించాడు.
" మందు కొట్టేటప్పుడూకూడా ఈ సెంటిమెంట్స్ ఏంటండీ బాబు " అడిగాడు ఫణిభూషణం. " చిన్నప్పటినుంచి అలవాటు..ఏది తిన్నా తాగినా ఇది తప్పదు " గొప్ప విషయంలా చెప్పాడు రంగనాధం.
"పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదు.." వెటకారంగా చెప్పాడు హరి విఠల్
" మన రంగనాధం గారికి ఇది పుట్టుకతో వచ్చింది కాదు..ముట్టుట వలన..ఐ..మీన్ గ్లాసు పట్టుట వలన వచ్చింది " నవ్వుతూ చెప్పాడు చంద్రశేఖర్. నవ్వారందరూ.
" ఇవాళకూడా ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయ్యేటట్టేవుంది..ఈరోజు కూడా ఇంట్లో రామాయణమే " చెప్పాడు రంగనాధం వాచీ చూసుకుంటూ.
" ఏ రామాయణమండోయ్..? " వ్యంగ్యంగా అడిగాడు ఫణిభూషణం.
"బాల రామాయణమే.." తాపీగా చెప్పాడు రంగనాధం.
" పిల్లలు గొడవ చేస్తున్నారా..? " ప్రశించాడు మాధవరావ్ మెల్లగా సిప్ చేస్తూ.
" పిల్లలు కాదు సార్..పెళ్ళామే.." వివరించాడు రంగనాధం.
" మరి బాల రామయణమంటున్నారు ..?" ప్రశ్నించాడు హరివిఠల్.
" అదేనండి బాబు..మా ఆవిడ పేరు బాలాత్రిపుర సుందరి.." చెప్పాడు రంగనాధం. ఘొల్లున నవ్వారందరూ, అతనుచెప్పిన తీరుకు.
" ఈ ఆడోళ్ళు మరీ విచిత్రమండి..సంపాదన లేకుంటే సన్యాసికింద జమ కడతారు. సంపాదనలో పడి..ఇలా కాస్త లేట్ గా ఇంటికి వెళ్ళామా అంటే..యివెక్కడి సన్నాసి అలవాట్లు అంటూ గోల చేస్తారు..రెండు నాల్కలు వాళ్ళకి.." చెప్పాడు ఫణిభూషణం.
" అందుకే వున్న ఒక్క నోరు గట్టిగా మూయించలా .." చెప్పాడు చంద్రశేఖర్.
" శెభాష్..బహు బాగా శెలవిచ్చారు.." అరిచి చెప్ప్పాడు రంగనాధం.
" వాళ్ళు అనేదాంట్లోనూ అర్ధముంది. మీరు ఏదైనా చెయ్యండి..ఏంతైనా సంపాదించంది..ఇన్ టైం లో చెయ్యమని వాళ్ళ అర్ధం.." ముసిముసినవ్వులు నవ్వుతూ చెప్పాడు మాధవరావ్.
" ఓహో..బ్రహ్మండంగా శెలవిచ్చారు..గురువు గారు..దీపం వుండగానే ఇల్లు చక్కదిద్దుకోమన్నట్లు...సీట్లొ....." నాలిక కరుచుకుని మాధవరావ్ కాలిమీద గట్టిగా కొట్టాడు రంగనాధం.ఎంత గొప్పగా చెప్పారన్నట్లు చూస్తూ. మూడుపెగ్గులు పడగానే చనువు ముదురుతుంది రంగనాధానికి. అదే నచ్చదు మాధవరావ్ కి . కడుపు మండింది అందుకే.
" ఇలా మంచినీళ్ళు తాగినట్లు తాగితే, చక్కదిద్దుకునే మాట దేవుడెరుగు..దీపమే ఆరిపోతుంది.." చెప్పాడు మాధవ రావ్ కాస్త కోపంగా.
" అనుకుంటాం గాని సార్..! సిగెరెట్ తాగితే లంగ్ క్యాన్సర్ అని, మందు కొడితే బ్లడ్ క్యాన్సర్ అని ..పోయేరోజు వస్తే ఏలానూ పోతాం.. " చెప్పాడు హరివిఠల్. గ్లాసులోకి విస్కినీ ఒంపుకుంటూ.
"ఏమంటారు చంద్రశేఖర్ గారు ? సీన్ వున్నప్పుడే..ప్లాన్ చేసుకోవాలి..." అన్నాడు అతడ్నికూడా కలుపుకుంటూ.
."మీరు చెప్పింది నిజమే, మాగ్గాళ్ళ కంటే ఏవో దిక్కుమాలిన అలవాట్లుంటాయ్ రోగాలు వచ్చాయనుకోవచ్చు.. మరి ఆడవాళ్ళకొచ్చే క్యాన్సర్ల సంగతేమిటి..? " ప్రశ్నించాడు చంద్రశేఖర్ అందరివంకా చూస్తూ.
తలుపు తీసిన చప్పుడైతే తిరిగి చూసారు అటువైపు. తలుపు అవతల నిలబడి వున్నాడు చంద్రశేఖర్ తరుపున పనిచేసే సైట్ సూపర్ వైజర్ బాల్ రెడ్డి.
" సారి సార్..మీకు ఫోను..ఇంట్లో ఎవరికో సీరియస్ అంట..మిమ్మల్ని వెంటనే బయలుదేరి రమ్మనారు.." మెల్లగా చెప్పాడు బాల్ రెడ్డి.విన్న చంద్రశేఖరానికి పిచ్చకోపం వచ్చింది.
" ఫూల్ ఎవరికిరా.. సీరియస్..? " కొపంగా అడిగాడు చంద్రశేఖర్.
" సరిగ్గా వినిపించలేదు సార్..డిస్టర్ బెన్స్ వస్తుంది..మిమ్మల్ని ఉన్నపళంగా..." ఆగిపోయాడు బాల్ రెడ్డి, చంద్రశేఖర్ కళ్ళల్లో కోపాన్ని చూసి.
" ఈడియట్ ..ఏ పనీ సరిగా చేసి ఏడవ్..ఫో బయటికి.." కసిరాడు కోపంగా. మొహం చిన్నబుచ్చుకుని వెళ్ళాడు బాల్ రెడ్డి.
గ్లాసులోని విస్కిని ఒక్క గుక్కలో మింగాడు చంద్రశేఖర్ ఆలోచనలో పడి. మండింది గొంతు. అది సోడా కలపని విస్కి. కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి. గబగబా వాటర్ బాటిల్ ని ఎత్తి గొంతులోకి వంపుకున్నాడు. పళ్ళమధ్య మాంసం ముక్క నలిగిపోతున్నది. ఒంట్లో రక్తం మరుగున్నట్లుంది. మాట్లాడవలసిన బిజినెస్ మేటర్ చాలానే వుంది. మధ్యలో వెధవ న్యూసెన్స్.. ఇంతకీ తేడా ఎవరికి ? తండ్రికా ? తల్లికా ? ఆలోచిస్తున్న కొద్దీ బుర్ర వేడెక్కుతుంది. గ్లాసు మరలా కాళీ అయ్యింది.
"మరి ఇప్పుడే బయలుదేరతారా..? " ప్రశ్నించాడు హరివిఠల్. తలూపాడు చంద్రశేఖర్. "హైద్రాబాద్ దాకా వెళ్ళాలి కదా..మరో పెగ్గు వేషుకోండి.."వూగిపోతూ చెప్పాడు రంగనాధం. వద్దని తల అడ్డంగా వూపాడు చంద్రశేఖర్.
ఎవరితోనూ మాట్లాడబుద్ధి వేయడం లేదు అతనికి.అందరివద్దా సెలవు తీసుకుని బయలుదేరాడు చంద్రశేఖర్. ఎంత అలోచించినా సీరియస్ అయ్యింది ఎవరికో అర్ధం కావడం లేదు. మత్తు ఆలోచనలను ముంచేసింది. మనిషిని నిద్రలోకి జార్చింది. కారు వెనుకసీట్లో వాలిపోయాడు చంద్రశేఖర్. కారు ముందుకు దూసుకుపోతుంది.
*****
సివిల్ ఇంజినీరింగ్ చేసి కాంట్రాక్టర్ వృత్తిని చేపట్టాడు చంద్రశేఖర్. శ్రీశైలం ప్రోజెక్ట్ లో పెద్ద కాంట్రాక్టర్. వ్యాపారంలో లాభం- వ్యవహారంలో ముభావం , అదీ అతని స్వభావం. సొమ్ముకు అమ్మకం కానిది ఏదీ లేదన్నది అతని నమ్మకం.హైద్రాబాద్ కి డబ్బై కిలోమీటర్ల దూరాన గల 'నారాయణపురం ' అతని స్వస్థలం. తండ్రి పట్వారీగా పనిచేసి సంపాదించిన ఆస్తులకంటే నాలుగైదు రెట్లు ఎక్కవే సంపాదించాడు ఈ వృత్తిలో కొచ్చి. ఆ వూళ్ళో అత్యంత ధనవంతుల కుటుంబం అతనిది. పల్లెలో పుట్టినా, పట్నవాసపు వాసనలు పీల్చిన తరువాత, పల్లెటూరంటేనే పరమ చిరాకు అతనికి.
అతని భార్య ' శకుంతల ' అతనికి పూర్తిగా భిన్నం. అగ్రి కల్చరల్ బి.యస్సీ చదివిన మహిళ. అంతలా చదువుకున్న ఆడవారు మరెవ్వరూ ఆ వూళ్ళో లేరేమో..? తను చదువుకున్న చదువు సార్ధకం కావాలంటే 'పల్లే' దానికి అనువైన నెలవు అనుకుంది. ఆమె అంటే ఇంట్లో వారికే కాదు..వూళ్ళో వారికి కూడా అమితమైన గౌరవాభిమానాలు -ప్రేమానురాగాలు.
******
కారు దుమ్ము రేపుకుంటూ దూసుకుపోతుంది. పల్లెజనాలు ఆగి నిలబడి విచిత్రంగా చూడసాగారు. కారు కుదుపులకు మెలుకువ వచ్చింది చంద్రశేఖరానికి. నారాయణపురం ఇంకా కిలోమీటర్ దూరంలో వుంది. రాత్రి తాలుకా సంఘటనలు మెల్లగా గుర్తుకు రాసాగాయి. ఆలోచనలు కందిరీగల్లా ముసురుకుంటున్నాయి మనసుని-కారు ఇంటి సందు మలుపు తిరుగుతుండగా గమనించాడు చంద్రశేఖర్, ఇంటిముందు జనం గుమిగూడి వుండటాన్ని. మనసులో కీడు తొంగి చూసింది తండ్రివైపు- ఏమయ్యుంటుందీ ? మళ్ళా హార్ట్ ఎటాక్ గానీ వచ్చిందా ? అలోచనాకెరటం ఉవ్వెత్తున లేచింది మనసులో, తండ్రి గురించిన బాధలా - తండ్రి రూపం, పట్వారీగా ఆయన దర్జా, బతికిన శైలీ గుర్తుకురాసాగాయి -
కారు ఇంటిముందు ఆగింది. అందరి మొహాల్లోకి తొంగి చూసాడు లోపలినుంచే. కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా వున్నాయి. అది గుండెలోతుల్లోని దు:ఖం వలనో, గొంతు వరకు తాగిన లిక్కర్ వలనో తెలియదు. ఒంట్లోని శక్తిని కూడదీసుకుంటూ క్రిందకు దిగాడు మెల్లగా.
" శేఖర్ అన్యాయం అయిపోయిందిరా " కౌగిలించుకుని బావురుమన్నాడు చంద్రశేఖర్ బాల్య స్నేహితుడు రాఘవ.
మనసులో సుళ్ళు తిరుగుతున్న బాధ కళ్ళల్లో కనిపించింది. " నాన్నా..." అంటూ గుండె రోదిస్తుండగా వినిపించాయా మాటలు.
" దేవుడా..! ఎంత దుర్మార్గుడివిరా..! మేమేం పాపం చేసినామనిరా ఇంత దారుణం చేసావ్..? నీకు మొక్కిందానికి..మాసావు మమ్మల్ని సావమనా దాన్ని తీసుకుపోయావ్...?" గుండేలవిసేలా విలపిస్తున్నాడు చంద్రశేఖర్ తండ్రి సీతారామయ్య. షాకైపోయాడు చంద్రశేఖర్. చనిపోయింది తండ్రి కాదు.. మరి తల్లా..?
తట్టుకోలేకపోయాడు ఆ ఆలోచనకే. ఒక్కక్షణంలో తెలియని . ఇప్పటికీ తనని చిన్నపిల్లాడిలా భావించి మాట్లాడే తల్లి...కన్నతల్లి..ఇకలేదు..కొండను ఢీ కొన్న అలలా చిధ్రమైంది మనసు." అమ్మా.." అంటూ అరిచాడు గుండె పగిలేలా..ఘొల్లుమన్నారు జనం చంద్రశేఖరాన్ని చూసి. ఒక్కసారిగా విషాదం విలయతాండవం చేసింది ఆ ప్రాంగణమంతా. అందరి కళ్ళల్లోనూ కన్నీరు.అందరూ ఒక్కసారిగా అనాధలైన తీరు..."అమ్మా.." అంటూ విలపిస్తూ వడివడిగా అడుగులేసాడు చంద్రశేఖర్ మిద్దెలా వున్న అరుగుమీదకి-
" నాయనా చంద్రం..నీ బ్రతుకు అన్యాయమై పోయిందిరా..అన్యాయం అయిపోయింది..వెళ్ళిపోయిందిరా..మనల్ని అన్యాయం చేసి..నాయనా..అయ్యో.." అంటూ విలపిస్తున్న 'తల్లి 'ని చూసి స్థాణువైపోయాడు చంద్రశేఖర్. అడుగుముందుకు పడలేదు. కాళ్ళ వద్దే వుంది శవం- అతి చేరువగా-
'అతనితో పాటు ఏడడుగులు నడిచిన కాళ్ళు...' ఇక నడవలేమంటూ అచేతనమై వున్నాయి. పెళ్ళి నాడు అతని కాలుని సుతిమెత్తగా స్పృశించిన ఆమె కుడికాలి బొటనవేలు, ఎడమకాలి బొటనవేలుతో బంధమై, ఈ జన్మబంధాన్ని తెంపుకుని నిశ్చలంగా వుంది. అర్ధాంగిగా అతని నిండు జీవితానికి పూర్తిగా అర్ధాన్ని యివ్వాల్సిన మనిషి...యిలా అర్ధాంతరంగా వెళ్ళిపోయింది మరలిరాని లోకాలకి -
ఊహించని ఉత్పాతం ఉప్పెనై ఆతని హృదయాన్ని ముంచెత్తింది. శోకసంధ్రమైన మనసులోని దు:ఖం తన తీరాన్ని దాటి కళ్ళను చేరుతుంది. కన్నీళ్ళు పొరలుపొరలుగా కళ్ళను కమ్ముతుండగా, అస్పష్టంగా చూసాడు చంద్రశేఖర్ భార్యవంక. నిర్మలంగా వుంది ఆమె మొహం...ఎప్పటిలానే -
"ఎంత అన్యాయం చేసావ్ శకుంతలా..? నీకేం ద్రోహం చేసానని ఇంత శిక్ష విధించావ్..? నువ్వు లేకుండా ఎలా బ్రతకాలి..? చెప్పు..శకుంతలా..చెప్పు..? ఎంత అన్యాయం చేసావ్ మమ్మల్నందర్ని..? " చంటిపిల్లాడిలా విలపిస్తున్నాడు చంద్రశేఖర్.
ఇప్పుడతను కోట్లకు పడగెత్తిన రారాజు కాడు.జీవితపు తోడు పోయి, జీవితాంతం గోడు మిగిలి, గుండె పగిలి రోదిస్తున్న..'అనాధ '-
"డాడీ..అమ్మను బ్రతికించండి డాడీ..అమ్మకావాలి డాడీ..అమ్మకావాలి.. అమ్మా.. అమ్మా..ఒక్కసారి చూడమ్మా..అమ్మా..ఒక్కసారి.." అంటూ అతడిని కౌగిలించుకుని విలపిస్తున్నారు పిల్లలు. హృదయవిదారకంగా విలపిస్తున్న కూతుర్నీ,కొడుకునీ తన గుండెలో పొదవికుంటూ...
" వెళ్ళిపోయింది తల్లీ..వెళ్ళిపోయిందిరా..మనల్ని మోసం చేసి మీ అమ్మ వెళ్ళిపోయిందిరా..శకుంతలా..ఎంత అన్యాయం చేసావ్.."బావురుమన్నాడు చంద్రశేఖర్ భార్య తల వద్ద కూలబడిపోయి.
అందరి హృదయాల్ని కలచివేసింది ఆతని దు:ఖం. ఆమె తాలుకూ అనుభూతులు. .వేదనలై..రోదనలై.. ప్రతిధ్వనించాయి అందరి గుండె లోతుల్లోంచి.
" ఊర్కో..శేఖర్..ఊర్కో..నువ్వుకూడా ఏమిటిలా..? చిన్నపిల్లడిలా ..? సముదాయిస్తున్న రాఘవ గొంతు పెగల్లేదు..శోకంతో నిండిపోయింది -
పిచ్చివాడిలా భార్యనే చూస్తుండిపోయాడు చంద్రశేఖర్. ఆమె స్మృతులు, అనుభూతులు అలలై ఎగసిపడుతున్నాయి అంతరంగాన-శోకసంద్రాన...!
" ఎన్నో నవ్వులు..ఎన్నో మాటలు..ఎన్నో సరదాలు..ఎన్నో సరసాలు..ఎన్నో కోపాలు..ఎన్నో తాపాలు..ఎన్నో సేవలు..మరెన్నో ఆశలు..అన్నీ నిండివున్నాయి తనలో, ఆమెతోటి -రాజహంస పాలునీ, నీళ్ళనీ వేరుచేసి పాలునే సేవించినట్లు, ఆమె సుఖదు:ఖాలనీ వేరుచేసి, తమకు సుఖాల్నే పంచింది..ఇప్పుడు సుఖంగా వెళ్ళిపోయింది..దు:ఖాన్ని మిగిల్చి..దూరం తెలియని తీరాలకు -ఎంతో ఖుషీగా వుండే మనిషి. విలాసాన్నంతా తన సొంతం చేసుకుని, విషాదాన్ని మిగిల్చింది తన వాళ్ళకి - "శకుంతలా..! నీ మనసులోని ఆర్తిని వినలేకపోయాను. నీ శరీరంలోని రోగాన్ని గమనించలేకపోయాను..అందుకు ఇంత శిక్ష విధించావా..? " రోదిస్తున్నాడు చంద్రశేఖర్ కుమిలిపోతూ -
" స్త్రీణాంచ చిత్తం పురుషస్య బాగ్యం..అన్నారు పెద్దలు. ఆమె వల్లనేనయ్యా మాకీ భోగభాగ్యాలూ-కీర్తి ప్రతిష్టలూ..అటు చూడండయ్యా...! కష్టం చేస్తేనే గాని పొద్దు గడవని ఈ కూలిజనం ఇవాళ పనికిపోకుండా యిలా విలపిస్తున్నారంటే..యిదేనయ్యా..ఆ తల్లి చేసుకున్న పుణ్యం.! డబ్బుంటే వస్తారా మనుషులు ? ఆళ్ళకు ఏం పంచిందయ్యా.. పిచ్చది..? తన మనసు తప్ప..దేవుడా ! యింతమంది ఉసురుపోసుకుంటావా ..? " విలపిస్తున్నారు సీతారమయ్యగారు చిన్నపిల్లాడిలా -
ఆ మాటలు విన్న చంద్రశేఖర్ తలతిప్పి చూసాడు తండ్రివైపు. పై కండువాని నోటికి అడ్డంగా పెట్టుకుని కుమిలిపోతున్నాడు తండ్రి. చుట్టూరా వూరిజనం..కూలి జనం.."అమ్మా..తల్లీ.." అంటూ రోదిస్తున్నారు. సొంత మనిషిని పోగొట్టుకున్నవారిలా - ఇంతమందికి ఎలా సన్నిహితురాలైంది ? విషాదం లోనూ వేధిస్తున్న ప్రశ్న అది..!
" నా కోడలు దేవతయ్యా..దేవత..! రైతన్నోళ్ళకి వ్యవసాయం లోనే సాయం చేసిందా ? ఊరికి రోడ్డు వచ్చే విషయం లోనే శ్రమించిందా ? సంఘం పెట్టించి ఆడోళ్ళకు మిషన్లు యిప్పించలా ? ఇంటికోసమే కాదయ్యా..ఊరికోసం తపించింది. పిచ్చిది..మంచి అన్న ప్రతిదాన్ని పోరుపెట్టి నేర్పింది. అది దేవతయ్యా..దేవత..! అందుకే దేవుడు తీసుకుపోయాడు...." చెబుతున్న సీతారామయ్య గారి గొంతు గాద్గదమైంది.
తండ్రి చెప్తున్న మాటలకు ఆశ్చర్యపోయాడు చంద్రశేఖర్. నమ్మలేకపోయాడు ఒక్కక్షణం. తన నీడలా వున్నమనిషి ఉనికినే గ్రహించలేకపోయిన మూర్ఖుడు తను...కడసారి ఆమెతో గడిపిన క్షణాలు గుర్తుకువచ్చాయి చంద్రశేఖరానికి. ఆరోజు శ్రీశైలం బయలుదేరుతున్నాడు. అతనీ లగేజ్ రడీ చేస్తుంది శకుంతల.
" ఏమండీ..ఈ కాంట్రాక్ట్ పూర్తైన తరువాత..మరో కాంట్రాక్ట్ కోసం ప్రయత్నించమాకండి.." అంది మెల్లగా నచ్చ చెబుతూ. " ఎందుకనీ ? " ప్రశ్నించాడు చంద్రశేఖర్.
" మీనాన్నగారి ఆరోగ్యం సరిగ్గా వుండటం లేదు..మీకుచెప్పాలంటేనే ఆయనకు యిబ్బందిగా వుంది. మీ సమక్షంలో ఎక్కువ టైం గడపాలని ఆయన ఆకాంక్ష. మీరు ఇంట్లో వుంటే ద్రైర్యం గానూ వుంటుంది, ఆనందం గానూ వుంటుంది. నాక్కూడా ఈ మధ్య తలంతా నెప్పిగా , తిరుగుతున్నట్లుగా వుంటుంది..ఎక్కడ పడిపోతాననే భయం.." చెప్పింది లాలనగా.
" అనవసరమైన ఆలోచనలు తలకెక్కించుకుని మనసు పాడుచేసుకోకు. మీకేం కాదులే. అవకాశాలు ఉన్నప్పుడు వినియోగించుకోకపోతే ఎట్లా..? మనకు కావాలన్నప్పుడు సంపాదించగలమా..? " సీరియస్ గా చెప్పాడు సమాధానం.
"అదేదో మీరు యిక్కడే వుండి సంపాదించవచ్చుగా..? "
" ఈ పల్లెటూర్లో ఏముంటుందే సంపాదించడానికి..మట్టితప్పా..?"చిరాకుపడ్డాడు భార్యమీద.భర్తకు కోపం వచ్చిందన్న సంగతి గ్రహించింది శకుంతల. బయలుదేరేముందు అతడ్ని చిరాకుపెట్టి పంపడం ఇష్టం లేదామెకు.
"అన్నిపనులూ సంపాదనతో ముడిపెట్టడం తప్పండి ఇంజీనీర్ గారు..డబ్బు సుఖాన్నిస్తుందేమో కానీ సంతోషాన్నివ్వదు..గ్రహించండి.." అంది అతని మూడ్ మార్చే ప్రయత్నం చేస్తూ..మరింత కోపం వచ్చింది చంద్రశేఖరానికి. అతను ఆమెలా మాటకారి కాదు.
"ఓహో..యిప్పుడు నువ్వు వ్యవసాయంతొ సంపాదించిన దానితోనే సంతోషిస్తున్నావన్నమాట..?
"నేను వ్యవసాయంలో ఆదాయాన్ని చూడటంలేదండి. నా చదువుతో నలుగురికి సవ్యమైన సాయం చేస్తున్నాను. అదే ఆనందం నాకు..ప్రేమగా..ఒక విత్తన్నాన్ని నాటి..అది మొక్కై పువ్వులు పూస్తుంటే.." ఉత్సాహంగా చెప్తున్న ఆమె మాటలను మధ్యలోనే తుంచేస్తూ..
" వెధవ న్యూసెన్స్...ఎప్పుడూ ఆ మట్టి కబుర్లే.." విసుకున్నాడు చిరాకుగా -బాధపడలేదు శకుంతల. భర్త నైజం పూర్తిగా తెలిసిన మనిషి..అందుకే
" సారీ.. అయ్యవార్కి కోపం వస్తే ఆపేస్తాను.." అంది చిలిపిగా ఆతని కళ్ళల్లోకి చూస్తూ "డబ్బు విలువ తెలిసి ఏడిస్తేగా.." ఉడుకున్నాడు ఆమె నవ్వుని చూసి.
" అయ్యా..! మహానుభావా...! మీరు ధనాశ్వం మీద స్వారీ చేసే రౌతులు..మేము మట్టితో కుస్తీ పట్టే రైతులం..మాగాణీల గురించి తప్ప ..ఏ కాణీల సంగతి మాకు తెలియదు.." అంది అతనికి దగ్గరగా వచ్చి నిలబడి, మూతిని తిప్పుతూ, నవ్వును దాచుకుంటూ..
మనుషులను కుట్టి హింసించే తెనేటీగలను సుమం ఆకర్షించినట్టు- ఆమె స్వచ్చమైన నవ్వు, దానిలో మకరందం లాంటి ప్రేమ, అతడి కోపాన్ని హరించింది.
" మాటలకేం తక్కువలేదు.." అన్నాడు ఆమెను బిగి కౌగిలిలో బంధిస్తూ..
"మీ చేష్టలకేం తక్కువా ? వదలండి.." అంది విడిపించుకోవాలనే ప్రయత్నాన్ని నటిస్తూ. ఆ ప్రయత్నం అతనికి మరింత ఆనందాన్నిచ్చింది. మనసు మరిన్ని మురిపాలను కోరుకుంది. ఆమెను మరింత గట్టిగా బందిస్తూ, అడిగాడు చంద్రశేఖర్ ప్రేమమీర.
"నీకేం కావాలో చెప్పు "
"నా మనసులోని కోరికను నేను చెప్పకుండానే, మీరు తెలుసుకోవడం కావాలి.."
"పిచ్చిమొద్దు ఎప్పుడూ మాటల్తోనే గెలుస్తావ్.." అంటూ హృదయానికి హత్తుకున్నాడు ప్రేమగా...
ఆ..క్షణం తెలియదు అతనికి..అవే కడసారి అనుభూతిని మిగిల్చే క్షణాలని -
******
కుమిలిపోతున్నాడు చంద్రశేఖర్ అందరికి దూరంగా వెళ్ళి నిలబడి-అనుభూతులు జడివానై వర్షిస్తున్నాయి అతని కళ్ళవెంట. జరగవలసిన పనులు జరిగిపోతున్నాయి కాలంతో పాటే-మంచితనంతో మెరిసి, అందరి మనసుల్లో మురిసి, సాయం సంధ్య అరుణకాంతిలో కలసి, ' చితి మంటల్లో స్మృతిగా మారిపోయింది శకుంతల ' -
******
భార్యా వియోగం చంద్రశేఖర్ జీవితంలో ఎంతో మార్పును తీసుకువచ్చింది. ఇప్పుడు మునుపటిలా అతనిలో సంపాదన మీద ధ్యాస లేదు.'తనవి ' అన్న వాటి మీద, తన వారి మీద 'తనివి 'తీరని ప్రేమను పెంచుకున్నాడు. తల్లితండ్రలకు సేవచేస్తూ, ఆ పల్లె జన జీవన వికాసానికి దోహదపడుతూ, మిగిలిన తన జీవితాన్ని సార్ధకం చేసుకోవాలను కున్నాడు.
.ఇంతకాలం ఆడంబరాల వలయం చుట్టూ తిరిగిన ఆతని అంతరంగం ఇప్పుడు ప్రేమానురాగాల నిలయమైంది. ఊరిప్రజల హృదయాల్లో కొలువైయ్యాడు కొండంత అండలా.
"మొదటిసారి వ్యవసాయంలోకి దిగి, రతనాలనూ, రాజనాలనూ పండించాడు మన చంద్రశేఖర్..ఆ హస్తవాసి అటువంటిది మరి.." అని మురిపెంగా చెబుతున్న ప్రజల మన్నలను, నిండుగా పండిన వరికంకుల్లో చూస్తున్నాడు చంద్రశేఖర్ పొలం గట్టున కూర్చుని..
'ధాన్యలక్ష్మి ' నిండు చూలాలై కనుచూపుమేర తన పొలాన్నంతా ఆక్రమించుకుని పరుండినట్లుగా వుంది..పంటను చూస్తుంటే..!ఆలోచిస్తున్నాడు చంద్రశేఖర్.
ఎంతోమంది తనలా. మనిషి బ్రతికివుండగా వారి ఉనికిని గ్రహించక, చేజారిన తరువాత విలపిస్తారు జీవితాంతం. 'వస్తువైనా మనిషైనా బ్రతికివుండగా భధ్రంగా చూసుకునే వారు ఎంత అదృష్టవంతులు ? "వస్తువులో కూడా ప్రాణాల్ని చూడగలుగుతున్నాడిప్పుడు చంద్రశేఖర్.
తనలో కలిగిన మార్పుని చూసి " శకుంతల " ఎంతో పొంగిపోయేది. పిచ్చిది..జీవితాన్ని ఎంతగా ప్రేమించింది ? అందరి ప్రేమను జీవితంగా మార్చుకుంది. కానీ, జీవితాంతం తోడుగా వుండాల్సిన మనిషిని మాత్రం జీవించివుండగా మర్చలేకపోయింది. ఆమె బ్రతికివుండగా తనకీ గ్రహించే స్థితిలేదు. తననీ స్థితిలో చూడాలని తపించిన మనిషి యిప్పుడు బ్రతికిలేదు.' వియోగంలోనే యోగం వుంది...' హృదయమంతా శకుంతల రూపంతో నిండివుంది.
మలయమారుతం యొక్క పిల్లతెమ్మెర అల్లరికి లయబద్ధంగా వూగుతున్నాయి వరికంకులు. ఆ వరికంకుల సుతిమెత్తని సవ్వడిలో తన భార్య శకుంతల
" గుండె చప్పుళ్ళ " ను వింటున్నాడు చంద్రశేఖర్, ఆమె ఙ్ఞాపకాలతో మమేకమైపోయి......
******
( స్వాతి వార పత్రిక 14.9.2001 )