గీతార్ధసారం
!!
మానవుడు
ఎంత దుర్భలుడు ? సర్వావయవములు సమన్వయంగా పనిచేస్తుంటే, తాను సర్వేశ్వరుడననే గర్వం ! ఇక వాటిలో ఏ ఒక్క అవయవమైనా, తన విధిని విడనాడితే తాను సర్వం కోల్పోయాననే దైన్యం !!
అర్ధమవసాగింది శ్రీపతిరావుకి జీవితం యొక్క పరమార్ధం. ఆలోచిస్తున్నాడు హాస్పటల బెడ్ మీద పరుండి - శరీరంలోని అవయవల్లానే... కుటుంబంలోని వ్యక్తులు, వారితో సంబందాలు, వారి విధులూ, సంఘంలోనివ్యక్తులూ - వారి వృత్తులూ. ఎవరి సహకారం లోపించినా, గమనం గతి తప్పుతుంది.
తాము కష్టపడి పనిచేసి పరిశ్రమకు లాభాలను ఆర్జించి పెట్టామని కార్మికులు, బోనస్ పెంచమని కోరితే, తన పెట్టుబడితోనూ, పలుకుబడితోనూ, లాభాలను పొందాననే అహంతో వారి కోరికను మన్నించలేదు శ్రీపతిరావు. అది చిలికి చిలికి గాలివాన అయినట్లుగా, కార్మికుల కోరిక స్ట్రెంగ్త్ పెరిగి స్ట్రైక్ గా మారింది. ఇప్పుడు లాకౌట్ ప్రకటించాల్సిన పరిస్థితులలో వుంది. అయినప్పటికీ శ్రీపతిరావు అహం ఆనందించిందేగానీ, మనసు ఆలోచించలేదు. ఆరోగ్యం మాత్రం చెడింది.
హార్ట్ ఎటాక్ వచ్చి హాస్పటల్లో జాయిన్ అయినా అమెరికా, కెనడా దేశాలనుంచి వచ్చి చూసేందుకు తన ఇద్దరి కొడుకులకు తీరికలేదు. అతి కష్టం మీద ఎలాగొలా తీరిక చేసుకోవాలంటే నష్టం తప్ప లాభం లేదు. సూపర్ స్పెషాలిటీ హాస్పటల్లో వి.వి.ఐ.పి. ట్రీట్మెంట్ పొందుతున్న శ్రీపతిరావు, ధనంతో అనారోగ్యాన్ని నివారించగలిగాడే కానీ, అనుబంధాన్ని మాత్రం పొందలేకపోయాడు.
*****
ఆ రోజే శ్రీపతిరావు హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్నాడు. బాల్య స్నేహితుడు సీతా రామారావు దగ్గరే వుండి ప్రత్యేకమైన శ్రద్దతో, అన్ని విషయాలు చూస్తున్నాడు. హాస్పటల్ గుమ్మందాటి ఆవరణలోకి వచ్చిన శ్రీపతిరావు కళ్ళముందు కనిపిస్తున్న నిజాన్ని చూసి నమ్మలేకపోయాడు. తనతో వాదించి, విభేదించి... తనని హాస్పటల్ పాలుచేసిన కార్మికులు... తన శక్తితో ఎవరినైతే అణచివేయాలని తపిస్తున్నాడో ఆ కార్మికులు... తన కళ్ళెదుట ? విషాద వదనాలతో, కన్నీళ్ళ ప్రవాహంతో, మండుటెండను సైతం సహిస్తూ, పసిబిడ్డలతో సహా, తనని చూసేందుకు వేచివున్నారు.
"బాబుగారూ..."
ఘొల్లుమన్నారందరూ
ఒక్కసారిగా శ్రీపతిరావుని చూసి.
ఎంతో దర్పంగా, ఆడంబరంగా వుండే శ్రీపతిరావునే చూశారు ఇంతకాలం. ఇలా దైన్యంతో చూసే సరికి వారి హృదయాల్లో తెలియనంత బాధ సుళ్ళు తిరిగిపోయింది. వారి దు:ఖాన్ని చూసిన శ్రీపతిరావు హృదయం కూడా చలించింది.
" మమ్మల్ని
క్షమించండి... మా వల్లనే మీకిన్ని కష్టాలొచ్చాయి " ఘొల్లుమని విలపించాడు కార్మిక నాయకుడు రాఘవ.
" మీ ఉప్పు తిని మీ మీదే కత్తి కట్టినాం... మేము దుర్మార్గులం బాబు...దుర్మార్గులం..." భోరుమని విలపించాడు యాదయ్య. అతను శ్రీపతిరావు వద్ద ఎంతో కాలంగా పనిచేస్తున్నాడు. ఇలాంటి స్థితిలో ఎన్నడూ చూడలేదు యజమానిని.
" ఊర్కో...
రాఘవా ! యాదయ్యా ! ఊర్కోండి ! మీ అందరి దయవల్ల నేను బాగానే వున్నానుగా ? కూల్ డౌన్..కూల్ డౌన్.." మమత నిండిన గుండెతో ఓదారుస్తున్నాడు శ్రీపతిరావు కన్నతండ్రిలా. అక్కడ గుమిగూడివున్న కార్మికుల బాధ మరింత పెరిగింది యజమాని ప్రేమార్తికి.
" ఇంతమంది హృదయాల్లో కొలువై వున్న మీ సారుకి ఏం కాదు. పదండి... భగవంతుడు కూడా మిమ్మల్నుంచి ఆయన్ని వేరుచెయ్యలేడు..." కారు వద్దకు దారి తీసూ చెప్పాడు సీతారామారావు.
రెండు చేతులతో వారందరికీ నమస్కరిస్తూ మెల్లగా కారు ఎక్కాడు శ్రీపతిరావు. అశ్రునయనాలతో, చెమర్చిన హృదయాలతో వీడ్కోలు పలికారు కార్మికులంతా. కారు కదిలింది మెల్లగా.
" సీతా ! ఏమిటిరా ఇదంతా ? నమ్మలేకుండా వున్నాను..." ఆశ్చర్యం నిండింది శ్రీపతిరావు స్వరంలో.
" దిసీజ్ క్వైట్ నేచురల్ శ్రీపతి ! సుఖాలు మనుషుల్ని దూరం చేస్తాయి. కష్టాలు దరికి చేరుస్తాయి. నువ్వు మామూలు మనిషిగా వున్నంతవరకూ, వాళ్ళు తమ డిమాండుని సాధించుకునేందుకు నీతో పోరాడే యోధులయ్యారు. నువ్వు హాస్పటలైజ్ అయ్యావని తెలిసిన మరుక్షణం సర్వం కోల్పోయిన అనాధలయ్యారు ..." వివరించాడు సీతారామారావు కార్మికుల మానసికస్థితిని.
" మరి
ఫ్యాక్టరీ, స్ట్రైక్, లాకౌట్...? " సందేహంతో ఆగిపోయాడు శ్రీపతిరావు.
"ఎప్పుడైతే
నువ్వు హాస్పటల్లో చావు బతుకుల మద్య ఊగిసలాడుతున్నావని తెలుసుకున్నారో, అప్పుడే వారిలో మథనం ప్రారంభమైంది. వాళ్ళ వల్లనే నీకు ఇంతటి కష్టం వచ్చిందని, ఆ పాపం వారిదేనని విలపించి, తమ కోరికను త్యాగం చేసి యథాప్రకారంగా మరలా పనుల్లోకి వచ్చారు..." వివరంగా చెప్పాడు సీతారామారావు.
వింటున్న శ్రీపతిరావుకి తన మనసుని ఎవరో మెలిపెడుతున్నట్టుగా అనిపించింది. రక్త్తం పంచుకుని పుట్టిన కొడుకులు ఇలాంటి సమయంలోనే రాలేకపోతే మరి ఎప్పుడొస్తారు ? తన భార్య చనిపోయినప్పుడు కూడా పెద్దకొడుకు రాలేదు. తల్లికి తలకొరివి పెట్టే బాధ్యత చిన్నకొడుక్కి వుంది కాబట్టి వాడైనా వచ్చివుంటాడు. డాలర్స్ కి తప్పా మమ్మీ,డాడీలకు విలువలేని దేశంలో జీవనం గడుపుతున్నవారు, అంతకుమించి ఎలా స్పందిస్తారు ?
న్యాయమైన కోర్కెను సైతం త్యజించి, తమ ఆశల్నీ, ఆనందాలనీ త్యాగంచేసి , మరలా పనిలోకి వచ్చి చేరారంటే...ఎవరు వీళ్ళు ? వీరికీ, తనకు మద్యగల సంబంధమేమిటీ ? తన సంపద తన మిత్రునికి ఏనాడూ సహాయపడకున్నా, బాద్యతగల ప్రభుత్వోద్యోగంలో వుండీ, తన సేవలో నిమగ్నమయ్యాడంటే...ఈ సీతారామారావుకీ, తనకూ మద్యగల అనుబంధమేమిటీ ? స్నేహబంధం కాకుండా -' ఆలోచిస్తూనే వెనక్కివాలాడు శ్రీపతిరావు.
*****
సీతా ! నీలాగ సంతోషంగా వుండాలంటే ఏం చెయ్యాలిరా ? " ప్రశ్నించాడు శ్రీపతిరావు దీక్షగా తన ముక్కల్ని చూస్తున్న సీతారామారావుని.
" త్యాగం చెయ్యాలి...ఇదిగో ఇలాంటివాటిని... " ఆఠీన్ రాణిని విసిరేస్తూ చెప్పాడు సీతారామారావు.
"త్యాగం చెయ్యాల్సింది డబ్బుల్నా ?" మరలా ప్రశ్నించాడు శ్రీపతి శాంతంగా.
"దాంతో పాటు చాలా వాటిల్ని... అనుబంధాల్ని... ఆప్యాయతల్నీ... మొహాల్నీ... మోసాల్ని... ఆశల్నీ... ఇటువంటి ఆసుల్నీ..." ఇస్పేట్ ఆసుని డిస్ కార్డ్ చేస్తూ చిన్నగా నవ్వుతూ చెప్పాడు.
"వీటినన్నింటిని
నువ్వు వదిలేశావా ?" అదే ముక్కని తీసుకుంటూ అడిగాడు శ్రీపతిరావు.
"వదిలి పెట్టాల్సిన భాధేలేకుండా అసలు పెంచుకోలేదు వేటినీ కూడా... పెంచుకుంటే పెరిగేది కౌంటే... అది పి.సి గానీ, బి.పి గానీ...నాది షో ..." అన్నాడు సీతారామారావు ముక్కని మూస్తూ.
"నీలాగా ఒక సీక్వెన్సూ..రెండు జోకర్ల ఆట కాదురా నాది... ఏ.సి.. డి.సి..." చెప్పాడు శ్రీపతిరావు సీతా రామారావు జీవితంతో తన పేకముక్కల్ని పోలుస్తూ.
" అందుకే కదరా నీకు కౌంటో... ఎమౌంటో తగుల్తావుంటాయి " చెప్పాడు సరసంగా.
" ఇది నిజమే " మనస్పూర్తిగా ఒప్పుకున్నాడు శ్రీపతిరావు గొల్లుమని నవ్వుతూ -
ఎంతో హాయిగా వుంది శ్రీపతిరావుకి ఆ సంభాషణ. ఓర్వలేని మనసు శ్రీపతిరావుకి కొడుకుల సంగతిని గుర్తుచేసింది ఆసమయంలో.
" సీతా ! వీళ్ళు నిజంగా కొడుకులే నంటావా ? " ప్రశ్నించాడు ధీర్ఘంగా ఆలోచిస్తూ. పంచిన పేకముక్కల్ని ఎత్తుకోలేదు శ్రీపతిరావు . అతని మూడ్ అర్ధమైంది సీతారామారావుకి.
" శ్రీపతి డోంట్ ఫీల్..జనరేషన్ పూర్తిగా మారిపోయింది. దానికి తగ్గట్టుగా మనమూ మారాలి..."
"వాట్స్ ద బ్లడీ జనరేషన్ ? జనరేషన్ మారిందని ఆడవాళ్ళు నవమాసాలు మోయటం మానివేశారా ? తల్లితండ్రులు పిల్లల బాగోగులు చూడటం మానివేశారా ? వాళ్ళలాగే మనం కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తించివుంటే, ఇవాళ ఇటువంటి పరిస్థితులు వుండేవా ? " ఆవేశం కట్టలు తెంచుకునే ప్రయత్నం చేస్తుంది శ్రీపతిరావు గుండెలో -
" నిదానంగా
ఆలోచించు శ్రీపతి ! తాము కన్నవాళ్ళు తమని వృద్ధాప్యంలో చూస్తారో ? లేదో ? అన్న సంశయం కనుక కలిగితే, ఏ తల్లితండ్రులైనా ప్రాణమిచ్చి ప్రేమగా పెంచగలరా పిల్లల్నీ ?" ప్రశ్నించాడు సీతారామారావు ప్రశాంతంగా.
" ఈ ప్రశంకు సమాధానం చెప్పాల్సింది నువ్వు చెప్పే జనరేషన్ " విసుగ్గా చెప్పాడు శ్రీపతిరావు.
" నిజమే శ్రీపతి! నేను చెప్పేదేమిటంటే ఇవాళ ప్రతిఫలాపేక్షలేని జీవే...చిరంజీవి. మనం పంచి ఇచ్చే దేనినుంచైనా, ప్రతిఫలం ఆశించకపోవటం ఉత్తమ లక్షణం " చెప్పాడు సీతారామారావు కూలుగా.
" ఏమిటిరా ఆశించకూడనిది ? చావుబతుకుల్లో ఉన్నప్పుడు కన్నకొడుకుల్ని చూడాలనుకోవడం, వారి సమక్షంలో గడపాలనుకోవడం...ఆపేక్ష అవుతుంది గానీ, ప్రతిఫలాపేక్ష ఎలా అవుతుందిరా ? వారి పిల్లలు ఇటువంటి స్థితిలో వుంటే పరుగులు పెట్టిరారూ ? ఈ వయసూలోనూ మనం పరుగులుపెట్టి పోమూ " చెప్పాడు శ్రీపతిరావు శూన్యంలోకి చూస్తూ.
" అదేరా నేనూ చెప్పేది. తండ్రి బాధ్యతే అలా పరుగులు పెట్టిస్తుంది..." అన్నాడు సీతారామారావు.
" వృద్ధాప్యం
కూడా బాల్యం లాంటిదే కదరా ? మరో మనిషి ఆసరా అవసరం కాదా ? వారికోసం తపించి వారి మంచిస్థితిని అందించి వారు సంపాదనలో ఉన్నతమైన స్థితిలో వుండేలా చేయగలిగానే కానీ, సంస్కారంలో ఉన్నతుల్ని చేయలేకపోయాను " తీవ్రమైన నైరాశ్యం శ్రీపతిరావు మాటల్లో ధవినించి కన్నుల్లో తడిలా కనిపించింది. గుండెల్లో బాధ కవ్వంలా చిలుకుతుంటే వెన్నలా వస్తుందా విలాసం ?
శ్రీపతిరావు మానసిక ఆందోళన అర్ధంకానిదేమెకాదు సీతారామారావుకి.
"శ్రీపతీ! ఋణానుబంధంతో సంతానం ప్రాణానుబంధంతో సంతోషసంతాపాలు పుడతాయి. ఏదీ మనం ఊహించైంది కాబోదు. జరిగిన దాన్ని స్వీకరించడం, జరుగబోయేదాన్ని స్వాగతించడం మన విధి..." ఉపశమనంగా చెప్పాడు.
సీతారామారావు మటులు కొంత ప్ రశాంతతను అందించాయి శ్రీపతిరావుకి.
అది గమనించి మరలా చెప్పాడు సీతారామావు " ఇప్పుడు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా వుండు " చెబుతూఒ శ్రీపతిరావు చెయ్యి నొక్కాడు అనునయంగా స్పృశిస్తూ-
"ఎక్కడుందిరా
ప్రశాంతత ? డబ్బులతో కొనగలమా దాన్ని?" ప్రశ్నించాడు వెంటనే.
" ప్రశాంతతకు
అడ్రస్సు మన మనసేరా ! దానికున్న మహత్తు ఏమిటో తెలుసా ? దేన్ని మనం గాఢంగా కోరుకుంటామో దాన్నే పొందమని ప్రోత్సహిస్తుంది, దాన్నే అందిస్తుంది. నువ్వు ఒక మనిషిపై ప్రేమను పెంచుకుంటే ప్రేమించమంటుంది. ద్వేషాన్ని పెంచుకుంటే వార్ని దహించమంటుంది... వైదికుడు కోరే యోగమైన వైశికుడు కోరే భోగమైనా అందించే సరస్సు ఈ మనసు. అందుకే దాన్ని మానస సరోవరం అంటారు. ఇప్పుడు నీ మానస సరోవరంలో ఎటువంటి కలతల కెరటాలు ఎగసిపడకుండా, కల్లోల అలలు చెలరేగకుండా నిన్ను ప్రశాంతంగా వుంచే శక్తి కావాలి ! ఆ శక్తి నీ బాధకు ఉపశమనాన్ని అందించి. నీకు సేద తీర్చాలి. అలాంటి శక్తి ఆ గీతకే వుంది. ఎస్...ఇప్పుడు నీకు ఆ గీతే కావాలి..." తర్కించుకుంటూ చెప్పాడు చివరి వాక్యాన్ని సీతారామారావు.
" గీతా ? గీత ఎవరూ ? " ఆశ్చయంగా అడిగాడు శ్రీపతిరావు. కుతూహలమూ వుంది అందులో-
" ఎవరో ? ఏమిటో ? తొందరెందుకూ ? వీలైతే రేపే పరిచయం చేస్తా ! ఇక నాతోడు కూడా వద్దంటావు..." నర్మగర్భంగా చెప్పాడు సీతారామారావు చివరిమాటని.
సిగ్గుతో చిరునవ్వులు చిందిస్తున్న శ్రీపతిరావుకి కరచాలనం చేసి కదిలాడు సీతారామారావు.
" ఎవరీ గీత ?? " అన్న తీవ్రమైన అలోచనలో నిమగ్నమైపోయాడు శ్రీపతిరావు.
******
"ఏమిటిది?
అడిగాడు శ్రీపతిరావు సీతారామారావు తన చేతిలో పెట్టిన పేకెట్ని చూసి. అది గిఫ్ట్ పేపర్తో అందమైన రిబ్బన్ క్లాత్ తో నీట్గా ప్యాక్ చేయబడివుంది.
" ఇట్సే
గిఫ్ట్ ఫ్రం మీ. ఓపెన్ ఇట్ " చెప్పాడు సీతారామారావు సీరియస్ గా చూస్తూ.
చిరునవ్వుతో
మెల్లగా ఓపెన్ చేస్తున్నాడు శ్రీపతిరావు ఆ గిఫ్ట్ ప్యాక్ ని. పేపర్ని తొలగించి చూసిన శ్రీపతిరావు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. భగవద్గీత గ్రంధమది.
" గీత
అంటే భగవద్గీతా ? " మనసులోనే
నవ్వుకున్నాడుగానీ,
సిగ్గు తొంగిచూసింది మోముపైకి.
ఇవేమీ
గమనించనట్లే చెప్పసాగాడు సీతారామారావు " శ్రీపతీ జీవితంలో ప్రశాంతత సంపాదనలోనో, స్వాంతన వచనాలలోనో లేడురా. అది మనసులోనే వుంది. అది లైబ్రరీ లాంటిది. కావలసిన రసం అందులో లభ్యమౌతుంది మనకు" తన
మాటలు ఆలకిస్తున్నాడో లేదో గమనిస్తూ మరలా చెప్పసాగాడు సీతారామారావు.
" ఇంట్రెష్టుని
బట్టి బుక్ రీడింగ్ ఇన్సైట్మెంట్ని బట్టి మైండ్ ఫీలింగ్స్ ఉంటాయి. మన మనసు అందాలను కోరుతున్నా, మన వయసుకి కావలసిన సుగంధం ఈ గ్రంధం. పుస్తకాన్ని మించిన మిత్రుడు లేడంటారు. ఈ
గ్రంధాన్ని మించిన దేవుడు లేడంటాన్నేను. ఈ గీతను చదువు. ప్రశాంతతకే కాదు జీవిత పరమార్ధం తెలుస్తుంది."
" ఇవాళ
అర్ధమే జీవిత పరమార్ధం రా. ఆ విషయం బాగానే అర్ధమైంది. " చెప్పాడు శ్రీపతిరావు కొంచెం బాధగా.
" శ్రీపతీ!
పంచుకొన్న కొలదీ పెరిగేది ప్రేమ ఒక్కటే ! ఆ ప్రేమ మనం కన్న సంతానానికే పరిమితం కానర్ఖర్లేదు...గ్రహించు...ఈ గీతను నీ మనసులోకి తీసుకో, కర్తవ్యాన్ని అదే నిర్ధేశిస్తుంది. ఆఫీసుకు టైము అవుతోంది. మరలా కలుస్తా...హేవ్ ఏ నైస్ టైం విత్
గీత...గుడ్ బై...శెలవ్ తీసుకుని వెళ్ళిపోయాడు సీతారామారావు.
చేతిలో
వున్న పుస్తకాన్ని తదేకంగా చూస్తున్నాడు శ్రీపతిరావు.
* * *
అనాడు
కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణభవగానుని గీతాబోధన అర్జునునికి ఎంత శక్తినిచ్చిందో తెలియదు కానీ, శ్రీపతిరావు మనసుకు శక్తినే కాదు, ఆలోచనలకు కొత్త స్పూర్తినీ అందించింది. జీవితానికి
నిర్వచనం తెలుసుకోసాగాడు శ్రీపతిరావు గీతాసారంతో. ఒకప్పటి భౌతిక విషయాలమీద వున్న వాంఛ, ఇప్పుడు జ్ఞానసముపార్జన మీదకు మళ్ళింది. ఆలోచిస్తున్నాడు శ్రీపతిరావు కనులుమూసుకుని. ఖర్మల తాలూకు మర్మం తెలియవస్తుందిప్పుడు.
తన
రక్తాన్ని చెమటగా మార్చి ఎవరి వున్నతికోసం శ్రమించాడో, వారు తను తనువు చాలించే పరిస్థితులలో తోడు వుంటారనే ఆశ లేదు. కోట్లు సంపాదించినా, నోట్లు తోడున్నా, ఎవరూ లేని అనాధ తను. రిక్షా తొక్కేవానికైనా ఇంటి చుట్టూ వుంటారు రక్తం పంచుకుపుట్టిన వాళ్ళు. కాయకష్టం చేసెవానికైనా అందుబాటులో ఉంటారు కావలసినవాళ్ళు. తనకు
సంపదతోపాటే పెరిగింది దూరం అయినవాళ్ళతో సంబంధం. ఈరోజు తన ఇంటికి వఛ్ఛే బంధువు లేడు. తను చస్తే కొడుకులు వస్తారో? రారో ?? తెలియదు. ఎందరి బతుకుల్ని చిద్రం చేసిన పాపమో? ఈ ఒంటరి బతుకు శాపం!!
తన
బాగుకోసం తనలాగా శ్రమించిన కార్మికుల శ్రమను సంపదగా మార్చుకుని, అందలమెక్కాడుగానీ, తన పిల్లల్లాంటివారని భావించి వారి ఉన్నతికోసం ఉపయోగపడే ప్రయత్నమే చేయలేదు. విత్తనమేలేని చోట మెక్కెలా మొలుస్తుంది ? అసలు
ఆలోచనే లేదు. మరి ప్రయత్నం ఎలా జరుగుతుంది ? వందమంది కార్మికుల కళ్ళల్లో మెరిసే కాంతిని, మొములో విరిసే ఆనందాన్ని చూదలేని ధ్రుతరాష్ట్రుడు తను. అహంతో, అశాంతితో అనారోగ్యం పాలైన దుష్టుదు తను.
మంచితనం
మరిచి, ధనభలంతో మురిసి ఇవాళ మరొకరి ప్రేమ దయాభిక్షను పొందిన ముష్టివాడు తను. చేసిన తప్పు కార్చిచ్చులా మారి శ్రీపతిరావు అహంకారపు ఇనుపగోదలను కరిగించివేస్తోంది. వ్యధ త్రీవమైపోయి అతనిని కదిపి కుదిపివేస్తొంది. నిజానికి
వ్యధలోనుంచే మరుపు తిరుగుతాయి ఎవరి కధలైనా ! మరి శ్రీపతిరావు కధ ఏ మలుపు తిరగనుందో ? ఏమో ??
* * *
" యద్యదాచరతి శ్రేష్ఠ
స్తత్తదేవేతరో జన:
స
యత్ర్ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే "
" మహనీయులైన
వ్యక్తి ఏ కార్యములు చేయునో, వానిని సామాన్యులు కూడా అనుసరింతురు. ఆదర్శప్రాయములైన కార్యములచే అతడు ఏ ప్రమాణములను స్వీకరించినో, ప్రపంచమంతయు కూడా వానినే అనుసరించును."
శ్రీపతిరావు
మనసంతా నిండిపోయిందీ శ్లోకం. ఇప్పటివరకూ తనకున్న క్లేశమంతా మాయమైంది. భవితవ్యం గోచరించింది. 'భగవద్గీత’ లోని జీవనసారాన్ని గ్రహించిన శ్రీపతిరావు తన శేష జీవితాన్ని మధురసంగా, ప్రేమసాగరంగా మార్చుకున్నాడు.
ధర్మార్ధ
కామ మొక్షాలలో మొదటి మూడింటిని చవిచూసిన శ్రీపతిరావు చివరి మోక్షం కోసం పరితపిస్తున్నాడిప్పుడు. తను సంపాదించిన యావదాస్థిని తన కార్మికుల శ్రేయస్సుకోసం వినియోగించ నిశ్చయించుకున్నాడు. తన భార్య పేరున " శాంతా ఛారిటబుల్ ట్రష్ట్ ' స్థాపించి దానికి చైర్మన్ గా సీతారామారావుని నియమించాడు.
తన
ఫ్యాక్టరీకి కాస్తంత దూరంలో తన కార్మికుల కోసం అన్ని వసతులతో, ప్రశాంతమైన కాలనీ నిర్మించాడు. ఆ కాలనీకి సమీపంలోనే ఒక వైపు స్కూలు, కాలేజీ మరోవైపు హాస్పిటల్ కట్టించాడు. అన్నివర్గాల పేదవారికి ఉచిత విద్యా, వైద్య సదుపాయాలు ఏర్పాటుకావించాడు.
*
* *
కార్మికులు,
వారి కుటుంబసభ్యులు, వారి బంధుమిత్రుల ఆనందహేలల మద్య శాంతా ఛారిటబుల్ ట్రష్ట్ ప్రధమ
వార్షికోత్సవం జరుపుకుంటోంది. సీతారామారావు ఈసంవత్సరకాలంలో ట్రష్ట్ సాధించిన ప్రగతిని భవిష్యత్
కాలంలో సాధించవలసిన ప్రగతి ప్రణాళికలను వివరించి,శ్రీపతిరావుగురించి తన మనసులోని మాటలను చెప్పసాగాడు.
" దేశంలో
ఎంతోమంది వందలకోట్లు సంపాదించినవారున్నారు. ఎంతమంది శ్రీపతిరావుగారిలా గొప్పగా ఆలోచించి తమ సంపదను సమాజ శ్రేయస్సుకు వినియోగిస్తున్నారు? ఒక వందమంది శ్రీమంతులు శ్రీపతిరావుగారిలా ఆలోచించి త్యాగనిరతితో ముందుకు వస్తే, వందకోట్ల జనాభా కలిగిన మనదేశాన్ని ప్రపంచ విజయ శిఖరాగ్రాన, మహోన్నతమైన స్థానాన నిలబెట్టవచ్చు. ప్రతిమనిషి తమ విభవము కొలది త్యాగానికి పూనుకుంటే, మనదేశం మరలా శ్రీకృష్ణదేవరాయల నాటి కాలాన్ని పూర్వవైభవాన్ని సంతరించుకోవచ్చు "
సీతారామారావు
మాటలని ఎంతో శ్రద్ధగా వింటున్నారున్నారందరూ.
గొంతు
సవరించుకుని మరలా మాట్లాడసాగాడు సీతారామారావు.
" ఇంతమంది సంతోషానికి, ఆనందానికి హేతువు శ్రీపతిరావుగారు. నా దృష్టిలో ఇప్పుడాయన ధనవంతుడు కాదు... భగవంతుడు." అంటూ తన ఉపన్యాసాన్ని ముగించాడు.
కార్మికుల
చప్పట్లతోటి, కేరింతలతోటి హోరెత్తిపోతుంది ఆ ప్రాంగణమంతా. నింగినంటే ఆ శబ్ధతరంగాలు మనసుని ఏవో తీరాలకు కొనిపోతుండగా, నిశ్శబ్ధంగా వచ్చి నిలుచున్నాడు శ్రీపతిరావు మైక్ ముందు.
అప్పటివరకు
ఆనంద కేరింతలతో తుళ్ళుతున్న జనం ఒక్కసారిగా నిశ్శబ్ధ బద్దులైపోయారు. చిన్నపిల్లల నుంచి పండుముదసలి వరకూ అమితమైన భక్తి శ్రద్ధలతో మౌనంగా లేచి నిలుచున్నారు. అందరి చెవులు ఆయన పలుకు మీదే...అందరి కళ్ళు ఆయన రూపం మీదే... అందరి మొహాల్లోనూ దైవాన్ని చూస్తున్నామన్న్న భావనే. వారి హృదయాలలో తన స్థానాన్ని స్పస్టంగా చూసున్నాడు శ్రీపతిరావు. ఆయన నయనాలు ఆనందభాష్పాలకు నిలయమౌతుండగా, గొంతు పలికింది గాద్గికంగా.
" అందరికీ వందనం. అంబరమంటిన సంబరంతో నేడు జరుపుకుంటున్న ఈ వార్షికోత్సవ సభలో పాల్గొనే భాగ్యం కలిగినందుకు నేనెంతో ధన్యుడిని. మనసు విప్పి మీతో నాలుగు మాటలు చెప్పాలని మీ ముందుకొచ్చాను. ధనం మీద వ్యామోహంతోనో, గొప్పకోసమో మనవాళ్ళు విదేశాల వైపు పరుగులుతీస్తున్నారు. ఈ పరుగుపందెంలో తనవారిని, వారిపట్లప్రేమాదరణలను,ఆప్యాతానుబంధాలను వదిలేస్తున్నారు. దేనికోసం విదేశాలకు వెళ్ళారో, అది లభ్యమైన తరువాత వాళ్ళు తిరిగి స్వదేశానికి వస్తున్నారా ? లేదు...! మీరు సంపాదించిన సంపదతో పెట్టుబడులను పెట్టండి...దేశాభివృద్ధిలో మీరూ భాగస్వాములుకండి...అని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పెట్టుకున్న మొరను ఎంతమంది ఆలకించారు ? ఎంతమంది స్పందించారు ??
ఉన్నత
సంపన్న కుటుంబాలలో పుట్టి దేశవిదేశాలలో ఉన్నత విద్యనభ్యసించి, స్వదేశానికే తిరిగివచ్చి దేశ స్వాత్రంత్ర్యం కోసం తమజీవితాలను త్యాగం చేసిన గాంధిజీ, నెహ్రుజీల ఆదర్శం ఈనాటి యువతలో ఎంతవుంది ? ఎందుకు తమలో లేదో యువతరమే జవాబుచెప్పాలి.
చెప్పడం
ఆపి అందరి వైపు తన చూపు సారించాడు శ్రీపతిరావు.
అందరూ
భక్తిభావంతో ఆయన్నే చూస్తున్నారు. సంతృప్తిగా ఊపిరి తీసుకుని మరలా చెప్పసాగాడు.
" మరో
ముఖ్య విషయం మీకు చెప్పాలి ... లాకౌట్ లేని ఫ్యాక్టరీలు, కంపెనీలు, వాకౌట్ లేని శాసనసభలు, పార్లమెంట్ మనలాంటి దేశాలకు చాలా అవసరం. మనం దిగుమతి చేసుకోవాల్సింది సరుకులను కాదు, సామాజిక విలువలను... మనకంటే అధిక జనాభా కలిగిన చైనా ఈనాడు అంతర్జాతీయంగా అగ్రదేశాలతో అన్ని విషయాల్లోనూ సమవుజ్జీ అవుతుంది ఎందుచేత ? కార్మికులు తమ డిమాండ్లు సాధించడం కోసం తమ కడుపులను నింపే కంపెనికి లాకౌట్ ప్రకటించరు. పైగా మౌనంగా మామూలుగా కంటే ఎక్కువ శ్రమించి అధికోత్పత్తిని ఇస్తారు. తద్వారా తమ యజమానిని ఆలోచింపజేస్తారు. అదీ మౌనపోరాటమంటే !
వింటున్న
వారి హృదయాల్లోని అంతర్మధనం వారి మొహాల్లో తొంగిచూస్తుంది.
" ఇలా
ఎన్ని దేశాల్లో జరుగుతుంది ? మనడేశంలో ఏంజరుగుతుంది ? ఆలోచించండి...తెలిసో తెలియకో మీరూ అటువంటి బాటలోనే నడిచారు. కానీ మీరు నడిచింది మీ హక్కుల సాధన కోసం కాదు... మీ మానవత్వ నివేదన కోసం...అలా నాకు జ్ణానోదయం కలిగించారు. దాని ఫలితమే...ఈ సంబరం...ఈ వైభవం. చివరిగా... నాకు ఆప్తుడు, మార్గ నిర్దేశకుడు, బాల్యస్నేహితుడు అయిన శ్రీసీతారామారావుగారు నాకు మానసిక ప్రశాంతను అందిస్తుందని భగవద్గీతను బహుమతిగా ఇచ్చారు. అత్యంత శ్రద్ధతో చదివాను. నేను ఆకళింపుచేసుకున్న విషాయాలను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను..."
ఒక్కక్షణం చెప్పాడం ఆపాడు శ్రీపతిరావుగారు. ఆక్కడ నిశ్శబ్ధం మౌనం పాటిస్తుందా అన్నట్లుంది వాతావరణమంతా. అందరి కళ్ళల్లోనూ ఆనందజ్యోతులు వెలుగుతున్నాయి. గొంతు సవరించుకుని మరలా తన ఉపన్యాసాన్ని కొనసాగించాడు శ్రీపతిరావు
" మనదేశానికి
తరగని సిరిసంపదలు వేదాలు...ఉపనిషత్తులు.వాటిసారాన్ని నిక్షిప్తం చేసిన గని భగవద్గీత. మన వేదాలను వల్లించి ప్రాశ్చాచ్యులు అదీ చిన్నతనం నుంచే జ్ణానసముపార్జనతో అభివృద్ధిని తమ సొంతం చేసుకుంటున్నారు. మనదేశంలో ఎంతమంది వేదాలను, ఉపనిషత్తులను చదువుతున్నారు ? నాలంటి
కొంతమంది వృద్ధులు మాత్రమే ! వృద్ధాప్యంలో జ్ణానాన్ని సంపాదించి ఏమనిషైనా దేశానికి చేయగలిగేదేముంది ? ఏదేశ భవిష్యత్తైనా యువకుల శక్తిసామార్ధ్యాలమీదే ఆధారపడివుంది. అటువంటి యువత తమ దేహశక్తినే కాదు జ్ణనశక్తినీ పెంపొందించుకోవాలి. యోగా,ధ్యానంలాంటి సాధనాలకు సానపెట్టి ప్రతి యువకుడు ఒ వివేకానందుడు కావాలి. మన జాతీయ జెండాను జ్ణానప్రపంచాన రెపరెపలాడించాలి. అందుకే శాంతా ఛారిటబుల్ ట్రష్ట్ నిర్మించిన స్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ వేదాలను ఉపనిషత్తులను ప్రత్యేక తరగతులుగా ప్రవేశపెడుతున్నాం... భగవంతునిచే ప్రవచించబడిన భగవద్గీతను, బైబిల్, ఖురాన్ లాంటి పవిత్రమైన మత గ్రంధాలను కూడా ప్రవేశపెడుతున్నాం. అన్ని మతాల గ్రంధాల్ని క్షుణ్ణంగా చదవండి...వాటి సారాన్ని గ్రహించండి... జ్ణానాన్ని పెంపొందించుకోండి. అందరిపట్లా సహృదయతో మెలగండి. సామరస్యంగా జీవించండి. కన్నవారిపట్లా, మతృదేశం పట్లా ప్రేమాభిమానాలతో మెలగండి... పసిపిల్లలు, స్త్రీలు, వృద్ధుల పట్లా ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రవర్తించండి. వారి ఆనందానికి హేతువుకండి. వారి ఆనందమే ప్రపంచానికి వెలుగునిస్తుంది.
ఆరి
సంతోషమే ప్రపంచానికి శాంతినిస్తుంది. సర్వేజనా సుఖినోభవంతు....
జైహింధ్
" ముగించారు
శ్రీపతిరావు గారు తన ఉపన్యాసాన్ని.
చప్పట్లతో,
గుండెచప్పుళ్ళతో
మమేకమైపోయింది ఆ ప్రాంగణం... ఆ వాతావరణం. అప్పుడె వినిపించసాగింది మైక్ నుంచి శాంతా ఛారిటబుల్ ట్రష్ట్ స్కూల్ విద్యార్ధులు ఆలపిస్తున్న గీతం మన జాతీయగీతం ...
" జన
గణ మన అధినాయక జయహే...భారత భాగ్య విధాతా...”
సాగిపోతుంది
దేశభక్తి గీతం...అందరి హృదయాలలోనూ అనురక్తి ప్రవాహం....
*****
